- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన్ కి బాత్ వన్ సైడ్ ముచ్చటేనా
ప్రధానమంత్రి నరేంద్రమోడీ (మన్ కి బాత్) మనసులోని మాటలో ఏముంది? సూటిగా చెప్పాలంటే ఆయన మాట మాత్రమే... వన్ సైడ్ ముచ్చట మాత్రమే ఉంది! తొమ్మిది ఏండ్ల మోడీ పాలనలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. బహుశా దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టని మొట్టమొదటి ప్రధాని మోడీనే అవుతారు! కార్యకర్తలు, అభిమానులు ఈ ప్రసారాన్ని వింటున్న ఫోటోలు, వీడియోలు కూడా పంపే పనిలో ఈసారి నిమగ్నం అయ్యారు! మంత్రులు, సీఎంలు మొత్తం 11 దేశాల్లో వందవ మనసులో మాట ఎపిసోడ్ చూసినట్లు వార్తలు వచ్చాయి! భారీగా ఏర్పాట్లు కూడా చేసారు.సెల్ఫీ విత్ ఆడపిల్లలు అనే పిలుపును కూడా ఇచ్చి, కొన్ని ఫోటోలను పెట్టారు. కొందరు తండ్రులతో పీఎం మాట్లాడారు! మంజూర్ అనే ఒక ముస్లింతో కూడా పీఎం మాట్లాడారు! ఇదిలా ఉండగా, ఒకవైపు ఇటీవల తెలంగాణ వచ్చిన హోంమంత్రి మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామంటారు. ఈనెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో ముస్లింల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని! ముస్లింల ఓట్లు తమకు లేకున్నా పర్వాలేదు అంటారు. పీఎం ఏమో ఒక ముస్లింకు ఫోన్ చేసి యోగ క్షేమాలు అడుగుతారు. ఇంతకీ బీజేపీ విధానం ఏంటి?
రెజ్లర్ల మనసులో మాట వినరా?
గత పది రోజులుగా బీజేపీ ఎంపీ, ఆల్ ఇండియా రెజిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు చేస్తున్న ధర్నా ఇప్పుడు దేశంలో పెద్ద ఇష్యూ అయిపోయింది. చివరకి సుప్రీంకోర్ట్ బ్రిజ్ భూషణ్ మీద కేసు నమోదు చేయాలని ఆదేశిస్తే అతని మీద రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ దీక్షకు వివిధ రంగాల్లోని క్రీడాకారులు, విపక్ష రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సీపీఎం నేత బృందా కారత్ ధర్నా వద్దకు వెళ్లి తమ మద్దతు ప్రకటించారు. అయితే ఈ ధర్నా జరిగే సమయంలోనే మోడీ మాన్ కి బాత్ లో మా గురించి మాట్లాడాలని, లేదా మాట్లాడే అవకాశం ఇవ్వాలని సాక్షి మాలిక్ అనే రెజ్లర్ కోరగా, అది జరగలేదు. అయితే ఈ వేధింపులపై మోడీకి గతంలోనే ఫిర్యాదు చేయగా నేను చూసుకుంటానని హామీ ఇచ్చి కనీసం ఇప్పుడు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. నిజానికి బ్రిజ్ భూషణ్ ఒక పెద్ద మాఫియా. ఒకసారి సమాజ్ వాది పార్టీ నుంచి, ఐదు సార్లు బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఇతనిపై 38 కేసులు ఉన్నాయి. ఎన్నికల్లో బీజేపీకి వీరు హార్డ్ కోర్‌లు, రాజకీయంగా వీరి అవసరం ఉంటుంది కాబట్టి వారికి బారా కూన్ మాఫ్ చేస్తున్నారు అంటున్నారు విశ్లేషకులు.
మాట్లాడటమే... వినేది లేదా?
మాన్ కి బాత్ వందో ఎపిసోడ్ కార్యక్రమాన్ని ఫుల్ ప్రచారం చేశారు. ప్రభుత్వ విభాగం సర్వే ప్రకారం 99 ఎపిసోడ్‌లలో మన్ కి బాత్‌ను వంద కోట్ల మంది విన్నారట. మొత్తం దేశంలోని 500 ఆకాశవాణి కేంద్రాల్లో, 34 దూర దర్శన్ ఛానల్స్‌లో, 52 భాషల్లో, 11 విదేశీ భాషల్లో దీని ప్రసారం చేశారు. వంద కోట్ల మంది విన్నారని ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ 100వ ఎపిసోడ్ తర్వాత జరిగిన ఒక సర్వేలో 62 శాతం మంది అసలు ఈ కార్యక్రమం గురించే తెలియదు అన్నారు. మరి వందకోట్ల మంది ఎలా వింటారు?
