- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర బీజేపీ నాయకులు కుల గణనను స్వాగతిస్తారా?
దశాబ్దాల కాలంగా అన్ని రంగాల్లో తీవ్ర అసమానతలు...అణచివేతలను ఎదుర్కుంటున్న బీసీలకు కుల గణన చేపట్టి సమాన అవకాశాలు కల్పించాలని భావించడం నేరమా?... అవుననే అంటున్నారు మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఇటీవల మహారాష్ట్రలో మాట్లాడుతూ కాంగ్రెస్ వాదులు అర్బన్ నక్సల్స్... దేశ విచ్ఛినకారులు అంటూ పరోక్షంగా రాహుల్ గాంధీని విమర్శించారు. తాజాగా హర్యానా ఎన్నికల్లో బీజేపీ మూడోసారి విజయం సాధించడంతో... కుల గణనతో దేశంలో చిచ్చు పెడుతున్న కాంగ్రెస్‌కు ఇక్కడి ఓటర్లు ఎంట్రీ ఇవ్వలేదంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీన్నిబట్టి బీసీ కుల గణనను మోడీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది. కులగణనపై దాటివేత దోరణి అవలంభించినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ బీసీలకు వ్యతిరేకమే అని తేలిపోతుంది. దాన్నిబట్టి ఇక్కడి బీసీలు బీజేపీకి అనుకూలంగా ఉండాలో, దూరమవ్వాలో తేల్చుకుంటారు. కాబట్టి తెలంగాణ బీజేపీ నేతలూ.. మీ వైఖరిని స్పష్టం చేయండి.
గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలంటూ బీసీ సంఘాల నాయకులు.. ప్రధాన రాజకీయ పార్టీల ప్రముఖులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం కుల గణనను చేపట్టలేదు. నిజానికి ప్రతీ పదేళ్లకు ఒకసారి జనగణన చేపట్టాల్సి ఉంటుంది. 2011లో చివరిసారిగా జనగణన జరిగింది. దీంతో ఈ పదమూడేళ్లలో ఎంత జనాభా పెరిగింది? అందులో మతాల వారీగా...కులాల వారీగా ఉన్న జనాభా ఎంత? ఆయా కులాలు వర్గాల వారీగా సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? అనే అంశాలు తేలాలంటే జనగణనను కుల గణనతో చేపడితే పూర్తి సమాచారం తెలుస్తుంది.
కుల గణన కష్టమేనా?
ఓ పక్క తానే ఓ పెద్ద బీసీని అని చెప్పుకునే మోడీ ఈ దేశంలో 56 నుంచి 60 శాతంగా అత్యధిక జనాభా కలిగిన బీసీల విషయంలో ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? అంటే మోడీ బీసీ కాదా? కుల గణనను వ్యతిరేకిస్తున్న ఆయనపై ప్రజలకు ఇదే అనుమానం వస్తుంది. అనుమానాలేంది.. ఆయన గానుగ ద్వారా నూనె తీసే కులానికి చెందిన వారు. గుజరాత్‌లో మోడీ కులం ఆధిపత్య జాబితాలో ఉండేది. ఆ తరువాత అక్కడి ప్రభుత్వం మోడీ కులాన్ని బీసీ జాబితాలో చేర్చడం జరిగింది. మోడీని బీసీ జాబితాలో చేర్చడం కూడా ఒక పెద్ద ప్లాన్‌గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఆధిపత్య కులాన్ని బీసీ జాబీతాలో ఎందుకు చేర్చారు? అనేదే మొదటి ప్రశ్న. సరే చేర్చారు అనుకుందాం. చేర్చిన తరువాత బీసీగా చెప్పుకునే మోడీ ప్రధాని అయిన తరువాత బీసీలకు వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకురావడంలో అర్ధం ఏంటి? ఆ తరువాత కుల గణన చేపట్టమన్నా పెడచెవిన పెట్టడానికి కారణం ఏమిటి? కుల గణన చేపడతామన్న రాహుల్ గాంధీని దేశ విచ్ఛినకారిగా విమర్శించడం ఏమిటి?
