సంచలన నివేదిక.. పేరుకే హరితహారం.. సర్కారు డప్పుల మోతకు చెక్.?

by Shyam |   ( Updated:2021-10-01 23:12:37.0  )
సంచలన నివేదిక.. పేరుకే హరితహారం.. సర్కారు డప్పుల మోతకు చెక్.?
X

దిశ, ప్రత్యేక ప్రతినిధి : సహజసిద్ధ అడవులు ఆక్రమణల ధాటికి కొట్టుకుపోతున్నాయి. దట్టమైన అడవులు మైదానాలుగా మారుతున్నాయి. ఒకప్పటి అడవుల ఖిల్లాలు.. ఉమ్మడి ఆదిలాబాద్​, ఖమ్మం, వరంగల్, కరీంనగర్​జిల్లాలలో దట్టమైన అడవులు వేగంగా కనుమరుగవుతున్నాయి. కానీ కృత్రిమ సామాజిక వనాలు(సోషల్​ఫారెస్ట్రీ) పెరుగుతున్నాయి. మనం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా నలుదిక్కులా రహదారులకు ఇరువైపులా మూడు లేదా నాలుగు వరుసల ‘‘ఎవెన్యూ ప్లాంటేషన్’’​పచ్చదనం అలరిస్తుంటుంది. అబ్బ ఎంత పచ్చదనం అనిపిస్తుంది. కానీ లోపలకు తొంగి చూస్తూ అర్థమవుతుంది అసలు విషయం . దట్టమైన అడవులు నేలమట్టమవుతుంటాయి. వటవృక్షాలు పెలపెలమంటూ నేలకొరుగుతుంటాయి. కీకర,భీకర అభయారణ్యాలు సైతం మైదానాలుగా మారుతున్న దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి.

పోడు భూమి పేరిట కొంత, గిరిజనుల ముసుగులో అధికార బలం,అంగబలం ఉన్న పెద్దల ఆక్రమణల పర్వం మరికొంత. ప్రాజెక్ట్ ల పేరిట సర్కార్​వారి అటవీ భూముల బదిలీ కొంత ఇలా సహజ ఉనికిని కోల్పోతూ తెలంగాణ అడవితల్లి రోదిస్తున్నది. సర్కార్​ భారీ ప్రాజెక్ట్​ల వల్ల కూడా అటవీ సంపద హరించుకుపోతున్నది. ప్రాజెక్ట్‌ల కోసం అడవులను కొట్టేస్తున్న ప్రభుత్వం కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్​ కింద ప్రత్యామ్నాయ అడవులను సృష్టించడంలో విఫలమవుతున్నది. నష్టపరిహారం చెల్లించి ప్రత్యామ్నాయ భూములను కేటాయిస్తున్నప్పటికీ తాళం వేసి గొళ్లెం మరిచినట్లు చెట్లను నాటే అసలు పనిని విస్మరిస్తున్నది. దీంతో ప్రాజెక్ట్​లు పూర్తవుతున్నా మరో వైపు గ్రామాలు ,పట్టణ కేంద్రాలలో హరితహారం పేరిట పచ్చని పండుగ జరుగుతుంటుంది.

వానలు వాపసు రావాలి…. కోతులు వాపసు పోవాలి….. అన్న నినాదంతో 2015లో మొదలైన తెలంగాణకు హరితహారం వల్ల కోతులు వాపసు పోలే సరికదా అడవులు తరిగి ఆవాసాలు లేక పెద్దపులులు సైతం జనారణ్యాల వైపు పరుగులు తీసే పరిస్థితి నిత్యం ఓ ప్రత్యక్ష దృశ్యంగా కనిపిస్తున్నది. మన రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్​ సర్వే ఆఫ్​ ఇండియా ప్రకటించింది. ఏ పచ్చదనం పెరిగింది. అడవుల పచ్చదనమా ….సామాజిక వనాల పచ్చదనమా ఏది అన్నది స్పష్టత లేదు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు అటవీభూములు 10శాతం ఆక్రమణల చెరలో ఉన్నాయని అధికారుల లెక్క ఉండేది. ఇప్పుడది 12శాతంగా ఉందని రాష్ట్ర అటవీశాఖ స్వయంగా తాజా నివేదికలో తేల్చిన నిఖార్సయిన సత్యం.

ఏదీ అసలు అడవి.. ఒక శాతం మాత్రమే దట్టమైన అరణ్యం

ప్రస్తుతం రాష్ట్రంలో అటవీభూములు 66లక్షల ఎకరాలలో విస్తరించి ఉండగా అందులో 8 లక్షల ఎకరాలు ఆక్రమణకు గురైందని తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో అడవులు 26,969చదరపు కిలోమీటర్​ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. కానీ అందులో అత్యంత దట్టమైన అడవులు కేవలం 286చదరపు కిలోమీటర్​ల పరిధిలో మాత్రమే ఉన్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. అంటే ఒక శాతం మాత్రమే దట్టమైన అడవులున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇక మధ్యస్తంగా దట్టమైన అడవి 7,898చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇక అత్యధిక భాగం అంటే దాదాపు 8,510చదరపు కిలోమీటర్​ల పరిధిలో ఓపెన్ ఫారెస్ట్​ ఉంది. అంటే ఒకప్పటి అడవులు మైదాన ప్రాంతాలుగా మారాయన్న మాట. పొదలు, చిన్న చిన్న చెట్లతో కూడిన అటవీ ప్రాంతం 5,671 చదరపు కిలోమీటర్​ల మేర ఉంది. ఇవి తెలంగాణ సర్కార్​ తాజా లెక్కల ప్రకారమే. కానీ హరితహారంలో భాగంగా చేపట్టిన అటవీ పునరుజ్జీవన (ఫారెస్ట్​ రీజువినేషన్​) వల్ల 50వేల హెక్టార్లలో పచ్చదనం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఆ పచ్చదనమే ఫారెస్ట్​ సర్వే ఆఫ్​ ఇండియా పరిగణలోకి తీసుకుందని తెలిపారు. కానీ గతంలో కంటే దట్టమైన అడవులు ఎందుకు తరిగిపోతున్నాయంటే సర్కార్​ దగ్గర జవాబు లేదు.

వాస్తవానికి 2015లో మొదలైన హరితహారం కార్యక్రమం కింద ఇప్పటి వరకు లక్ష్యాన్ని మించి 239 కోట్ల వరకు మొక్కలను నాటినట్లు ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటి వరకు 6555.97కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని వల్ల గతంలో కంటే 3.67శాతం పచ్చదనం పెరిగిందని

మరో వైపు అటవీ సంపద ఎందుకు కరుగుతున్నదంటే ఆశ్చర్యం . వాస్తవానికి ఒక అడవి అంతరిస్తే మళ్లీ దానిని సహజసిద్ధంగా సృష్టించడానికి యాభైఏండ్ల సమయం పడుతుంది. అదే ఆలంకృత , పండ్ల మొక్కలతో పచ్చదనాన్ని సృష్టించడానికి మూడు నుంచి ఐదేండ్లు పడుతుంది. ప్రస్తుతం హరితహారం కింద మనకు పచ్చగా కనపడుతున్న చెట్లలో ఎక్కువగా ఆలంకృత మొక్కలే అంటే ఆశ్చర్యం లేదు. ఆ ప్రయత్నం బాగానే ఉన్నా అడవుల రక్షణను సర్కార్​ గాలికి వదిలేసిందనేది ప్రస్తుత వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే స్పష్టమవుంది.

ప్రాజెక్ట్​ల కింద భారీగా అటవీ విధ్వంసం

కాగా వివిధ సాగునీటి ప్రాజెక్ట్​లు, రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరిట వేలాది ఎకరాలలో అడవిని నరికిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ అటవీ సృష్టిలో శ్రద్ద చూపడం లేదు. కాళేశ్వరం వంటి బడా ప్రాజెక్ట్​ల కోసం తెలంగాణ సర్కార్​ 30వేల ఎకరాల అటవీభూమిని వాడుకుంది. ఈ భూమికి, అందులోని చెట్లకు ‘‘కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్​అండ్​ఫండ్​ మేనేజ్​మెంట్ ప్లానింగ్​ అథారిటీ” (కంపా) కింద నష్టపరిహారం చెల్లించినప్పటికీ ఇంత వరకు ప్రత్యామ్నాయ అడవుల పెంపకం పరిస్థితి మాత్రం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది. ఇప్పటి వరకు కేవలం 1,366హెక్టార్​లలో మాత్రమే ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.​

కాగా 2018‌‌–19లెక్కల ప్రకారం ‘‘ఫారెస్ట్​ కన్జర్వేషన్​ యాక్ట్​’’ కింద భారీ మొత్తం‌లో చెట్లను నరికివేయడానికి అనుమతినిచ్చిన రాష్ట్రాలలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ 1,21,2753 చెట్లను తొలగించడానికి అనుమతినివ్వగా కోటి 7లక్షల చెట్లను తొలగించి మహారాష్ట్ర ప్రభుత్వం రెండవ స్థానంలో నిలిచింది. తెలంగాణలో క్షీణించిన అడవులు 3.65శాతం వరకు తిరిగి ఊపిరి పోసుకున్నాయని చెప్పిన ఫారెస్ట్​ సర్వే ఆఫ్​ ఇండియా అదే సమయంలో తెలంగాణలో 155చదరపు కిలోమీటర్ల పరిధిలో ట్రీ కవర్​ తగ్గిందని వెల్లడించడం విశేషం. హరితహారం లో చూపిన శ్రద్ధ అడవుల రక్షణలో చూపితే భవిష్యత్​ పచ్చ దనంతో ఫరిడవిల్లుతుంది. లేదంటే సామాజిక వనాలు పెరిగినా సహజ అడవులు సమీప భవిష్యత్​లో కనుమరుగవడం ఖాయమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed