రూ. 50 వేలు తీసుకున్నా పర్లేదు.. ఓటు మాత్రం నాకే వేయండి: ఈటల

by Anukaran |   ( Updated:2021-10-12 06:52:07.0  )
రూ. 50 వేలు తీసుకున్నా పర్లేదు.. ఓటు మాత్రం నాకే వేయండి: ఈటల
X

దిశ, జమ్మికుంట: ఈటల రాజేందర్ వెంట ఎవరూ ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ప్లాన్ చేస్తుంటే.. హరీష్ రావు అమలు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం‌లో ఆయన మాట్లాడుతూ.. మండలంలో కవాతు చేయాలని ఇక్కడి మహిళలు కోరుతున్నారని, తప్పకుండా చేద్దామని వారికి హామీ ఇచ్చారు. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం ఎలా గెలిచిందో.. అలానే ఇక్కడ ప్రజలు గెలుస్తారని అభివర్ణించారు.

ఈ రోజు ఉన్నవారు రేపు తనతో ఉండడం లేదని ఈటల గుర్తు చేశారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను గెలిపించింది మనం కాదా? నా అండ వారికి లేకుండేనా ? అంటూ నిలదీశారు. అటువంటిది, ఇప్పుడు ఒక్కరూ లేరని, ఊరంతా ఒక దారి అయితే ఊసరవెల్లిది ఒక దారి అన్నట్టు వారు వెళ్లిపోయారని విమర్శించారు.

వాళ్లంతా వెళ్ళిపోయినా ప్రజలందరూ నాతో ఉన్నారు.. అని అనడానికి ప్రజల భారీ ర్యాలీ నిదర్శనమని పేర్కొన్నారు. దసరా పండుగకు కూడా వాళ్ళే మాంసం, డబ్బులు పంపిస్తారట, ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇస్తారట, రూ. 50 వేలు ఇచ్చినా తీసుకోండి.. కానీ, ఓటు మాత్రం నాకు వేయండని రాజేందర్ అభ్యర్థించారు. కేసీఆర్ పంచె డబ్బు, మద్యం హుజూరాబాద్‌లో చెల్లవని, ఆయన చెంప చెల్లు మనిపించేలా 30 వ తేదీన తీర్పు ఇవ్వాలని ప్రజలందరినీ కోరారు.

Advertisement

Next Story

Most Viewed