కేసీఆర్, ఈటలను నిలబెట్టింది కమలాపూర్ బిడ్డలే..

by Sridhar Babu |
కేసీఆర్, ఈటలను నిలబెట్టింది కమలాపూర్ బిడ్డలే..
X

దిశ, హుజురాబాద్ : తెలంగాణ ఉద్యమానికి ముందు ఆ తర్వాత తనకు, సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచింది కమలాపూర్ ప్రజలేనని ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్‌లో నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించగా ఈటల మాట్లాడారు. నియోజకవర్గంలో జెండాలు, పార్టీలతో సంబంధం లేదని, పాలు నీళ్ల వలే కలిసిపోవాలని అధికారంలో లేని నాడే చెప్పానన్నారు. 2002లో గజ్వేల్‌కు అక్కడ నుండి 2003లో కమలాపూర్‌కు వచ్చానన్నారు. తెలంగాణ ఉద్యమం ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిందని, కమలాపూర్ ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందానని గుర్తు చేశారు. ఉద్యమ స్పూర్తిని కాపాడింది కమలాపూర్ గడ్డే అన్నారు.

2006లో ఆత్మగౌరవం దెబ్బతిని రాజీనామా చేసి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్‌కు అండగా నిలిచింది కూడా కమలాపూర్ బిడ్డలే గుర్తుచేశారు. అడుక్కుంటే పదవులు రావని, ఒళ్ళు వంచి చెమటోడ్చి పని చేస్తేనే పదవులు వస్తాయన్నారు. ప్రత్యేక రాష్ట్ర కోసం ఎమ్మెల్యే పదవి గడ్డిపోచతో సమానమని రాజీనామా చేసిన వ్యక్తిని నేనే అన్నారు. ఎన్నికల్లో మొదటిసారి గెలవడం తేలికని, రెండోసారి అభ్యర్థి పనితనం పై ఆధారపడి ఉంటుందన్నారు. ఏ పార్టీలో నైనా, ప్రభుత్వంలో నైనా వైరుధ్యాలు ఉంటాయన్నారు. 2018 ఎన్నికల్లో కంచె చేను మేసినట్టుగా సొంత పార్టీ నాయకులే కొంత మంది వ్యక్తులను కిరాయి మనషులను పెట్టుకొని తనపై తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. నాడు నన్ను ఓడించడానికి నా ప్రత్యర్థికి డబ్బులు అందించారని ఆరోపించారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నీచపు చరిత్రకు చరమగీతం పాడేది హుజురాబాద్ ప్రజలే స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed