కొత్త లేబర్ కోడ్ లాభామా, నష్టమా?

by Ravi |   ( Updated:2023-05-01 00:31:11.0  )
కొత్త లేబర్ కోడ్ లాభామా, నష్టమా?
X

దేశ శ్రేయస్సు కోసం ఎండనకా, వాననకా, కాలాలకు అతీతంగా అహర్నిశలు శ్రమిస్తున్న శ్రామికులు ఈ దేశ ప్రగతికి మూలాలు. శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు. కార్మికుల స్వేదం చిందించకపోతే ఏ దేశం కూడా ప్రగతిశీల మార్గంలో నడవబోదనడంలో అతిశయోక్తి లేదు. గుండు పిన్ను నుంచి విమానం వరకు ప్రతి వస్తువు తయారీకి శ్రామికుల శ్రమ ఎంతో అవసరం. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరు కార్మికులే, శ్రమనే నమ్ముకుని పనిచేసే ప్రతి ఒక్కరు శ్రామికులే. దేశ భవిష్యత్తు నిర్మాణంలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిది.

19వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల ఉత్పత్తి రంగంలో పెట్టుబడిదారులు, కార్మికులు అనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాల కోసం కార్మికుల శ్రమను విచక్షణారహితంగా దోపిడీ చేయడం ప్రారంభించి కార్మికులతో రోజుకు కనీసం 16 నుంచి 20 గంటల వరకు పనిచేయించారు. ఈ క్రూరమైన చర్యల వల్ల క్రమంగా కార్మికుల్లో తిరుగుబాటు మొదలై కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు ఏర్పడి పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని, యూనియన్లను గుర్తించాలని, వసతులు కల్పించాలని, తగినంత విశ్రాంతినివ్వాలని కోరుతూ కార్మికవర్గం విప్లవ శంఖం పూరించింది. ఆ పోరాట జ్వాలలు అన్ని దేశాలకు వ్యాపించడంతో, 1886 మే 1న అమెరికాలోని చికాగోలో 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ పోరాటం ప్రారంభించారు ఈ పోరాటంలో ఎందరో కార్మికులు మరణించి తమ హక్కులు సాధించుకున్నారు. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరవీరుల స్పూర్తికి గుర్తుగా జరుపుకునేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే.

యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ

దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లే శ్రామికుడు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. నేటికి వారు అసంఘటిత రంగంలో ఉండటం బాధాకరం. కార్మికుల చట్టాల్లో ఎన్నో మార్పులు వస్తున్నా వారి వేతనాలు, జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. చట్టాలు అమలవుతున్న, ఆచరణలో మాత్రం వెనకడుగు వేస్తున్నాయి. తత్ఫలితంగా కార్మికుల శ్రమకి తగ్గ వేతనం ఇవ్వకుండా, పనిలో రక్షణలు లేకుండా, సమ్మె హక్కులు లేకుండా, కనీసం వారికి భద్రత కల్పించకుండా వారిచేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత కార్మికులు పోరాడి 44 కార్మిక చట్టాలను రూపొందించుకోవడంతో కొంతమేరకు వారికి లాభం చేకూరింది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను రద్దుచేస్తూ నాలుగు కొత్త లేబర్ కోడ్‌లు రూపొందించడంతో కార్మికులు మరోసారి వారి హక్కులను కోల్పోయే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త లేబర్ కోడ్ వలన సమ్మె నోటీసు ఇవ్వడానికి కేంద్రం ఒకప్పుడున్న 14 రోజుల గడువును 60 రోజులకు పొడిగించింది. సమ్మెకు వ్యతిరేకంగా న్యాయస్థానికి వెళ్లేందుకు యజమానులకు వెసులుబాటు కల్పించారు. దీంతో న్యాయస్థానంలో కేసు ఉన్నంత వరకు కార్మికులు సమ్మెకు దిగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు 10 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థలను పరిశ్రమలుగా పరిగణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను 20కి పెంచగా చిన్న పరిశ్రమల కార్మికులు చట్టబద్ధమైన ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమ పథకాల నుండి మినహాయించబడ్డారు. పాత చట్టం ప్రకారం, యాజమాన్యం యూనియన్‌లను గుర్తించే నిబంధన లేదు. ఏ యూనియన్ అయినా కార్మికుల డిమాండ్లపై యాజమాన్యంతో చర్చలు జరిపే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం పరిశ్రమల్లో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్నట్లైయితేనే యూనియన్‌గా పరిగణించబడుతుంది. అలాగే వేతనాల కోడ్ రూపొందించారు దీనివలన కార్మికుడి టేక్ హోమ్ పే తగ్గుతుంది. అలాగే ఈ కొత్త చట్టం ప్రకారం ఉద్యోగి ప్రాథమిక జీతం(CTC) కంపెనీ ఖర్చులో 50 శాతం కంటే తక్కువ ఉండకూడదు. దీంతో కంపెనీలు బేసిక్ వేతనాన్ని తగ్గించి అలవెన్సుల రూపంలో ఎక్కువ ఇస్తూ కంపెనీపై భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగికి బేసిక్ వేతనం తగ్గడంవల్ల కార్మికుడి రిటైర్మెంట్ తరువాత జీవన ఉపాధికి చెల్లించబడే గ్రాట్యుటీ, పీఎఫ్‌, పెన్షన్‌లు భారీగా తగ్గే అవకాశముంది. ఈ వేతనాల కోడ్ వల్ల కార్మికుడికి తీవ్ర నష్టమే తప్ప లాభం లేదు. ఎందరో త్యాగాల ఫలితంగా కొట్లాడి సాధించుకున్న 8 గంటల పని విధానానికి స్వస్తి చెప్తూ, యాజమాన్యం కోరితే 10 నుంచి 12 గంటల పాటు పనిచేయాలని, అందుకు ఎలాంటి ఓటీ (ఓవర్‌ టైమ్‌) వేతనాలను చెల్లించాల్సిన అవసరం లేదని ఈ చట్టంలో ఉంది.

ఈ పెన్షన్ సరిపోతుందా?

ప్రైవేట్ రంగంలో 40 ఏళ్లు పనిచేసిన వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛను రూ. 2500 లోపే, అది కూడా రూ. 30,000 జీతంతో పదవీ విరమణ చేసిన వారికే. ప్రస్తుతం దేశంలో ఉన్న రేట్లకు ఈ పెన్షన్ సరిపోతుందా? రూ. 2500తో రిటైర్డ్ కార్మికులు జీవనం ఎలా కొనసాగించాలి? ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేస్తే అతనికి సగం జీతం పెన్షన్ వస్తుంది. ఈ దేశ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించిన ప్రైవేట్ కార్మికుడికి మాత్రం రూ. 2,500 పింఛనా? దేశంలోని ప్రజాప్రతినిధులు వారి జీతాలు, పెన్షన్స్ పెంచుకుంటున్నారు తప్పా, కార్మికులకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేటు రంగంలోని కార్మికులకు సరైన పింఛను, కనీస వేతన పథకాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది.

పారిశ్రామిక రంగంలో పనిచేసే కార్మికులకు ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తమకు వచ్చే జీతం తక్కువగా ఉండడంతో పిల్లలను చదివించేందుకు, కుటుంబ పోషణకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనుకోకుండా అనారోగ్య సమస్యలు ఎదురైతే కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ దిక్కు. ఉద్యోగం ఉన్నంత కాలం ఈఎస్‌ఐపైనే ఆధారపడుతున్నారు. ఇక రిటైర్మెంట్ తర్వాత కార్మికుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. గ్రాట్యుటీ, పీఎఫ్, పెన్షన్ అన్నీ తక్కువే మరి కార్మికుడు అప్పుడు ఎలా బతకగలడు? కావున ప్రభుత్వం కార్మికుల గురించి ఆలోచించి పదవీ విరమణ తర్వాత కూడా కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది.

(మేడే సందర్భంగా)

కోట దామోదర్

93914 80475

Advertisement

Next Story