- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో..కొత్త ప్రభుత్వం వత్తం(ది)దా?
సిద్దిపేట కొత్త బస్టాండ్‌లో హుస్నాబాద్, హన్మకొండ పల్లెవెలుగు బస్సెక్కాను. అయితే దారిలో రోడ్డు పక్క డివైడర్ అవతలి రోడ్డు నుండి ఎన్నికల పార్టీ ఊరేగింపు వస్తుంది. అది చూసి ఓ అవ్వ తన ఎలక్షన్ లేమోగాని మంత్రి ఎంబడి తిరిగేటోళ్లకైతే పట్ట పగ్గాలు లేవు. రోజు తాగి తలకుపోసుకుంటున్నారు అన్నది. పక్కపొంటి నిలబడ్డ ముసలవ్వ జోక్యం చేసుకుని అదేందవ్వ! తులమో, ఫలమో అందరికి అందుతున్నాయి గదా? అని మాట కలిపింది. సీటు మీద కూర్చున్న పెద్ద మనిషి మాటల మధ్యలో దూరి అందరికి ఇయ్యాలంటే ఏ నాయకుడి తరం కాదు. కాకపోతే మనిషికి రెండు వందలు ఇచ్చి జనాన్ని మీటింగ్‌లకు తీసుకపోతున్నారు. రోజు ప్రచారానికి తిరిగెటోళ్లకు తొవ్వ ఖర్చులు, తిండి, రాత్రిపూట ఇంత మద్యం తాగిత్తార్రు. ఓట్లు రేపనగా అయిదొందలో వెయ్యో ఇస్తరు. మండ్ల అయిదేండ్లు వాల్ల ముడ్డి చుట్టూ తిప్పుకుంటారు. నువ్వు ఎన్నైనా చెప్పయ్య! ఎలక్షన్లు వచ్చినయంటే తీర్థం లెక్క సాగుతంది. నేను పుట్టి డెబ్బయి ఏండ్లు అవుతంది. దిన దినం డబ్బులు పంచుడు, మందు తాగించుడు ఎక్కవైతంది. నాకు కొత్తగా ఓటచ్చినప్పుడు మా రామయ్య మామ గీగుర్తుకు ఓటెయ్యమంటే అడకట్టోల్లమంత ఏసినం. కానీ ఇప్పుడు ఇంటింటికి లీడర్లు అయిర్రు. పాయిదా ఏమచ్చిందిరా అంటే నీళ్లల్ల ఏలు పెట్టి నోట్లో ఏలు పెట్టుకున్న శాత్రం అయింది.
ఈ సర్కారు వలన జనం అరిగోస పడుతుర్రు. మా మామ సంపాదించి ఇచ్చిన భూమిలో మేమే కాస్తు చేసుకుంటున్నాము. మా ఆయన పేరు మీద పట్టా బుక్‌ల ఉండంగ కూడా ఎవడో ధరణిలో ఎక్కిచ్చిడంట, మా మనుమడు కాగితాలు పట్టుకొని ఆఫీస్‌ల చుట్టూ తిరిగినా మేము ఏమి చేయలేమని చేతులెత్తిర్రట. మండ్ల ధరణి నుండి తీసేసి మా ఆయన పేరు మీద పట్టా కావాలంటే కోర్టులో తప్స చేసుకోవాలంట. ఇప్పటికే మా మరిది కొడుకు ఒక కేసులో పదేండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఇంకా తీర్పు రాలేదట. ఇగ ఎలక్షన్లు వచ్చినయి గదా? కొత్త ప్రభుత్వం వస్తే చేస్తామని అంటున్నారని ఆగినం. ముసలామె మాటలను గమనించిన రిటైర్డ్ ఉద్యోగి మెచ్చుకోలుగా నీవు చెప్పింది నిజమే అన్నాడు. అలాగే ధరణి వలన రైతులు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చాడు. పొలం పనులతో సతమతమయ్యే రైతులను ఆఫీస్‌ల చుట్టు తిప్పి పరేషాన్ చేసిండు. ధరణిలో జరిగిన తప్పులను సరిదిద్దే పవర్స్‌ను ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్ల నుండి తీసేసాడు. ధరణిలో జరిగిన తప్పులను కోర్టులో పరిష్కరించుకోవాలంటే మాటలా? వకీలును పెట్టుకోవాలి, కోర్టు చుట్టూ ఏండ్లకు, ఏండ్లు తిరగాలని చెప్పాడు.
నా ముందు సీట్లో ఇద్దరు వ్యవసాయ సంబంధమైన నడీడు పైబడిన మహిళలు కూర్చున్నారు. వాల్లు ఇద్దరు పరిచయస్తులైనప్పటికీ కూడా ఎలక్షన్ల గురించే మాట్లాడుకుంటున్నారు. నా మనమడు మూడు సార్లు పరీక్ష రాస్తే రెండు సార్లు పేపర్ లీకైందన్నారు. మరోసారి ఒక్క మార్కులో పోయిండట, మొన్న పోలీస్ నౌకరి వచ్చిందని అన్నాడు. కానీ కోర్టులో కేసు పడి పెండింగులో పెట్టిండ్రట, పోరగాండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఒక్కడికి ఉద్యోగం రాకపాయే. మనోళ్లకు ఉద్యోగాలు రాకపోతేందక్క వాల్ల కుటుంబాల్లో ఎవరూ ఖాళీ లేరు కదా! అయ్యతో పాటుగా కొడుకు, బిడ్డ, మేనల్లుడు, సడ్డకుడి కొడుకు కూడా పెద్ద పెద్ద పదవులలో కూర్చుండిరి. ఇక ఎవరెక్కడ పొతే వాళ్లకెంది. గట్లెందుకు అంటవే! కొంత మంది జనం కూడా బాగుపడ్డారు. చింతమడుకల యాదవ్వ కొడుకుకు ఇల్లు కట్టించిర్రు, పది లక్షల లోన్ ఇచ్చిర్రు. నువ్వానేది నిజమే అక్కా! ఒక్క చింతమడుకొల్లే ఓట్లేస్తే ప్రభుత్వం రాలేదు గదా? రాష్ట్రమంతా ఉన్న ఊర్ల సంగతేంది, ప్రజల సంగతేందని ఆలోచన చేయాలి కదా! ప్రభుత్వం అంటే వాల్ల ముడ్డి కిందికి తోడుకోవడానికి, తనకే పేరు రావాలని జనాన్ని ముంచితే మంచిది కాదు గదా? అగో ఎమ్మెల్యేలు, మన సర్కారు నౌకరిగాళ్లు కూర్చుండే బంగ్లాలను కూలగొట్టి కొత్తది గట్టిండ్లట. ఏమిటికచ్చింది పాయిదా, కనీసం మన దగ్గర వసూళ్లు చేసిన పన్నులను కాపాయంగా ఖర్చు పెట్టి ప్రజలకు మేలు చేయాలి కదా? రాజుల పైసలు రాళ్ల పాలన్నట్లు ప్రజల పైసలను పరుల పాళ్లు చేస్తున్నాడు. ఇంకొకరి మాట వినడంట, తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లని నాలుగు లక్షల కోట్ల అప్పు చేసిండట.
బస్సు కొంచెం దూరం వెళ్ళాక, వాతావరణం చల్లగా, మబ్బులతో ఉన్నది. రోడ్డు పక్కపొంటి వరి కోతలు కోసిన వడ్లను పొలాల్లోనే ప్లాస్టిక్ పరదలు పరిచి వడ్లు ఆరబోసినారు. చినుకులు రాలడంతో పరదలను కప్పుచున్నారు. అది చూసి వీరు అయ్యో పాపం! వాన సల్లగుండ. వారం రోజులు ఆగితే వడ్లు చేతికి వచ్చు. మనం ఇంత కష్టపడి పంట పండిస్తే అమ్మబోతే అడివి శాత్రమే కాబట్టే, మొన్న మీ మరిది 40 బస్తాల వడ్లు ఏసుకపోతే బస్తాకు 3 కిలోలు తరుగు కింద తీసిండట, వడ్లు అమ్మకుంటా వాపసు తెస్తామంటే ట్రాక్టర్ కిరాయి మీద పడే. గిన్నీ కష్టాలతో ఎదురు ఈదుతున్న రైతులను పట్టించుకునే సర్కారే లేకపాయే. ఇలా దారిపోంటి పోతుంది బస్సు ఒక్కసారిగా ఆగింది. ఎందని పక్కపొంటి చూస్తే పాత రోడ్డు కల్వర్టు జెసిపి డ్రిల్లర్‌తో కూలగొడుతున్నారు. అందులోని ఐరన్ రాడ్లను ముక్కలు చేసి పాత రోడ్డు మీద వేయంగ జారీ బస్సు పోయే రోడ్డు మీద పడ్డవి. రాడ్ మీద పేర్చిన ఐరన్ ముక్కలను చూసిన మహిళలు మరల మాటలు సాగించారు. వీళ్ల కడుపు సల్లగుండ ఏ జమాన మోరీ కట్టినారో గాని మిషిన్ తోని కూలగొట్టిన కూలుతలేదు. తీసిన ఇనుప రాడ్లు కూడా గిన్నేండ్లయిన గింత ఖరాబు కాలేదు. ఇప్పుడే షాపుల కొన్నట్లు ఉన్నయి. ఆమె మాటలకు జవాబుగా పక్కపొంటి కూర్చున్న మహిళా లోకం మేలు తలిచటోడు కొంతయిన మంచి చేస్తాడు. వాని మేలు చూసుకునేటోడు మూడో చేత కూడా దోచుకుంటాడు. తెలంగాణ వచ్చినంక మూడేండ్ల కింద కట్టిన కాళేశ్వరం, మేడిగడ్డ పిల్లర్స్ కుంగి,బుంగలు పడ్డాయంట. లక్ష కోట్లు పెట్టి కడితే ఏమి పాయిదా వచ్చింది. వాడు చారణాకు ఆశ పడితే జనం సొమ్ము లక్ష కోట్లు నీటి పాళాయెనా? అంటూ చదువుకున్నోళ్ళ తీరుగా చెప్పింది.
ఇంతలో వాళ్ల స్టేజీ రాగానే వారు బస్సు దిగారు. నేను నా పక్కపొంటి కూర్చున్న తాతను మందలించాను. మీ ఊళ్లే ఎలక్షన్ల లొల్లి ఎట్లుందని అడిగాను. తాత చాన మందికి ఆయనంటేనే ఇసుకత్తంది. పాల కుండకు సెకనిచ్చే కుంపటి లెక్కన మండుతున్నారు. ఈసారి కొత్త ప్రభుత్వం రావాలనే అంటున్నారు. కాని ఎవరు బయటపడుత లేరు. ఎక్కువ మంది మదిలో మాత్రం ప్రభుత్వం మారాలని ఉన్నదని నిర్మొహమాటంగా చెప్పితే నాకు ముసలాయన తెగింపు ముచ్చటేసింది. రాష్ట్రం ఏర్పాటు కావాలని పోలీసు కాల్పుల్లో విద్యార్థులు మరణించిన సంఘటనలు ప్రపంచంలో అరుదు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఎందరో త్యాగాలు చేశారు, ఆత్మార్పణ చేసుకున్నారు. సొంత ఖర్చులతో ఉద్యమాల్లో పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ అనేక త్యాగాల నిర్మాణంతో ఏర్పాటైన తెలంగాణలో మంచి పాలకులు రాలేదన్న బెంగతో ప్రజాస్వామ్య వాదులు ఆందోళనకు గురయ్యారు. కానీ ఈ బస్సు ప్రయాణంతో నాకైతే ఆశ కలిగింది. జరుగబోయే ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మార్పు జరగాలని, కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు.
మేరుగు రాజయ్య
94414 40791