తరాలకు వారధి మహిళ

by Ravi |   ( Updated:2023-03-08 02:29:47.0  )
తరాలకు వారధి మహిళ
X

శయ సాధనలో అలుపెరుగక పోరాడుతూ అవాంతరాలనధిగమిస్తూ అంచెలంచెలుగా తనస్థానాన్ని నిలుపుకుంటున్నది మహిళ. మహిళ లేని జగతిని పరిణతి లేని ప్రకృతిని ఊహించగలమా! మానవ మనుగడకు మూలం స్త్రీ కాగా అంతటా నిండిన ఆమెకు మరి గుర్తింపేది. మహిళల సాధికారతకు గుర్తుగా,మహిళలు ఎదుర్కొనే సమస్యల ఫలితంగా,వివక్షతకు వ్యతిరేకంగా కార్మిక ఉద్యమం నుండి పుట్టింది మహిళా దినోత్సవం.

1908 లో మెరుగైన జీవితం, తక్కువ పనిగంటలు, ఓటు హక్కుల కోసం మొదట న్యూయార్కులో తమ సమస్యలకై పోరాడినారు. 1910 ప్రతీ సంవత్సరం ఏదో ఒకరోజు అంతర్జాతీయ స్థాయిలో మహిళా దినోత్సవం జరుపుకోవాలని సూచించిన మహిళ -క్లారా జెట్కిస్ 1910 కోపెన్ హగ్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్ సదస్సులో ఆమె ప్రతిపాదన చేయగా దానిని 100మంది పలు దేశాలకు చెందిన మహిళలు ఏకగ్రీవంగా అంగీకరించారు. దాని ఫలితంగా అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ఆనాడు జరిపినారు.

1913 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించగా కొన్ని దేశాల్లో యాంటి సెక్సిజం డే గా, ఇంకొన్ని దేశాల్లో వివక్ష వ్యతిరేక దినోత్సవంగా, ఇంకొన్ని దేశాల్లో సివిల్ అవేర్ నెస్ డే గా మహిళల హక్కులకై సమ్మె ప్రారంభించిన రోజును పిలుస్తున్నారు. 1917లో రష్యా మహిళలు ఆహారం -శాంతి నినాదం చేస్తూ సమ్మె ప్రారంభించారు. రష్యా వారు అనుసరించే జూలియస్ క్యాలెండర్ ప్రకారం సమ్మె ప్రారంభించిన రోజు ఫిబ్రవరి -23(ఆదివారం) ఇప్పుడు అమలులో ఉన్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అది మార్చి 8 సమ్మెలు పోరాటాల ఫలితంగా 1975 సం లో ఐక్యరాజ్యసమితి ప్రతీ సంవత్సరం ఒక ప్రధాన ఇతివృత్తాన్ని ఎంచుకోవాలని ఆదిశగా అభివృద్ధి సాధించాలని నిర్ణయించి 1975 సంవత్సరాన్ని 'గతాన్ని వేడుక చేసుకోవడం భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం' అనే ఇతివృత్తంతో మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. కాగా 2023 సంవత్సరానికి DigitALL లింగ సమానత్వం కోసం ఆవిష్కరణ, సాంకేతికత అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు.

2011 మార్చి 8 న శతాబ్ది వేడుకలు జరుగగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మార్చి నెలను మహిళల చరిత్ర నెలగా ప్రకటించారు. మరి శతాబ్ది ఉత్సవాలు జరిగినా పూర్తిగా లింగ సమానత్వం సాధించలేదు మహిళలు. వ్యాపారం, రాజకీయం వంటి రంగాలలో ఇప్పటికీ మహిళలు సమాన స్థాయిలో లేరు. రోజు రోజుకీ మహిళల పట్ల అత్యాచారాలు ,హింస, వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. మహిళలకు రక్షణ చట్టాలైన 1948 కనీస వేతన చట్టం,1961వరకట్న నిషేధ చట్టం,1976 సమాన వేతన చట్టం, 2005 గృహహింస నిరోధ చట్టం, 2013 నిర్భయ చట్టం ఇలా ఎన్నో చట్టాలు హక్కులు ఉన్నా మహిళలు మతం, ఆచారం, సంస్కృతి, వరకట్నం సమస్యల పేరిట హత్యలకీ లైంగిక అత్యాచారానికీ ఆహుతైపోతూనే వున్నారు.

నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి అన్నమాటకు స్వస్తిపలికి యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అన్నమాటలు నిజమవ్వాలంటే స్త్రీకి గుర్తింపు ముందుగా ఇంటిలోనుండే మొదలవ్వాలి. బయట అందలాలెక్కినా ఇంట్లో ఆదరింపు గుర్తింపు లేక ఎందరో మహిళలు వేదనకు గురవుతుంటే కాలు బయటపెట్టిన మగువపై కామాంధులు డేగ కన్నేస్తుంటే నరమృగాల కోరల్లో చిక్కుకొని కాలంకాటుకు బలియయ్యే అబలలు ఎందరో.

మహిళా దినోత్సవం వేళ మాత్రమే మహిళలకు పెద్దపీటవేసి అందలాలనెక్కించే నేటి సమాజ ఆలోచనా విధానంలో మార్పురావాలి. మాతృవత్ పరదారేషు అన్నది నిజమై ఆంక్షల సంకెళ్ళు తెంచబడితే సాగిపోయే మహిళకు ఆకాశమే హద్దు.

అడ్డగూడి ఉమాదేవి

9908057980

Advertisement

Next Story

Most Viewed