- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చీఫ్ జస్టిస్ రాష్ట్రపతి అవుతారా?
ప్రస్తుతం దేశ ప్రజలందరి మెప్పు పొందుతున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణకు రాష్ట్రపతి పదవిని అలంకరించే అర్హతలన్నీ ఉన్నాయనే మాట వినబడుతోంది. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి చేరుకున్న వ్యక్తిగా ఆయనకు పేరుంది. గతంలో రాష్ట్రపతిగా పని చేసిన తటస్థులే పదవికి వన్నె తెచ్చారు. ఎన్‌వీ రమణను ముందుకు తీసుకు వస్తే బీజేపీ సహా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో సముచిత నిర్ణయం కూడా అవుతుంది.
దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి. అలాంటి గొప్ప పదవికి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. 14 వ రాష్ట్రపతిగా ఉన్న రాంనాథ్ కోవింద్ పదవీకాలం ఈ ఏడాది జూలై 25 తో ముగియనుంది. ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలతో బీజేపీ మంచి ఊపు మీద ఉన్నది. ఇప్పుడున్న ఎలక్టోరల్ సభ్యుల సంఖ్యా బలం చూసుకున్నట్లయితే రాష్ట్రపతి పదవికి బీజేపీ ప్రతిపాదించే అభ్యర్థి రాష్ట్రపతి కావడం అనివార్యంగా కనబడుతున్నది. అయితే. నేడు దేశంలో రాజకీయ పరిస్థితులు ఎన్నడూ లేనంతగా గందరగోళంగా ఉన్నాయి.
ప్రాంతీయ అసమానతలు, కులాల కుంపట్లు, మతపర అంశాలు, అధికారమే పరమావధిగా రాజకీయాలు చేయడం వలన అనుకున్న కార్యాలు అనుకున్నట్లుగా జరుగుతాయనే రోజులు పోతున్నాయి. ఇందుకు అన్ని పార్టీలతో పాటు బాధ్యత మరిచిన ప్రజలు కూడా కారణమే సుమా! దేశంలో అత్యున్నత కార్యనిర్వాహక అధిపతి అయిన ప్రధానమంత్రి పదవి ఇంచుమించు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒకటి రెండు సార్లు మినహా ఎక్కువగా ఉత్తర భారతదేశానికి చెందినవారికే లభించింది. మారుతున్న పరిస్థితులలో ప్రధాని ఉత్తర భారతదేశానికి చెందినవారు అయితే, రాష్ట్రపతి పదవి దక్షిణాది రాష్ట్రాలకు రావడం రాజకీయంగా, సంస్కృతి పరంగా, భారతీయ ఔన్నత్యాన్ని మరింత పెంపొందించడంలో ఉపయోగపడుతుందని దక్షిణ ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నారు.
తటస్థులు అయితేనే మేలు
ఇప్పటివరకు పనిచేసిన రాష్ట్రపతులలో ఎక్కువ మంది ఏదో ఒక పార్టీకి సభ్యులుగా ఉండి, ఆ పార్టీకీ విధేయత కలిగినవారే. ఆ పార్టీ అండతోనే రాష్టప్రతిగా ఎన్నిక కావడం లాంఛనంగా సాగుతూ వస్తున్నది. మారుతున్న పరిస్థితులలో రాష్ట్రపతి పదవికి పార్టీల అభ్యర్థులు కాకుండా, సామాజిక స్పృహ, నీతి, నిజాయితీ కలిగి. ప్రజాభిమానం చూరగొన్న మేధావులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, తటస్థ వ్యక్తులను, దేశం కోసం పాటుపడుతున్న వ్యక్తులను మాత్రమే ఇంతటి ఉన్నత స్థాయి పదవికి అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నేటి పరిస్థితులలో అత్యంత అవసరం కూడా. గతంలో పార్టీల అభ్యర్థులు కాకుండా వివిధ రంగాలలో విశేష సేవలందించి అత్యున్నత స్థాయికి చేరుకున్న కే ఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి నిస్వార్ధపరులు రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించి పదవికి గౌరవాన్ని సంపాదించి పెట్టిన విషయం మనం మర్చిపోవద్దు. భిన్న సంస్కృతులు గల అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏకత్వానికి నిదర్శనంగా భావించాలి.
