- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరల్డ్ వాక్:కలవరపెడుతున్న ద్రవ్యోల్బణం
అవసరానికి మించి విలాసవంత జీవితానికి అలవాటు పడుతూ ఉండుట శ్రేయస్కరం కాదని గ్రహించాలి. చివరికి తమ పిల్లల పెంపకంలో కూడా తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. దీంతో అనేక అనర్థాలు సమాజంలో విజృంభిస్తున్నాయి. ఇటు ఆదాయం లేక అల్లాడుతున్న ప్రజలతో, అటు అధిక ఆదాయంతో అనేక సమస్యలు తెచ్చుకుంటున్నవారితో ప్రస్తుత భారతదేశ పయనం కొనసాగుతోంది. ఏదేమైనా అత్యల్ప ఆదాయం, అనవసర ఖర్చులు, వృథా వంటివి, రూపాయి విలువ పతనం, దిగుమతుల ప్రభావం వలన ద్రవ్యోల్బణం పడగవిప్పి నాట్యం చేస్తున్నది. ప్రజలు, ప్రభుత్వాలు తమ పరిధిలో పలు జాగ్రత్తలు, నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చని గుర్తించాలి.
ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న శత్రువులాగా దేశంలో సామాన్య, మధ్య తరగతి ప్రజల మీద అధిక ధరలు పగ తీర్చుకుంటున్నాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) 13.11 శాతం, వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) 6.07 శాతంగా కొనసాగుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా గ్లోబలైజేషన్ ప్రభావంతో చాలా దేశాలు దిగుమతులపై ఆధారపడి ఉంటున్నాయి. మనం చాలా వస్తువులు మన స్వశక్తితో తయారు చేయగలం. చైనా వంటి దేశాలు వస్తువులు ఉత్పత్తి చేయడమే కాకుండా మనలాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. దీంతో మనం కూడా దిగుమతులపై ఆధారపడి ఉండడం గమనించదగిన విషయం. సమస్య వచ్చినప్పుడు చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా 'రష్యా-ఉక్రెయిన్' యుద్ధంతో ఈ పరిణామాలు కళ్లారా చూస్తూనే ఉన్నాము.పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం. ఆ దేశాల నుంచి వచ్చే సన్ ఫ్లవర్ ఆయిల్, స్టీల్, బార్లీ, గోధుమలాంటి అనేక వస్తువులు సరఫరా లేకపోవడంతో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. దీనికి మన భారతదేశం కూడా అతీతం కాదని గ్రహించాలి.
అందుచేతనే అనేక వస్తువులు ధరలు పెరిగి మన దేశంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సంపాదనలో అధిక భాగం పెట్రోల్, డీజిల్, మంచి నూనె, ఇతర ఆహార పదార్థాలు కొనడానికే సరిపోతోంది. ఆహార ధాన్యాలు టోకు సూచీ 8.5 శాతం, వినియోగదారుల ధరల సూచీ 5.9 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాలలో ఇది ప్రజలను ఋణగ్రస్తులను చేస్తుంది. 'లోన్ యాప్'లో చిక్కుకున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన ఇంటిలో కూడా వంట చేసుకునే అవకాశం ఉన్నా, కర్రీ పాయింట్, ఫాస్ట్ ఫుడ్స్, రెస్టారెంట్లకు అలవాటు పడుతున్నాం. పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో వంటగది నిర్మాణం అవసరం ఉండదేమో అనిపిస్తోంది. కావున స్వావలంబన దిశగా అడుగులు వేయాలి.
దూరదృష్టి లేని ఫలితం
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచాయి. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుగుతున్న వేళ ఇప్పటికీ దేశంలో ఇంకా అనేక సామాజిక రుగ్మతలు మనలను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆర్థిక అసమానతలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అధిక జనాభా, అవిద్య, నిరుద్యోగం. దీనికి తోడు గత రెండు సంవత్సరాలుగా వెంటాడుతున్న కరోనా వలన ఉపాధి కోల్పోయిన ప్రజలు కోట్ల సంఖ్యలో ఉండటం. 'మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు' రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సమస్తం అస్తవ్యస్తంగా మారిపోయింది.
నేటికీ దేశంలోని పది శాతం జనాభా సంవత్సర ఆదాయం మూడు లక్షల లోపే ఉండడం గమనార్హం. మిగిలినవారి పరిస్థితి మరీ అద్వానంగా తయారైంది. ఇక సామాన్య మధ్య తరగతి 50 శాతం జనాభాలో 22 శాతం మంది మాత్రమే వేతన జీవులు. ఏప్రిల్ 2022 క్రిసల్ (సీఆర్ఐఎస్ఐఎల్) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం వేతన పెరుగుదల 5.7గా ఉండగా, అదేసమయంలో ద్రవ్యోల్బణం రేటు 6.4 శాతంగా నమోదు అయ్యింది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అయి సామాన్య మధ్య తరగతి ప్రజలు జీవితాలు దుర్భరం అవుతున్నాయి.
