‘సరస్వతీ విశ్వవిద్యాలయం’..ముందడుగు వేసేనా ..??

by Ravi |
‘సరస్వతీ విశ్వవిద్యాలయం’..ముందడుగు వేసేనా ..??
X

చదువుల తల్లి జ్ఞాన సరస్వతీ దేవి కొలువైన జిల్లా.. వెనుకబడిన జిల్లాగా పేరు.. ప్రకృతి అందాలతో కూడిన దక్షిణ కశ్మీరం.. ఇదీ క్లుప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ చరిత్ర. ఇలాంటి చోట సరస్వతీ దేవి పేరిట రాష్ట్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు ఏళ్లుగా కోరుతున్నారు. పాలకులు హామీలు గుప్పిస్తున్నారు. కానీ, కార్యరూపం దాల్చడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వేర్వేరు సందర్భాల్లో యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రకటనలు చేశారు. తాజాగా... రాష్ట్రంలోని ప్రాధాన్యత అంశాలకు నిధుల కేటాయింపు జరుగుతున్న తరుణంలో యూనివర్సిటీ ఏర్పాటుకై నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా రాష్ట్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుతో సామాజిక, ఆర్థిక సవాళ్లతోపాటు, విద్యావకాశాలు పెరుగుతాయని, స్థానిక అభివృద్ధికి దోహదపడుతుందని అంతా భావించారు. దీనికి కొనసాగింపుగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నత విద్యాశాఖ సమీక్షా సమావేశాల్లో త్వరలో ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని, సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఉన్నత విద్యాశాఖాధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారు. దీంతో యూనివర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడిందని అంతా భావించారు. సాధ్యాసాధ్యాల అధ్యయనాలు, స్థలం ఎంపిక, మౌలిక సదుపాయాల అభివృద్ధితో కూడిన కార్యాచరణ ప్రణాళికల వైపుగా ఈ ఆదేశాలు ఒక కీలకమైన దశ అయితే, వార్షిక బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ఆశాజనక పరిణామాలు ఉన్నాయి.

ప్రణాళిక అనుమతులు ఇలా..

నూతన రాష్ట్ర విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ కీలక పాత్ర పోషిస్తాయి. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్నత విద్యా మౌలిక సదుపాయాలు వనరుల అవసరాన్ని బట్టి ప్రభుత్వం కొత్త విశ్వవిద్యాలయం లక్ష్యాలు, నిర్మాణం నిధులను వివరించే ప్రతిపాదన, ఏర్పాటుకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించాలి. తెలంగాణ గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలపాలి. దీంతో కొత్త యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్ఈ) కూడా సంప్రదింపుల పాత్ర పోషించి, సిఫార్సులు అందించడంతో పాటు రాష్ట్ర ఉన్నత విద్యా విధానాలు, లక్ష్యాలకు అనుగుణంగా కొత్త విశ్వవిద్యాలయం ఉండేలా బాధ్యత వహిస్తుంది. ప్రాథమిక అనుమతుల అథారిటీ రాష్ట్ర స్థాయిలో ఉండగా, కొత్త విశ్వవిద్యాలయాలకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్ధ సంస్థ అయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి కూడా గుర్తింపుతో పాటు నిర్దిష్ట విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించాల్సి ఉంటుంది. కొత్త యూనివర్సిటీ ఏర్పాటైన తర్వాత ఉన్నత విద్యలో నాణ్యత, ప్రమాణాలను నిర్ధారించడానికి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) వంటి జాతీయ సంస్థల నుంచి అక్రిడిటేషన్ పొందడం కోసం ముందడుగు వేయాల్సి ఉంటుంది.

నిధుల పరంపర...

