కర్ణాటకలో ఎవరు గెలవబోతున్నారు! సర్వేల్లో ఏం తేలింది

by Ravi |   ( Updated:2023-04-02 00:30:55.0  )
కర్ణాటకలో ఎవరు గెలవబోతున్నారు! సర్వేల్లో ఏం తేలింది
X

క్షిణ భారత దేశంలో ఆరు రాష్ట్రాలతో భౌగోళిక సరిహద్దులను కలిగి ఉన్న కర్ణాటకలో ఎన్నికల నగారా మోగడంతో ఆ రాష్ట్రం మొత్తం భారతదేశానికి ఏం సందేశం, సంకేతం ఇవ్వనుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. అధిక రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకున్న కర్ణాటక రాజకీయాలపై ఆయా ప్రాంతాల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అదే విధంగా ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇరుగుపొరుగు రాష్ట్రాలపైనా పడటం ఖాయం. మినీ ఇండియాగా పిలవబడే బెంగుళూరు రాజధానిగా ఉన్న కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మే 10న జరగనున్నాయి.

బీజేపీపై అన్ని వైపుల వ్యతిరేకత..

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల ముందు జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఎంతో కీలకం. రెండు పార్టీలు ప్రత్యక్షంగా తలపడుతున్న ఈ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడం కోసం బీజేపీ, పూర్వ వైభవం కోసం కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. రాష్ట్రంలో కొంత ప్రాంతానికే పరిమితమైన జెడీ (ఎస్‌) రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. 1985 నుండి 38 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు వరుసగా రెండోసారి ఏ పార్టీకి పట్టం గట్టని చరిత్ర బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తుంటే, కాంగ్రెస్‌ ఆశాజనకంగా ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రధానంగా బీజేపీకి ప్రతికూలంగా ఉంటున్నాయి. గత డిసెంబర్‌లో ‘పీపుల్స్‌ పల్స్‌’ సంస్థ నిర్వహించిన ట్రాకర్‌ పోల్‌లో, తాజాగా సీ ఓటర్‌ నిర్వహించిన సర్వేలో కూడా ఇవే తేలాయి. కాంగ్రెస్‌ వంద స్థానాలకు పైగా సీట్లు సాధించి దాదాపు మెజార్జీ పొందే అవకాశాలున్నాయని ఈ సర్వేల్లో వెల్లడయ్యింది. ఈ అంచనాలకు ప్రధాన కారణం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై అన్నివైపులా వ్యతిరేకత కనిపించడమే.

రాష్ట్రంలో ముఖాముఖిగా తలపడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఇక్కడ విజయం ఎంతో ఆవశ్యకం. దేశానికి దక్షిణ ముఖద్వారమైన కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి పగ్గాలు చేపట్టడానికి శాయశక్తుల పోరాడుతోంది. దక్షిణాదిలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పట్టులేని బీజేపీ, కర్ణాటకలో గెలిస్తే రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణాది నుండి ఆశాజనక ఫలితాలు ఉంటాయని భావిస్తోంది. దక్షిణాదిన తెలంగాణలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న ఆ పార్టీకి కర్ణాటకలో విజయం ఒక సోపానంగా ఉంటుందని ఆశిస్తోంది. అంతేకాక కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలుండగా ఎన్‌డీఏకు 26 సీట్లున్నాయి. బీజేపీకి యూపీ తర్వాత అధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి అధిక ఎంపీ స్థానాలు పొందాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడం తప్పనిసరి. ఏడాది వ్యత్యాసంలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలపై అసెంబ్లీ ఎన్నికల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. మరోవైపు దేశంలో పెద్ద రాష్ట్రాల్లో పట్టు కోల్పోతున్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో అధికారంలోకి రావడం ఒక జీవన్మరణ సమస్య లాంటిదే. రాహుల్‌ గాంధీకి కర్ణాటక ఎన్నికలు పెద్ద సవాలు. ఇక్కడ ప్రతికూల ఫలితాలొస్తే లోక్‌సభ ఎన్నికలపై ఈ ప్రభావం పడే అవకాశాలుంటాయి.

ఎదురీతకు ఎన్నో కారణాలు..

రాష్ట్రంలో పలుమార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎప్పుడూ సంపూర్ణమైన మెజార్టీ సాధించలేదు. ప్రతిసారి ఆపరేషన్‌ లోటస్‌ ద్వారా గట్టెక్కుతోంది. 1985లో రాష్ట్ర అసెంబ్లీలో రెండు స్థానాలే ఉన్న బీజేపీ సంఘ పరివార్‌ వెన్నుదన్నుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దశకు చేరుకుంది. అయితే ఎప్పుడూ ఒకే నేతను ముఖ్యమంత్రిగా పూర్తికాలం కొనసాగించలేకపోవడం ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న నాయకత్వ లోపాన్ని స్పష్టం చేస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 104 సీట్లు పొందిన బీజేపీ నానాపాట్లు పడుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర బీజేపీకి పెద్దదిక్కుగా ఉంటున్న యడియూరప్ప స్థానంలో అంతర్గత కుమ్ములాటలతో ఎస్‌.ఆర్‌.బొమ్మైకి సీఎం పగ్గాలు అప్పగించాక పార్టీ పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది. నాకు ఇదే చివరి శాసనసభ ప్రసంగం అంటూ, భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోను అని ప్రకటించిన యడియూరప్ప, ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ప్రకటించడం ఆ పార్టీలోని కలహాలను తెలియజేస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కేంద్ర బీజేపీ రాష్ట్రంలో అంతా తానై నడిపిస్తోంది. మోడీ, అమిత్‌షా, నడ్డా కాళ్లకు బలపం కట్టుకొని రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోడీ మూడు నెలల వ్యవధిలో ఏడు సార్లు రాష్ట్రంలో పర్యటించాల్సిన అవసరం ఏర్పడిరదంటే ఇక్కడ ఆ పార్టీ ఎలా ఎదురీదుతుందో అర్థం అవుతోంది. కర్ణాటకలో మళ్లీ బీజేపీ గెలుస్తుంది...కమలం వికసిస్తుందని ఆ పార్టీ ప్రచారం చేస్తున్నా ఆ పార్టీకి పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని క్షేత్రస్థాయిలో ‘పీపుల్స్‌ పల్స్‌’ నిర్వహించిన ట్రాక్‌ పోల్‌ పరిశీలనలో తేలింది. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం ‘40 శాతం కమీషన్ల సర్కారు’ అంటూ చేసిన ఆరోపణలు బీజేపీని పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్నాయి. రాష్ట్రంలో హిజాబ్‌ వంటి మత విద్వేషాల అశాంతే కాకుండా శాంతి భద్రతలపై కూడా రాష్ట్ర ప్రజానీకం అసంతృప్తిగా ఉంది.

సోషల్‌ ఇంజినీరింగ్‌తో లాభపడాలని భావించిన బీజేపీ రిజర్వేషన్లపై సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 14 శాతం ఉన్న లింగాయత్‌లు రెండు దశాబ్దాలుగా బీజేపీ వెంటే ఉంటున్నారు. 11 శాతం ఉన్న వొక్కలింగలు జేడీఎస్‌కు మద్దతుగా ఉంటున్నారు. ఈ రెండు వర్గాలపై దృష్టి పెట్టిన బీజేపీ వారికి రిజర్వేషన్లు పెంచి అనుకూలంగా మల్చుకోవాలనే దృష్టితో ఓబీసీ కోటాలో ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి ఈ రెండు సామాజిక వర్గాలకు చెరో రెండు శాతం పంచింది. దీంతో మొదటి నుండి బీజేపీకి దూరంగా ఉంటున్న 13 శాతం ముస్లింలలో బీజేపీని ఓడించాలనే పట్టుదల మరింత పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తమ ఓట్లు చీలిపోకుండా ఉండాలనే దృష్టితో ఎంఐంఎంను కూడా కాదని కాంగ్రెస్‌ పక్షాన ఉండాలని ముస్లింలు నిర్ణయించుకున్నట్లు సంకేతాలున్నాయి. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో లాభపడాలని చూసిన బీజేపీకి బంజారాలు, ఆదివాసుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. రిజర్వేషన్ల అంశాలు బీజేపీకి లాభిస్తాయో.. నష్టం కలిగిస్తాయో... చూడాలి.

కాంగ్రెస్‌ దూకుడు...

వివిధ సర్వే ఫలితాలు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్‌లో దూకుడు కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో కలహాలున్నా ఎన్నికల సమయంలో వారు ఏకతాటిపై రావడం ఆ పార్టీకి సానుకూలం. ప్రధానంగా పార్టీ జాతీయ చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన రాష్ట్ర నేత ఖర్గే ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో దళిత వర్గాలు కాంగ్రెస్‌కు దన్నుగా నిలువవచ్చు. మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షులు డి.కె.శివకుమార్‌ మధ్య ఆధిపత్య పోరున్నా పార్టీ వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి 124 మందితో మొదటి జాబితా విడుదల చేసింది. బీజేపీ హిందూత్వను, సోషల్‌ ఇంజినీరింగ్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ ‘అహిందా’ (మైనార్టీలు, బీసీలు, దళితులు) పేరుతో ముందుకు సాగుతోంది. మరోవైపు ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్‌ ప్రకటించిన ‘గృహజ్యోతి’ (ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌), ‘గృహలక్ష్మి’ (కుటుంబంలో మహిళకు నెలకు రూ.2000), ‘అన్న భాగ్య’ (దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబానికి నెలకు పది కిలోల ఉచిత బియ్యం), ‘యువనిధి’ (పట్టభద్రుల యువతకు రూ.3000 నిరుద్యోగ భృతి) పథకాలు ఆ పార్టీకి మేలు చేకూర్చే పరిస్థితులున్నాయని పీపుల్‌ పల్స్‌ పరిశీలనలో తేలింది. ముఖ్య కారణం బీజేపీపై విశ్వాసం సడలిన జనం కాంగ్రెస్‌ను ఎంతో కొంత నమ్ముతున్నారు.

కీలకం కానున్న జేడీ(ఎస్‌)

రైతులు, వొక్కలింగ సామాజిక వర్గం మద్దతున్న జేడీ (ఎస్‌) రాబోయే ఎన్నికల్లో కూడా కీలకపాత్ర పోషించే అవకాశం తమకు వస్తుందనే ఆశా దృక్పథంతో ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాదని, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినా తమ మద్దతు కీలకమని భావనలో ఆ పార్టీ ఉంది. వొక్కలింగ ఓటర్లపై దృష్టి పెట్టిన బీజేపీ స్వతంత్ర ఎంపీ సుమలతను పార్టీలో చేర్చుకుంది. ఈమె ప్రభావం జేడీ (ఎస్‌)పై ఏమేరకు ఉంటుందో చూడాలి.

కన్నడీగులు రిజర్వేషన్లు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలతో పాటు మోడీ ప్రభావంపై ఆశతో ఉన్న బీజేపీకి పట్టం కడతారా.. లేదా ముస్లిం ఓట్లతో పాటు తామిచ్చిన హామీలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ను అందలమెక్కిస్తారో మే 13న వెలువడే ఫలితాల్లో తేలుతుంది.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

9949372280

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story