అలాగే ఆకాశవాణిలో మొత్తం 26,129 మంజూరి పోస్టులు ఉండగా ఖాళీలు 13,966 ఉన్నాయి! దూరదర్శన్‌లో 19,662 మంజూరు పోస్టులకు గాను, ఖాళీలు 12,420 ఉన్నాయి! మన్ కి బాత్ వందవ ఎపిసోడ్‌లో ఈ ఖాళీలను భర్తీ చేసే విషయాన్ని కూడా పీఎం చెబితే బాగుండేది. నిజానికి రేడియోను బతికించింది 'ఎఫ్ఎం' మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. పలు ఛానల్స్‌లో ఎఫ్ఎం కార్యక్రమాల వల్ల రేడియోను బతికిస్తున్నాయి. ప్రోత్సాహం ఉండాలి. ఖాళీలు భర్తీ చేయాలి. నిజానికి మన్ కి బాత్‌లో పీఎం ఛానల్‌లోనే లైక్స్ 5వేలు దాటింది లేదు. గతంలో మాదిరి యాడ్స్ కూడా, అంటే స్పాన్సర్స్ లేరు! ప్రభుత్వ విభాగాల యాడ్స్ మాత్రం ఉన్నాయి. వంద కోట్ల మంది విన్నారు. చూసారు, అంటే ఎట్లా! భేటీ పడావో! భేటీ బడావో! అంటూ బిడ్డల మీద ప్రేమ వ్యక్తం చేసే పీఎం నరేంద్ర మోడీకి ఢిల్లీలో తన ఇంటికి సమీపంలోనే న్యాయం కోసం ఆందోళన చేస్తున్న కుస్తీ క్రీడా బిడ్డలు కనబడడం లేదా? ఇలా తెలిసి, తెలియనట్లు, చూసి చూడనట్లు చేస్తే ఎట్లా మోదీజీ!
మౌనం అర్ధాంగీకారమేనా?
పుల్వమాలో 40 మంది జవాన్ల హత్య మీద మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పిన విషయాలపై మౌనం వహిస్తారు. ఆయన ఇంటికి సీబీఐ వెళుతుంది. గౌతమ్ అదానీ 12 లక్షల కోట్ల స్కాంపై మాట్లాడరు! ఇప్పుడు మహిళా కుస్తీ క్రీడాకారిణిల మీద బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ దాష్టీకం, లైంగిక వేధింపుల మీద మాట్లాడరు. పీఎం మోడీజీ కనీసం నోరు తెరిచి అయినా న్యాయం చేయండి! పీఎం, హోంమంత్రి ఇద్దరూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ ఉన్నట్లున్నారు. ఎందుకంటే అన్నింటికన్నా ముఖ్యంగా వారికి ఎన్నికలు, అందులో గెలువడాలు ముఖ్యం కదా. అందుకే కనీసం ఈ వందో 'మన్ కి బాత్ ' ఎపిసోడ్‌లో నైనా ప్రజల మన్‌కి బాత్‌కు విలువ ఇస్తారని, భావిస్తే ఉత్తదే అయ్యింది! ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చే హామీ గురించి, ధరలు తగ్గించే విషయం, నల్లధనం వెలికి తీసి 15 లక్షలు అందరి ఖాతాల్లో వేసే విషయం, అసమానతల విషయంలో, మహిళల మీద దాష్టికాల విషయంలో నిందితుల మీద తీసుకున్న చర్యల గురించి చెప్పండి. మాట్లాడండి! బిల్కీస్ బానో కేసులో శిక్షలు పూర్తి కాకుండానే 11 మంది నేరస్తులను విడుదల చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు వారిని వేదికలు ఎక్కించి గౌరవం ఇస్తున్నారు. అంతర్జాతీయ మహిళా కుస్తీ క్రీడాకారుల ఆందోళన, ఘోష వినండి. దేశం మిమ్మల్ని ఈ విషయాల మీద వినాలని భావిస్తున్నది మోదీజీ! కుచ్ తో బోలో పీఎం జీ! లేకపోతే మౌనం అర్ధాంగీకారం అయిపోతుంది! మోదీజీ!
ఎండి.మునీర్
సీనియర్ జర్నలిస్ట్
99518 65223