ఎమర్జెన్సీ సినిమాపై కోపం ఎందుకు?

by Ravi |
ఎమర్జెన్సీ సినిమాపై కోపం ఎందుకు?
X

1975 ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీని ఎందుకు విధించినట్లు? ఎమర్జెన్సీ కాలంలో పత్రికలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాస్వామ్యవాదులు ఎలాంటి ఇబ్బందులను, అణచివేతలను ఎదుర్కొన్నారు అనే విషయం నేటి యువతకు తెలియదు. ఎమర్జెన్సీ పరిస్థితులను కథా వస్తువుగా సినీనటి, లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో, తానే ప్రధాన పాత్రగా (ఇందిరాగాంధీ) ఎమర్జెన్సీ సినిమాను తీస్తున్నారు.

ఈ సినిమా విషయంలో కంగనా రనౌత్ పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. చారిత్రిక సత్యాలను సినిమాల ద్వారా చూపిస్తే ఈ దేశంలో చాలామందికి నచ్చదు. మరీ కుల పిచ్చితో, మత పిచ్చితో కునారిల్లే వర్గాలకు ఎమర్జెన్సీ సినిమా కథా వస్తువు ఇబ్బందిని కలిగిస్తుంది. ఎమర్జెన్సీ అకృత్యాల గరించి మాట్లాడితే కాంగ్రెస్ నాయ కులు అగ్గి మీద గుగ్గిలమవుతారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రజాదరణ కలిగిన అకాలీ దళ్ పార్టీని బలహీనపరచడానికి మతోన్మాద భావజాలం ఉన్న బింద్రెన్ వాలేను, అతని అనుచరులను స్వయానా ఇందిరాగాంధీ పెంచి పోషించారు.

హత్యానంతరం సంఘటనలు చూపించకపోయినా..

‘పాముకు పాలు పోస్తే కాటేసిన చందంగా’ ఆమె పెంచి పోషించిన ఖలిస్తాన్ ఉగ్రవాదమే ఆమెను కాటేసింది. సిక్కు తీవ్రవాదం బలపడి, భారతదేశ సమగ్రతకు ఒక సవాలుగా మారింది. బింద్రెన్ వాలా అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని తీవ్రవాదులకు కేంద్రంగా మార్చడంతో.. భారత సైన్యం 'ఆపరేషన్ బ్లూ స్టార్' పేరుతో స్వర్ణ దేవాలయంలో దాక్కున్న సిక్కు తీవ్రవాదులను మట్టుపెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్‌కు అనుమతించిన ఇందిరా గాంధీని సిక్కు బాడీగార్డులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లు అతి కిరాతకంగా కాల్చి చంపారు. ఇందిరా గాంధీ హత్యానంతరం దేశంలో అనేక ప్రాంతాల్లో అమాయకపు సిక్కులు నరమేధానికి గురయ్యారు. ఈ విషయాలను ఎమర్జెన్సీ సినిమాలో కొంతమేరకు చూపించినా, చూపించకపోయినా సత్యం దాగదు! అయితే ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వరాదు అంటూ శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ లేఖ రాయడం లోతుగా ఆలోచించాల్సిన విషయమే! ఈ సినిమా విషయంలో సిక్కులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్ రాష్ట్రంలో సృష్టించిన అరాచక పరిస్థితులను ప్రజలు తెలుసుకుంటారని సిక్కు నాయకులు భయపడుతున్నారా?

కాంగ్రెస్‌కి ఎందుకు భయం?

అధికార దాహంతో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న సంస్థలను సమర్థించడం, అక్కున చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైన విషయమే! దేశంలో ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఇస్లామిక్ తీవ్రవాదులను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది. బర్మా, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులకు ఆశ్రయమిచ్చి, భారతీయ పౌరులుగా మార్చింది. ఈ కారణంగానే ఎన్‌ఆర్‌సీ, సీఏఏలను వ్యతిరేకిస్తోంది. ఇలాంటి దేశద్రోహపు పనిని ప్రపంచంలోని ఏ రాజకీయ పార్టీ చేయదు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్నందుకు కంగనా రనౌత్‌ తలతీస్తామని, ఇందిరాగాంధీకి పట్టిన గతి ఏమిటో తెలుసుకోవాలని ఆమెకు వీడియోలు పంపడం, సిక్కు నాయకుల చేత హెచ్చరికలు జారీ చేయించడం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం లేదని చెప్పడం అసాధ్యం. వాస్తవ విషయం అర్థం చేసుకున్న కంగనా రనౌత్ ఈ సినిమా రిలీజ్ విషయంలో సహకరించాలని ప్రతిపక్ష నాయ కుడు రాహుల్ గాంధీని కోరడం కొసమెరుపు. ఈ సినిమా చూస్తే ఎమర్జెన్సీ పరిస్థితులు, ఎమర్జెన్సీ ఆకృత్యాలు దేశ ప్రజలకు తెలిసి, కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటారేమో అనే భయం కాంగ్రెస్ నాయకులకు ఏర్పడినట్లు ఉంది. అందుకే శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీని రెచ్చగొట్టింది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపే రైతు ఉద్యమం వెనుక ఈ కమిటీ అనుయాయులు చాలామంది ఉన్నారనే విషయం అర్థమైతే కాంగ్రెస్ పార్టీకి సిక్కు నాయకులు ఉన్న సంబంధం ఏమిటో స్పష్టం అవుతుంది.

ఎవరూ మద్దతు తెలుపలేదు..

కంగనా రనౌత్‌కు వ్యతిరేకంగా జారీ అయిన హెచ్చరికల విషయంలో నెటిజెన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. మానవహక్కుల సంఘా ల వాళ్లు, ప్రజాస్వామ్యవాదులమని బోర్డులు తగిలించుకున్న వారు మాత్రం ఈ విషయంపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగించదు. కానీ బాలీవుడ్ సినీరంగం ఆమెకు బాసటగా నిలవకపోవడం సినిమా వాళ్ల మానసిక దౌర్భాగ్యాన్ని తెలియజేస్తుంది. హిందూ సమాజంలోని అగ్రకులాల దౌర్జన్యాలను కథావస్తువుగా చూపించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాలు నిర్మించిన వాళ్లను మట్టుపెడతామని అగ్రకులాలకు చెందినవారు చెలరేగిపోయిన దాఖలాలు లేవు. మరి ఎమర్జెన్సీ సినిమా విషయంలో సిక్కు నాయకుల గాండ్రిం పులు ఎందుకు? అనవసరంగా ఒక లేడీ కానిస్టేబుల్ ఆమెపై చేయి చేసుకున్నప్పుడు సినీరంగం ఆమెకు సంఘీభావం తెలపలేదు. అందుకు కారణం ఆమె హిందుత్వవాది కావడమే! ఆమె అధికార పార్టీ ఎంపీ అయినప్పటికీ ఆమెకు ప్రభుత్వం నుంచి అండ లభించలేదు. ఆమె అంటే గిట్టని వాళ్లు ఎన్ని విమర్శలు చేసినా, రాజపుత్ర స్త్రీగా కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా విడుదలను అడ్డుకోవాలని ప్రయత్నించే వారికి ధైర్యంగా 'ప్రతి సవాలు' విసరడం వీరోచిత చర్యగా భావించక తప్పదు.

ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Next Story

Most Viewed