వీటన్నింటికీ సమాధానం 1990లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను వీపీ సింగ్ ప్రభుత్వం అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎల్. కె అద్వాని చేపట్టిన రథయాత్రకు మోడీ దగ్గరుండి ఏర్పాట్లు చేయడమే కాకుండా.. ఆ రథయాత్రలో పాల్గొనడం. దీన్నిబట్టి మోడీ మొదటి నుండి ఆర్ఎస్ఎస్ ఐడియాలాజీతో బీసీలకు వ్యతిరేకంగా కొనసాగుతున్నారని అర్ధం చేసుకోవచ్చు. బీసీ కుల గణన చేపట్టి రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తామని రాహుల్ గాంధీ గత పార్లమెంటు ఎన్నికలతో పాటు.. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ప్రకటించారు. రాహుల్ ప్రకటనను మోడీ ప్రతీసారీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాబట్టి మోడీ ఉన్నంత వరకూ జాతీయ స్థాయిలో కుల గణన జరగదనేది క్లియర్‌గా తేలిపోయింది.
రాష్ట్ర బీజేపీ నాయకుల వైఖరి ఏంటి?
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేయడంలో భాగంగా అసెంబ్లీలో కుల గణనపై తీర్మాణం చేసింది. కుల గణన చేపట్టేందుకు వీలుగా బీసీ కమిషన్‌కు కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉప సంఘం కూడా కులగణనను హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబరు 9లోపు పూర్తి చేయాలని... దానికి అవసరమైన విధి విధానాలను బీసీ కమిషన్‌కు పంపింది. మరి బీసీల అనుకూల పార్టీ మాది అని చెప్పుకునే రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్రంలో బీసీ కుల గణనపై తమ వైఖరిని స్పష్టం చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుల గణను వ్యతిరేకిస్తున్నందున, మన రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ నాయకులు కూడా ఆయన అడుగు జాడల్లోనే నడుస్తారా? ప్రస్తుతానికి మోడీని కాదని వారు కుల గణనకు మద్దతు ఇచ్చే అవకాశమే లేదు. పైకి మాత్రం ఓట్ల కోసం మాది బీసీలకు మద్దతు ఇచ్చే పార్టీ అని చెప్పుకుంటారు.
బీసీలు ఎదగకూడదా?
నిజానికి బీజేపీ మొదటి నుండి హిందూ నినాదంతో ఓట్లు పొందడంపైనే దృష్టి పెట్టింది. ఆ ఎజెండాతోనే ఆ పార్టీ మనగలుగుతుంది. బీజేపీ నేతల దృష్టిలో బీసీలు హిందువులు కాదనేది వారి విధానాలను బట్టి స్పష్టమవుతోంది. ఒకవేళ బీసీలూ హిందువుల్లో భాగమే అని అనుకుంటే.. మరి బీసీలు విద్యా, ఆర్ధిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఎదగకూడదా? అనేది ప్రశ్న. ఖచ్చితంగా ఎదగాలని అనుకుంటే ప్రస్తుతం బీసీల జనాభా ఎంత?... వారి సామాజిక పరిస్థితి ఏమిటి? అని తేలితేనే కదా? మీరెట్లాగూ కుల గణన చేపట్టరు, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల గణనను స్వాగతిస్తారా?.. వ్యతిరేకిస్తారా? తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కులగణనపై దాటివేత దోరణి అవలంభించినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ బీసీలకు వ్యతిరేకమే అని తేలిపోతుంది. దాన్నిబట్టి ఇక్కడి బీసీలు బీజేపీకి అనుకూలంగా ఉండాలో, దూరమవ్వాలో తేల్చుకుంటారు. కాబట్టి తెలంగాణ బీజేపీ నేతలూ మీ వైఖరిని స్పష్టం చేయండి.
-జంగిటి వెంకటేష్,
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఉపాధ్యక్షుడు
90528 89696