నూతన రాష్ట్ర విశ్వవిద్యాలయ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, ఇతర ఆర్థిక వనరులు పొందే విధానంలో ప్రాథమిక బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఉన్నత విద్యాశాఖకు రాష్ట్ర బడ్జెట్‌లో భాగంగా నిధులు కేటాయిస్తుంది. కొత్త విశ్వవిద్యాలయానికి నిర్దిష్ట కేటాయింపులతో కూడిన వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర శాసనసభ ఆమోదిస్తుంది. ఈ నిధులు మూలధన వ్యయం (మౌలిక సదుపాయాలు, భవనాలు, పరికరాలు) నిర్వహణ ఖర్చులు (జీతాలు, యుటిలిటీలు, నిర్వహణ ఖర్చులు) కోసం ఉపయోగపడతాయి. కేంద్ర ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల స్థాపన అభివృద్ధికి అదనపు గ్రాంట్లు, నిధులను కూడా అందిస్తుంది. ఇవి మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశోధన సౌకర్యాలు నిర్దిష్ట విద్యా కార్యక్రమాలకు తోడవుతాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా వివిధ పథకాల కింద ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్(పీఎం-ఉష) వంటి సంస్థల నుండి నిధులు కొత్త సౌకర్యాల నిర్మాణానికి ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల ఆధునీకరణకు తోడ్పడతాయి. ఐసిఎస్ఎస్ఆర్, అంతర్జాతీయ సంస్థల గ్రాంట్లకు తోడుగా విద్యార్థుల నుండి వసూలు చేసిన ట్యూషన్ ఇతర ఫీజులు స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని అందిస్తాయి.

‘అడవులజిల్లా’కు దక్కని విశ్వవిద్యాలయాలు..

తెలంగాణ రాష్ట్రంలో భౌగోళికంగా పెద్దదైన ఉమ్మడి ఆదిలాబాద్ (ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్)లో అడవుల విస్తీర్ణం ఎక్కువే. ‘అడవులజిల్లా’గా పేరున్న ఈ జిల్లా, వివిధ శాస్త్రాల్లో పరిశోధనకు ఎంతో అవకాశమున్న ప్రాంతం. తెలంగాణ ఏర్పాటు తర్వాత దాదాపు పదేళ్లపాటు ‘ఇద్దరు’ అటవీశాఖ మంత్రులు (జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి) ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించినప్పటికీ, వారి వైఫల్యంతో ఈ జిల్లాలో 'అటవీ 'విశ్వవిద్యాలయం' ఏర్పాటును కోల్పోయింది. ప్రతి రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసే ఏకైక గిరిజన యూనివర్సిటీలో భాగంగా..గిరిజనుల జనాభా అధికంగా ఉన్న జిల్లాను వదిలి చివరికి పూర్తిస్థాయిలో ‘కేంద్రనిధులతో’ సమ్మక్క సారక్క యూనివర్సిటీని వరంగల్ జిల్లాకి కేటాయించారు.

ప్రతిపాదనోద్యమాల ఫలితంగా తెరపైకి..

శ్రీ జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి 2009 సంవత్సరం నుండి 2024 వరకు జిల్లాలో రాష్ట్ర విశ్వవిద్యాలయాన్ని’ ఏర్పాటుచేయాలనే ఆకాంక్షను తెరపైకి తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రం నుండి మొదలుకుని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగే వరకు వరుసగా ఏర్పడిన వేర్వేరు ప్రభుత్వాలకు ప్రతిపాదనలు చేసింది. ఇరురాష్ట్రాల ఉన్నత విద్యామండలిలకు సైతం పలుమార్లు ప్రతిపాదనలు అందజేసింది. 2016లో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ దృష్టికి తీసుకెళ్లింది. గతంలో విశ్వవిద్యాలయంగా నిర్మల్ పీజీ కళాశాల ఉన్నతీకరణకు రూ.55 కోట్లు మంజూరై నాయకుల వైఫల్యంతో వెనక్కి వెళ్లాయి. ఇన్నేళ్లూ మరుగునపడి, రేవంత్ రెడ్డి ప్రకటనలతో మళ్లీ వెలుగులోకి వచ్చింది.

వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు జరిగేనా..?

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీతో పాటు త్వరలో డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటుకై ముఖ్యమంత్రి ప్రకటనలు, స్థల పరిశీలన చర్యల కార్యాచరణకు ఆఘమేఘాల మీద అడుగులు పడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినప్పుడే ప్రభుత్వ ఆర్థిక నిబద్ధత, చిత్తశుద్ధి ప్రదర్శితమౌతుందనేది నిర్వివాదాంశం, భావితరాల ఆవిష్కరణలకు, జీవితాలకు కొత్తబాటలు వేసేలా వచ్చే విద్యాసంవత్సరానికల్లా ‘కొత్త రాష్ట్ర విశ్వవిద్యాలయాన్ని’ ప్రారంభించేలా ప్రభుత్వం చొరవ చూపాలి.

నంగె శ్రీనివాస్

అధ్యక్షుడు,

శ్రీ జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి,

94419 09191



Next Story