2024 ఎన్నికల్లో యువ ఓటర్లే కీలకం

by Mahesh |
2024 ఎన్నికల్లో యువ ఓటర్లే కీలకం
X

ఏ ప్రజాస్వామ్య దేశానికైనా ఎన్నికలే కీలకం. ఓటర్ల తీర్పు ఆధారంగానే ప్రభుత్వాలు కొలువు తీరి, అధికారాన్ని చెలాయిస్తాయి అని జగమెరిగిన సత్యం. మనలాంటి ప్రజాస్వామ్య దేశం కూడా దీనికి అతీతమైనది కాదు. అయితే, మన దేశంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికలు కుల మత వర్గ ప్రాంతీయ భాషా వంటి ప్రభావంతో జరుగుతున్నవి. భవిష్యత్తులోనూ వీటి ప్రభావం ఉంటుంది. గత 2014 నుంచి పై అంశాలతో పాటు దేశభక్తి, మతం పేరుతో ఓట్లు దండుకునే కార్యక్రమం ఎక్కువైంది. పైగా ఎక్కువ మంది నిరక్షరాస్యత, పేదరికం వలన ఆయా అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ, ఆ ప్రభావానికి లోనై ఆయా పార్టీలకు ఓట్లు ఇస్తూ, గద్దె నెక్కడానికే సహాయపడుతున్నారు. అదే సమయంలో మేధావులు, చదువుకున్న వారు, నగర, పట్టణ వాసులు ఎన్నికల్లో వారి వారి ఓట్లు సద్వినియోగం చేసుకోలేకపోవడం (ఓటు వేయకుండా దూరంగా ఉంటున్నారు) పరిపాటి అయిపోయింది. ఇకనైనా అందరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవాలి. వివిధ పార్టీలు ఇచ్చే బహుమానాలకు , ప్రలోభాలకు లొంగరాదు. నీతిగా నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవడం సమంజసం.‌ తమకు, భవిష్యత్తు తరాల అభివృద్ధి కొరకు చిత్తశుద్ధితో పని చేసే పార్టీలకు అండగా నిలవాలి. రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా పని చేసే పార్టీలకు అండదండగా నిలవాలి.

భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలు

ఇక రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవి. భారత్ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్, అత్యధిక యువ జనాభా కలిగిన దేశం కూడా. 2024 ఎన్నికల్లో అదనంగా 5% శాతం అనగా నాలుగు కోట్ల 10 లక్షలమంది, కొత్తగా 18-25 సంవత్సరాల వయస్సు కలిగిన వారు నూతన ఓటర్లుగా రాబోతున్నారు. ఈ యువ ఓటర్లే కీలకం అని, అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలి.‌ వీరు విద్యావంతులు, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారు. వీరిలో నూటికి తొంభై శాతం మంది సామాజిక మాధ్యమాల్లో విహరించే వారే.‌ కావున వీరి ఆకాంక్షలు దృష్టిలో ఉంచుకుని, అన్ని రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోను సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే దేశంలో నిరుద్యోగం ఆకాశం ఎత్తు పెరుగుతుంది. ధరలు మండిపోతున్నాయి. ప్రైవేటీకరణ, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, లే అవుట్లు దేశం అంతా విస్తరించి ఉన్న ప్రస్తుత తరుణంలో, రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోను యువతకు విద్యా, నైపుణ్యాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలి.

మణిపూర్ మంటలాపేదెవరు?

అదే సమయంలో నూతన పెన్షన్ విధానం రద్దు చేసే విధంగా ప్రణాళికలు ప్రకటించాలి. రైతులకు, వ్యవసాయానికి భరోసా కల్పించాలి. పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలి.‌ ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుల మత ప్రాంతీయ భాషా లింగ ఆధారంగా ఓట్లు దండుకునే పథకాలకు స్వస్తి పలకాలి. ఇప్పుడే కర్ణాటక ఎన్నికల క్యాంపెయిన్‌లో ప్రధాన జాతీయ పార్టీలైన వారు ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకులు ఎంత దిగజారి మత పరమైన అంశాలను తలకెత్తుకుని ప్రచారం చేసారో మనం అందరం చూసాం. ఒకపక్క మణిపూర్‌లో అంతర్గత హింసలో సుమారు 54 మందికి పైగా ప్రజలు మరణించినా, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం అయినా, సుమారు 1300 మంది నిరాశ్రయులయినా, ఏమీ పట్టనట్టు కేంద్ర ప్రధాన పాలకులు అంతా ఒక రాష్ట్రం (కర్ణాటక)లో ఓట్లు దండుకునే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.‌

పౌరసమాజం అప్రమత్తత ఆవశ్యం

మనదేశం లౌకిక రాజ్యం అని, భిన్నత్వంలో ఏకత్వం అనే విషయాన్ని మరిచిపోయారు. పౌర సమాజం ఇక్కడే, ఇటువంటి సందర్భంలో అప్రమత్తంగా ఉండాలి. వాస్తవాలను విశ్లేషణ చేయాలి. మంచి వివేకంతో భవిష్యత్తు భారత్ నిర్మించాలి. ఈ ప్రక్రియలో చదువుకున్న యువత కీలక పాత్ర పోషించాలి. నూతన యువ ఓటర్లే భవ్య భారతికి దిశానిర్దేశం చేయాలి.‌ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవాలి అన్నా, భారత్ రాజ్యాంగ ఆశయాలు సాధించాలన్నా, ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద సమాఖ్య వ్యవస్థ భారత్‌లో మరింతగా ప్రాధాన్యత సంతరించుకోవాలి అంటే అందరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి. ప్రలోభాలకు లొంగకుండా, నీతిగా నిజాయితీగా ఓటు వేసి, భవిష్యత్తు భారత్ నిర్మించే వారికి అండదండలు అందించాలి. యువ ఓటర్లే కీలక పాత్ర పోషించాలి.

ఐ. ప్రసాదరావు

99482 72919

Advertisement

Next Story