వై నాట్ 175.. సాధ్యమేనా!?

by Ravi |   ( Updated:2023-04-04 00:15:30.0  )
వై నాట్ 175.. సాధ్యమేనా!?
X

రాష్ట్ర ముఖ్యమంత్రి తరచుగా చేస్తున్న ఢిల్లీ పర్యటనపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అటు ఆధికారపార్టీలో ఇటు ప్రతిపక్షంలో సీఎం ఢిల్లీ పర్యటనలపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసమని ఆధికారపక్షం, స్వప్రయోజనాల కోసమని విపక్షం నిందారోపణలు చేసుకుంటున్నాయి. అయితే సీఎం ఢిల్లీ పర్యటనలు ఆశాజనకంగా లేవన్నది సుస్పష్టం. ఇటీవల పార్లమెంట్లో కేంద్రప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు, నిధుల వినియోగంపై కాగ్ ఇచ్చిన నివేదిక వంటివి కేంద్ర కార్యక్రమాలను రాష్ట్ర కార్యక్రమాలుగా ఏపీ ప్రభుత్వం చూపుతోందన్న వాదనకు బలం చేకూర్చేవిగా ఉన్నాయి. పైగా ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలు, ఏ మేరకు అదుపులోకి వస్తాయో దీనిని ఏవిధంగా పరిష్కరిస్తారో అన్నది ఆసక్తి కలిగించే ఆంశం.

హైకోర్టు నోటీసులు

మురికిపూడి గ్రానైట్‌ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్‌ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మంత్రులకు ఎంపీ... వారి బంధువులకు నోటీసులు ఇవ్వడం వైసీపీకి సంకటమే. వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీని ఇప్పటికే పలుసార్లు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ నేతృత్వంలో అధికారులు విచారించిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణలో జాప్యం విచారణ ఆధికారిని మార్చాలని సుప్రీంకోర్టు చేసిన సూచనతో సీబీఐ దూకుడు పెంచనున్న ఈ క్రమంలో త్వరలోనే సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్‌రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేసే అవకాశం ఉన్నందున సీబీఐ ఎలా వ్యవహరిస్తుందనేది పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతోంది.

రాజధాని అందని ద్రాక్షే…

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించటం. న్యాయవాదుల తీరుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేయడం, అమరావతి పిటిషన్‌ను వెంటనే విచారించాలన్న ఏపీ తరఫు న్యాయవాదుల విజ్ఞప్తిని తోసిపుచ్చడం వంటి చర్యలు గమనిస్తే ఈ విషయాన్ని చాలా నిశితంగా పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం భావిస్తోంది. జులై 11వ తేదీకి వాయిదా వేయడం అధికార పక్షానికి మింగుడు పడని అంశం. కోర్టు పరిశీలనలో ఉన్న అంశం పై ఇటీవల ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు చేసిన ప్రకటనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. పరిపాలనా రాజధానిగా విశాఖ అని తొందరపడుతున్న వారికి ఈ చర్య ఓ చెంపపెట్టు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖ నుంచి పరిపాలన అన్నది అధికార పక్షానికి అందని ద్రాక్షే.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!

ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. గవర్నర్‌తో సుదీర్ఘంగా సీఎం జరిపిన భేటీలో మంత్రివర్గ పునవ్యవస్దీకరణ గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అనూహ్యంగా మాజీ మంత్రులు కొందరికి మళ్ళీ మంత్రి పదవి దక్కే యోగం ఉన్నట్టు కనబడుతోంది. ఈ కారణంగా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో అటు పార్టీలో..ఇటు ప్రభుత్వంలో మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో అయిదుగురు నుంచి ఆరుగురు వరకు తప్పించి వారి స్థానంలో అధికారంలోకి వచ్చిన సమయంలో ఏర్పాటైన తొలి కేబినెట్‌లో పని చేసిన కొందరు సీనియర్లను తిరిగి తన టీంలోకి తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నట్లుంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలోనూ పని చేయని మంత్రుల స్థానంలో కొత్త వారు వస్తారంటూ హెచ్చరించారు. ప్రాంతీయ - సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోనున్నారు. కర్నూలు, గుంటూరు, గోదావరి జిల్లాలతో పాటుగా శ్రీకాకుళం జిల్లాల నుంచి మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సీఎం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎం తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ముందు మంత్రివర్గ పునవ్యవస్థీకరణ సమస్యలు తెస్తుందా లేదా పరిస్థితిని చక్కబరుస్తుందా అన్న ప్రశ్న పార్టీ శ్రేణులలో ఉత్పన్నమవుతోంది. అయితే, ఈ అంశాలన్నీ ప్రతిపక్షానికి దొరికిన ఆస్త్రాలుగా మార్చుకుంది. ఇది కాదనలేని సత్యం. ఏది ఏమైనా వైనాట్ 175 అన్న దిశగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు.

మరోవైపున సీనియర్లకు సైతం నేరుగా జగన్‌ను కలిసే పరిస్థితిలేదు. పార్టీలో నాయకులకు, అధిష్టానానికి అంతరం పెరగడానికి కారణం రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్న వ్యక్తి ఆజమాయిషీ నా లేక అధినేత ఉదాసీనత, లేదా భజనపరుల మాటలు చెవికి ఇంపుగా వినిపిస్తూ కఠోర నిజాలను తెలియనివ్వని కోటరీ కనికట్టా అన్నది పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. సజ్జనులు చెప్పిన మాట తూచా తప్పక జగన్ పాటిస్తారా లేదా రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కటువుగా, స్వతంత్రంగా వ్యవహరించి ఫలితాలు సాధిస్తారా అన్నది వేచిచూడాలి. కానీ స్వయం కృతాపరాధాలు తప్పక ఎన్నికల ఫలితాలపై ప్రభావాన్ని చూపిస్తాయి అనేది గత చరిత్ర నేర్పిన పాఠం.

- శ్రీధర్ వాడవల్లి

99898 55445

Advertisement

Next Story