యోగా అంటే ఆసనాలు కాదు..!

by Ravi |   ( Updated:2024-12-11 00:46:02.0  )
యోగా అంటే ఆసనాలు కాదు..!
X

'యోగా 'అంటే కలయిక అని అర్థం. ఇది 'యుజ్ ' అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. దీనిని ఆధ్యాత్మిక భావంతో ఆలోచించినప్పుడు జీవాత్మ, పరమాత్మతో కలయిక చెందడం అని, దీనినే సాధారణ భావంలో చూస్తే శరీరం, మనస్సు కలయికగా మనం అర్థం చెప్పుకోవచ్చు. ఈ కలయికని మనం ఆసనాలు, ప్రాణయమాలు, ముద్రలు ధ్యానం అనే ప్రక్రియల ద్వారా సాధించుకోవచ్చు.

యోగా అంటే యోగాసనాలు మాత్రమే అని ప్రస్తుత జనసామాన్యంలో ఒక భావం ఉంది. కానీ తనను తాను తెలుసుకోడానికి, తనలో తాను అన్వేషంచడానికి యోగా సాధన చేస్తారు. అయితే, తనలో తాను ఎంత లోతుకు వెళతాడో, అంతే లోతుకు ఎదుటివారిలోకి కూడా వెళ్లగలడు. మీలోకి మీరు చూడగలిగితే, అంతే స్థాయిలో ప్రతి దానినీ చూడగలరు. కాబట్టి యోగాలో కొన్ని మనకు అందుబాటులో ఉన్నవి, ఆచరణ సాధ్యమైన యోగా పద్ధతులు ఎనిమిది ఉన్నాయి. రాజ యోగం, కర్మ యోగం, బుద్ధి యోగం, జ్ఞాన యోగం, హఠ యోగం, లయ యోగం, మంత్ర యోగం, భక్తి యోగం. అన్ని ఒకే యోగా శాఖలు అనిపించినా, సాధన విధానంలో చాలా భేదాలున్నాయి. అందరు అన్ని చేయలేరు కాబట్టి, ఒక్కో వ్యక్తి తన మానసిక స్థితిని బట్టి, సంస్కారాన్ని బట్టి ఒక్కొక్క యోగా అనుకూలిస్తుంది. ఇందులో మొదటి నాలుగు రాజయోగాలు గాను, మిగిలిన నాలుగు హఠయోగాలుగాను విభజించారు. మన దారులు వేరైనా గమ్యం ఒక్కటే అని ఈ యోగా పద్ధతులు తెలుపుతాయి.

యోగా ఎందుకంటే..?

చాలా మంది యోగా అంటే ఫిట్‌నెస్ కోసం చేసే కార్యక్రమంగా చూస్తున్నారు. లేదా యోగా ద్వారా మానసిక ఒత్తిడికి ప్రశాంతత చేకూరుతాయని భావిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం అనుభవంతో సాధనతో గ్రహించవలసిందే! అయితే, ఎన్ని బోధలు చేసినా ఒక్క అనుభవానికి సాటిరాదు. శరీరంతో ఎవరూ ఆలోచించరు. కానీ శరీరం నిశ్చలం కావడం అవసరం. శరీరం నిశ్చలం అయితేనే ఆలోచన పై మెట్టుకు చేరుకుంటుంది. కనుక యోగా సాధనలో శరీరం నిశ్చలం కావడానికి ఆసనాలు, ముద్రలు అవసరమైనాయి. ఆ తర్వాతది మనస్సు, మనస్సు నిశ్చలం కావడానికి అనేక ప్రక్రియలు అవసరమైనాయి. అవే అష్టాంగాలు యమ, నియమము, ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యహారం, ధారణ, ధ్యాన, సమాధి. మనం సంఘంలో ఎలా ఉండాలో యమ చెబుతుంది. ఎలా ఉండాలి అనేవి నియమంలో ఉంటుంది. శరీరాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలనే దాని గురించి ఆసనాల్లో ఉంటుంది. శ్వాసని నియంత్రించే విధానం ప్రాణాయామం. ఇంద్రియాలని ఎలా స్వాధీనం చేసుకోవాలో ప్రత్యాహారంలో ప్రస్తావిస్తారు. (అయితే ఇక్కడ పేర్కొన్న 5 భాగాలని కలిపి బహిరంగంగా పేర్కొంటారు. చివరి 3 భాగాలయిన ధారణ, ధ్యాన, సమాధిని కలిపి అభ్యంతర యోగాగా పేర్కొంటారు.) ధారణ, ధ్యాన, సమాధులు మూడు కలిసిన స్థితినే 'సంయమం' అని కూడా అంటారు. సంయమము అంటే మనస్సుని ఆధీనంలో పెట్టుకోవడం. ఇది ఒకదాని తర్వాత మరొకటి కలిగి చివరికి ఈ మూడు ఏకం కావడం చేతనే దీనిని సంయమం అన్నారు. ఇలా ధారణ, ధ్యానము, సమాధి ఏకమై సంయమం చేకూరినప్పుడే సాధకుడు జ్ఞానసిద్ధిని పొంది తన జీవిత ధ్యేయమైన పరమాత్మ యదార్ధ(reality) స్వరూపాన్ని దర్శించగలుగుతాడు.

యోగా ఉపయోగాలు..

మనిషికి వచ్చే కష్టాలన్నీ ప్రస్తుతంలో బతకకుండా భవిష్యత్తులో బతకడం వల్లే వస్తాయి. యోగా ఇప్పుడు, ఇక్కడ, ఈ క్షణంలోనే నిన్ను ఉండనిస్తుంది. ప్రస్తుతాన్ని కలలతో నాశనం చేయకుండా ఈ క్షణాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడు అని చెప్తుంది. ప్రస్తుతం మనిషి బతుకు ఉరుకులు పరుగులు.. మనిషి నిశ్చింతగా జీవించే అవకాశం వున్నా, అత్యాశతో వ్యామోహాలతో మానసిక ఒత్తిడి పెంచుకుంటున్నాడు. మానసిక శాంతికి, ఒత్తిడులు తగ్గించుకోవడానికి యోగా అవసరమవుతోంది. మీరు కనుక యోగా చేస్తే గతం గురించి, భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించరు. కేవలం ఈ క్షణం గురించి మాత్రమే ఆలోచించేలా చేస్తుంది. నీవేప్పుడైతే ఈ క్షణం గురించడం ఆలోచించడం మొదలు పెడతావో.. నీవు జీవితాన్ని బ్రమల్లో బతకకుండ ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతావు. యోగా అవగాహన ఉన్నవారి దృష్టి ప్రాపంచిక సుఖ భోగాలపైన, సంపదలపైన, భాగ్యాలపైన ఉండదు. వీలైనంత వరకు అనుభవించి వాటిపైన వ్యామోహం పెంచుకోరు. సాధన ముందుకు సాగిన కొద్దీ అవరోధాలు ఒక్కొక్కటిగా బలహీనపడి తొలగిపోతుంటాయి. కనుక యోగా ప్రారంభించడానికి అన్ని కోరికల్ని చంపుకోనవసరం లేదు. బాధ్యతలు నుండి విముక్తి కానవసరం లేదు. సంసారం వదిలి పారిపోవలసిన అవసరం అంతకన్నా లేదు. వృద్ధాప్యం వరకు వేచి ఉండనవసరం లేదు. ఒక్కసారి మనస్సు శూన్యం కాగలిగితే చాలు యోగాలో కాళ్లు నిలదొక్కుకున్నట్లే.

యం. మునేందర్

ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల

81067 35753

Advertisement

Next Story

Most Viewed