దళిత బంధు కాదు ఎన్నికల బంధు : ఎర్రబెల్లి వరదరాజేశ్వర్

by Shyam |
errrabelli-varada rajeshwara rao
X

దిశ, పర్వతగిరి : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకే దళిత సాధికారత పేరుతో దళిత బంధు పథకం అంటూ దళితులను మరోసారి మోసం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్ రావు ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్ రావు మాట్లాడుతూ దళిత బంధు పథకం కాదది ఎన్నికల బంధు మాత్రమేనని అన్నారు.దళిత ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గ పరిధిలోని దళితులకు దళిత బంధు పథకం వర్తింపజేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ దళిత బంధు పథకం వర్తింప చేయకుండా కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితుల ఓట్లు దండుకోవడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులపై కపట ప్రేమ చూపుతున్నారని అన్నారు.

దళితులను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి వ్యతిరేకించదు అని కాంగ్రెస్ పార్టీ దళిత పక్షపాతిగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని తెలిపారు.పైలెట్ ప్రాజెక్టు క్రింద దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో కాకుండా దళిత నియోజకవర్గంలో చేపట్టే విధంగా మంత్రులు చొరవ చూపకపోవడం సిగ్గుచేటన్నారు.హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ వేస్తున్న ఎత్తులు చెల్లవని,ప్రజలు గమనిస్తూనే ఉన్నారని టీఆర్ఎస్ పార్టీకి హుజురాబాద్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతోనే యథేచ్ఛగా డబ్బులు వెదజల్లి, పథకాల పేరుతో ఎన్నికల్లో గెలుపొందాలని కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తూ ఎన్నికలు ముగిశాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్ సమ్మెట సుధీర్, నాయకులు బంగారు సదానందం, బెజ్జం పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed