విద్యుత్ సుంకాన్ని సకాలంలో జారీ చేయాలి

by Shyam |
విద్యుత్ సుంకాన్ని సకాలంలో జారీ చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ చట్టం 2003 ప్రకారం పలు రాష్ట్రాలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో క్రమం తప్పకుండా విద్యుత్ టారిఫ్‌ను జారీ చేస్తున్నాయని, అయితే ఈ నిబంధనలను పలు రాష్ట్రాలు పాటించడం లేదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు, విద్యుత్ నియంత్రణ మండలిలకు లేఖ రాసింది. ఈ విషయంలో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ(ఏపీటీఈఎల్) రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిలకు పలు ఆదేశాలు జారీచేసిందని లేఖలో వివరించారు. విద్యుత్ టారిఫ్‌పై సకాలంలో స్పందించాలని సూచించడంతో పాటు ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటుకు ఒక విధానాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.

ఏపీటీఈఎల్ నిబంధనల ప్రకారం పలు రాష్ట్రాలు 2021-2022 ఆర్థిక సంవత్సారానికి విద్యుత్ టారిఫ్ ను జారీ చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఏపీటిఈఎల్ నిబంధనల ప్రాముఖ్యతను ఆయా రాష్ట్రాలు పరిగణలోకి తీసుకొని టారిఫ్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ ఘన్ శ్యామ్ ప్రసాద్ ఆ లేఖలో పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలోని డిస్కమ్స్ యొక్క ఆర్థిక స్థితులను నిర్ధారించవచ్చని అన్నారు. ఈ అంశంపై ఆయా రాష్ట్రాల ఎస్ఈఆర్ సీలు తమ నివేదికను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు త్వరగా సమర్పించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed