గుంటూరు దిగ్బంధనం.. ఢిల్లీ మోడల్ అమలు

by srinivas |
గుంటూరు దిగ్బంధనం.. ఢిల్లీ మోడల్ అమలు
X

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడం జిల్లా పోలీసు, వైద్యఆరోగ్య శాఖ సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. గత రెండు వారాలుగా గుంటూరులో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. అయినప్పటికీ కరోనా కేసుల సంఖ్య అదుపులోకి రావడం లేదు సరికదా.. హాఫ్ సెంచరీని దాటేశాయి. దీంతో మరిన్ని కఠన ఆంక్షలతో పాటు ఢిల్లీ మోడల్‌ను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో గుంటూరు నిర్మానుష్యంగా మారుతోంది.

గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ ఆదేశాల మేరకు ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అమలు చేసిన డేబైడే మోడల్‌ను అమలులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో డే బై డే పూర్తి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. గుంటూరు పరిధిలో నిన్నటివరకూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసే అవకాశాన్ని నగర ప్రజలకు కల్పించారు. కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో ఆ అవకాశాన్ని తొలగించారు. నగరాన్ని దిగ్బంధించారు. కేవలం మెడికల్ షాపులు, ఆసుపత్రులు మాత్రమే తెరచి వుంటాయని అధికారులు స్పష్టం చేశారు.

రేపు ఉదయం కూరగాయలు, నిత్యావసరాల మార్కెట్లు మాత్రమే తెరచుకుంటాయని, ఆపై రోజు విడిచి రోజు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేయాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. కూరగాయలు, నిత్యావసరాల నిమిత్తం బయటకు వచ్చేవారు, అడ్రస్ ప్రూఫ్ ను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, ఇంటి నుంచి ఒక్క కిలోమీటర్ దూరం వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని, పరిధి దాటితే, వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కనీసం రెండు వారాలకు సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేయాలని, కూరగాయలు కూడా వారానికి ఒకసారి కొనుగోలు చేయాలని అధికారులు సలహా ఇస్తున్నారు.

ఇక ఈ ఉదయం గుంటూరులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను అధికారులు మూసివేశారు. దీంతో బ్రాడీపేట, అరండల్ పేట ప్రాంతానికి, హిందూ కాలేజ్ సెంటర్ కు మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. బస్టాండ్ సమీపంలోని ఫ్లై ఓవర్‌ను మూసివేయడంతో రహదారులపై వాహనాలే కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం పూట కూరగాయలను అమ్ముకునేందుకు ఎంతో ప్రయాసపడి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన చిరు వ్యాపారులు మార్కెట్ ను తెరిచేందుకు వీల్లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఉసూరుమంటూ తెచ్చిన సరకులు విక్రయించకుండానే నిరాశగా వెనుదిరిగారు.

Tags: guntur city, corona virus, police rules, covid restrictions, lock down, collector

Advertisement

Next Story

Most Viewed