ఈ సారి దక్షిణాదివారికే
అప్పుడప్పుడు కొందరు ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ నిరసన గళాలు వినిపిస్తున్నారు. ఇటువంటి వాటికి సాధ్యమైనంత తొందరలో చరమ గీతం పాడాలి. దేశంలోని ఏ మారుమూల ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా దేశంలోని ప్రతి అత్యున్నత పదవికి అర్హుడే. అయితే, చాలా కాలంగా ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తులు అత్యున్నత స్థాయి పదవులు పదే పదే అలంకరించడం చూస్తున్నాం. ఫలితంగా ఇతర ప్రాంతాలలో ఉన్న ప్రజలు కొద్దిగా అసహనము, అసంతృప్తి , విభేదాలు కలిగి ఉండటం సహజమే. అత్యున్నత పదవులలో ఒకటి ఒక ప్రాంతానికి, మరొకటి మరొక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నప్పుడు అన్ని పార్టీలు గురుతర బాధ్యతగా గుర్తించి ఆ దిశగా అడుగులు వేయడం అత్యంత ఆవశ్యకం.
ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలపైనా, కేంద్రంపైనా దక్షిణాది రాష్ట్రాలు గుర్రుగా ఉన్నాయి, జనాభా పెరుగుదలను అరికట్టి, అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు కాకుండా, జనాభాను అదుపులో ఉంచుకోలేని రాష్ట్రాల వైపే ఎక్కువగా కేటాయింపులు ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది వివక్షతకు గురి చేయడం కాదా? ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని కూడా పలు రాష్ట్రాల అధినేతలు కూడా విమర్శించిన సంఘటనలను గుర్తు పెట్టుకోవాలి,
చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ బెస్ట్
ప్రస్తుతం దేశ ప్రజలందరి మెప్పు పొందుతున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణకు రాష్ట్రపతి పదవిని అలంకరించే అర్హతలన్నీ ఉన్నాయనే మాట వినబడుతోంది. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి చేరుకున్న వ్యక్తిగా ఆయనకు పేరుంది. గతంలో రాష్ట్రపతిగా పని చేసిన తటస్థులే పదవికి వన్నె తెచ్చారు. జస్టిస్ ఎన్‌వీ రమణను ముందుకు తీసుకు వస్తే బీజేపీ సహా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో సముచిత నిర్ణయం కూడా అవుతుంది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, 29 రాష్ట్రాల శాసనసభ సభ్యులు, ఢిల్లీ, పుదుచ్చేరి, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏకు లోకసభలో 542కు గాను 336 అనగా 62 శాతం ఓట్లు, రాజ్యసభలో 241 కి గాను 118 అనగా 49 శాతం ఓట్లు ఉన్నాయి. దేశంలోని విధాన సభ సభ్యులు 4,019కి గాను 1,701 అనగా 42 శాతం ఓట్లు ఉన్నాయి. యూపీఏకు లోకసభలో 109 అనగా 20 శాతం ఓట్లు, రాజ్యసభలో 51 అనగా 21 శాతం ఓట్లు, విధాన సభ సభ్యులలో 1,141 అనగా 28 శాతం ఓట్లు ఉన్నాయి. టీఆర్‌ఎస్, బీజేడీ. వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ ఆమ్ ఆద్మీ తదితర పార్టీలకు లోకసభలో 97 అనగా 18 శాతం, రాజ్యసభలో 72 అనగా 30 శాతం, విధాన సభ సభ్యులు 1,177 అనగా 29 శాతం ఓట్లు ఉన్నాయి. ఈ గణాంకాలను పరిశీలించినట్లయితే యూపీఏ పక్షాలు సహకరించకపోయినప్పటికీ బీజేపీకి ఛాన్స్ ఉంటుంది. బీజేపీ ముందుకు వస్తే దాని అలయన్స్ సహా టీఆర్‌ఎస్, బీజేడీ. వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ ఆమ్ ఆద్మీ పార్టీలు జస్టిస్ ఎన్‌వీ రమణకు మద్దతు ఇస్తానడంలో సందేహం లేదు.
డా. బి కేశవులు, ఎండీ
రాజకీయ విశ్లేషకులు
85010 61659