రోగానికే ఖర్చులు ఎక్కువ
ఇక మన దేశంలో ప్రభుత్వాలు ఆరోగ్య రంగానికి ప్రపంచంలోని చాలా దేశాల కంటే తక్కువ నిధులు ఖర్చు చేస్తున్నాయి. అందువలన చాలామంది తమ ఆదాయంలో ఎక్కువ భాగం వైద్య ఖర్చులకు, ప్రైవేటు ఆసుపత్రులకు ధారపోసి బతుకులు బుగ్గి చేసుకుంటున్నారు. దీనికి తాజా ఉదాహరణలు కరోనా కాలంలో చూసాం. కోవిడ్ మరణాలు లక్షల సంఖ్యలో నమోదయ్యాయి. చాలామంది తమ ఆస్తులను, ఆదాయాలను కోవిడ్ చికిత్స కోసమే ఖర్చు చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు యథేచ్ఛగా దోపిడి కొనసాగించి అనేక మంది జీవితాలను చిందరవందర చేశాయి. మెడికల్ టూరిజానికి ఇండియా 'హాట్‌స్పాట్' గా ఉంటున్నది. ప్రజలు తమ ఆదాయంలో 60 శాతం ఒక్క ఆరోగ్యం కోసం ఖర్చు చేయడం విషాదకరం.
ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే అత్యంత ఎక్కువగా వైద్య ఖర్చు ఉంటున్నది. అదే సమయంలో 'బడి-దోపిడి' కూడా. చాలామంది ప్రైవేటు పాఠశాలల మోజులో పడి తమ ఆదాయంలో ఎక్కువ శాతం తమ పిల్లల చదువుకు వెచ్చిస్తున్నారు. ఎల్‌కేజీ చదువులకు కూడా వేలు, లక్షలు ధారవోస్తున్నారు. ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి రకరకాల పేర్లతో, సెక్షన్లు క్రియేట్ చేసి, లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. పౌర సమాజమా మేలుకోవాలి. ఆలోచన చేయాలి. ప్రభుత్వ బడుల వైపు ప్రయాణం చేయాలి.
ప్రజలను బాది ఆదాయం
ఇక ప్రభుత్వాలు కూడా రకరకాల పన్నులు, సెస్ రూపంలో ప్రజలను బాదుతూనే ఉన్నాయి. ఇదంతా సామాన్య ప్రజల నడ్డి విరిచే పని మాత్రమే. ఒకపక్క సంక్షేమ పథకాలు ఇస్తూ, మరొక పక్క అనేక పన్నుల భారాలు వేసి అధిక ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి. కార్పొరేట్ టాక్స్ 15 శాతం ఉండగా, అదే వేతన జీవులు తమ ఆదాయంపై 30 శాతం పన్ను కడుతూ కుదేలవుతున్నారు. అసంబద్ధ పన్నుల విధానంతో ధనవంతులు మరింత ధనవంతులు అవుతుంటే, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఇకనైనా పన్నుల విధానం మారాలి.బడా పారిశ్రామికవేత్తలకు, సంస్థలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు తగ్గించాలి.
గత రెండు సంవత్సరాలుగా భారత్‌లో బిలియనీర్‌ల పెరిగింది. అదే సందర్భంలో స్విస్ బ్యాంక్‌లో మరలా బ్లాక్ మనీ పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. గత సంవత్సరం చివరలో 'పండోరా పేపర్'లో వచ్చిన అక్రమ ఆదాయ సంపాదనాపరుల జాబితాలో వాస్తవాలు విశ్లేషణ చేయాలి. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ డబ్బుతో ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. తలసరి ఆదాయం పెరుగుదలకు దోహదం చేయాలి. స్థానిక ఉత్పత్తులు ప్రోత్సహించాలి. ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గించుకోవడం ద్వారా ప్రజలు స్వయం స్వావలంబన సాధిస్తారు అని గ్రహించాలి.
ఇలా చేస్తే మేలు
చమురుపై ఎక్సైజ్ పన్ను తగ్గించడం ద్వారా వస్తువుల ధరలు తగ్గి, ప్రజలకు ఊరట లభిస్తుంది. ఈ- వెహికిల్ (ఎలక్ట్రిక్ వాహనాలు) వినియోగం ప్రోత్సహించాలి. ప్రజలు కూడా ఆహారవృథాను అరికట్టాలి. ఆర్భాటాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. 'నేటి పొదుపు-భవితకు మదుపు' అని గ్రహించాలి. ఎంత ఎక్కువగా సంపాదిస్తున్నారో, అంతకంటే ఎక్కువగా ఖర్చు పెడుతూ అవసరానికి మించి విలాసవంత జీవితానికి అలవాటు పడుతూ ఉండుట శ్రేయస్కరం కాదని గ్రహించాలి.
చివరికి తమ పిల్లల పెంపకంలో కూడా తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. దీంతో అనేక అనర్థాలు సమాజంలో విజృంభిస్తున్నాయి. ఇటు ఆదాయం లేక అల్లాడుతున్న ప్రజలతో, అటు అధిక ఆదాయంతో అనేక సమస్యలు తెచ్చుకుంటున్నవారితో ప్రస్తుత భారతదేశ పయనం కొనసాగుతోంది. ఏదేమైనా అత్యల్ప ఆదాయం, అనవసర ఖర్చులు, వృథా వంటివి, రూపాయి విలువ పతనం, దిగుమతుల ప్రభావం వలన ద్రవ్యోల్బణం పడగవిప్పి నాట్యం చేస్తున్నది. ప్రజలు, ప్రభుత్వాలు తమ పరిధిలో పలు జాగ్రత్తలు, నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చని గుర్తించాలి.
ఐ. ప్రసాదరావు
63056 82733