కరెంట్ షాక్.. అన్నదాతలతో విద్యుత్ అధికారుల వెటకారం!

by Shyam |   ( Updated:2021-12-11 11:35:16.0  )
కరెంట్ షాక్.. అన్నదాతలతో విద్యుత్ అధికారుల వెటకారం!
X

దిశ. పాపన్నపేట : గాయం ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర రాసినట్టు ఉంది విద్యుత్ అధికారుల తీరు. తప్పు ఒకరు చేస్తే రైతులందరికీ శిక్ష వేయడంతో పడరాని పాట్లు పడుతున్నారు రైతన్నలు.. యాసంగి పంట ఎలా వేసుకోవాలి.. ఏ పంట వేసుకోవాలో తెలియక తల్లడిల్లుతున్నారు. ఇంతలోనే విద్యుత్ బకాయిలు చెల్లించాలని అధికారులు గ్రామానికి చేరుకుని కరెంట్ కనెక్షన్ తొలగించారు. ఈ ఘటన శుక్రవారం మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం కొడపాక గ్రామంలో వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ప్రతీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు నెలకు 30 రూపాయలు విద్యుత్ శాఖకు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. అలా రైతులు సుమారు రూ.5 లక్షల వరకు బకాయి పడ్డారు. వీటిని చెల్లించాలని విద్యుత్ మోటార్ కనెక్షన్లను తొలగించారు.పాపన్నపేట మండల పరిధిలోని కొడపాక శివారులో మంజీరా నది పరివాహక ప్రాంతంలో సుమారు 2 వేల ఎకరాల పంట భూములు ఉంటాయి. వీటికి తోడు పక్కనే మంజీరా నది ప్రవహించడంతో రైతన్నలు పంటలు పండించుకుని దర్జాగా బతుకుతుంటారు. అయితే, ఇటీవల విద్యుత్ అధికారుల తీరు రైతన్నలను ఆత్మహత్యలకు పురిగొల్పే విధంగా మారింది. కొంతమంది రైతులు కరెంట్ బిల్లు కట్టకపోవడంతో కొడపాక గ్రామ శివారులో రైతులందరికీ సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వందలాది మంది రైతులు లబోదిబోమంటున్నారు. ఇటీవల పంటలు రాగానే మళ్లీ పంటలు వేయడానికి దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. సాగు కోసం రైతన్నలు ఇప్పటికే షావుకారు దగ్గర డబ్బులు అప్పు తెచ్చి విత్తనాలు కొని నాటేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో విద్యుత్ అధికారులు కొంతమంది రైతులు కరెంట్ బిల్లులు చెల్లించడం లేదని అందరికీ సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లకు ఏకంగా సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో కరెంటు బిల్లు కట్టినవారు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొడపాక శివారు పరిధిలో 2 వేల ఎకరాల వరకు సాగు అవుతుండగా 200 వరకు ట్రాన్స్ ఫార్మర్లు ఉన్నాయి. ఈ విషయమై కొండపాక రైతు హనుమంతు మాట్లాడుతూ.. కొంతమంది రైతులు విద్యుత్ బిల్లు కట్టకపోతే అందరు రైతులకు విద్యుత్ సరఫరా నిలిపి వేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఏఈపై అడిగితే.. అందరి బిల్లు నువ్వు కంటూ తమపై ఆగ్రహం వ్యక్తం చేశాడని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. లేనియెడల బిల్లు ఎవరెవరు కట్టలేదో వారిందరి నుంచి వసూలు చేయాలని అనడం ఎంతవరకు సమంజసమని వాపోయాడు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యుత్ బిల్లు కట్టని వారికి విద్యుత్ సరఫరా నిలిపివేసి, కట్టిన వారికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed