- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉన్నది ఉన్నట్టు: కమ్యూనిస్టులు... ఇలా మిగిలారు!
ప్రజా ఉద్యమాల్లోంచి పుట్టుకొచ్చిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ప్రజల నుంచి దూరమయ్యాయి. ఉనికి కోసం ఆరాట పడుతున్నాయి. ప్రజలూ వాటిపై ఆధారపడడం మానేశారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు ఉన్నంత వరకూ పార్టీలు మనుగడలో ఉండొచ్చేమో. కానీ.. అవి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేంత స్థాయిలో ఉండడం అనుమానమే. ‘గుంపులో గోవింద’గా మిగిలిపోవాల్సిందే. పదేళ్ళ క్రితం వరకూ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయగలిగే స్థాయిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలే వాటిని లెక్కచేయడం లేదు. రాష్ట్ర, కేంద్ర నాయకత్వం పనివిధానమే అందుకు కారణం. ఆ రెండు పార్టీల స్వయంకృతాపరాధం.
వందేళ్ళ చరిత్ర కలిగిన సీపీఐ ఒక సైద్ధాంతిక పార్టీయే. అందులో సందేహం లేదు. దాన్నుంచి పుట్టుకొచ్చిన సీపీఎంకి సైతం స్పష్టమైన సిద్ధాంతమే ఉన్నది. కానీ దానికి తగిన ఆచరణలో ఆ రెండూ విఫలమయ్యాయి. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగినట్లుగా ఫంక్షనింగ్ మారలేదు. పూర్తిగా ఎన్నికల రాజకీయాల్లో మునిగిపోయాయి. మనుగడ కోసం పాట్లు పడుతున్నాయి. ఒకప్పుడు తమకు అన్యాయం జరిగితే కమ్యూనిస్టు పార్టీలు తోడుగా ఉంటారనే ఆశలుండేవి. ఎర్రజెండాను పెద్ద అండగా భావించేవారు. సమస్యలను మొరపెట్టుకోడానికి ఆ పార్టీల నేతలను ఆశ్రయించేవారు. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలపై ప్రజలకు ఎలాంటి భ్రమలూ లేవు.
నాయకత్వ వైఫల్యం
కమ్యూనిస్టు పార్టీ అనగానే తెలంగాణ ప్రజలకు సాయుధ రైతాంగ పోరాటం గుర్తుకొస్తుంది. అన్యాయం, అణచివేత, అకృత్యాలు ఎక్కడుంటే అక్కడ ఉద్యమం రూపంలో ఉంటుందనే గుర్తింపు ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా విప్లవాత్మకమైన ఉద్యమాన్నే నడిపాయి. చంద్రబాబు ప్రభుత్వం వణికిపోయింది. చివరకు ఆయన ఓడిపోక తప్పలేదు. యూపీఏ హయాంలో కామన్ మినిమం ప్రోగ్రాం పేరుతో కాంగ్రెస్ పార్టీని నియంత్రించగలిగాయి. కమ్యూనిస్టు పార్టీల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనని కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరించింది. ఇప్పుడు అదంతా ఒక గతం. అంతటి శక్తివంతమైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ‘నామ్ కే వాస్తే’ గా మిగిలిపోయాయి.
జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందినా ఇప్పుడు ఆ రెండు లెఫ్ట్ పార్టీలు ప్రాంతీయ పార్టీ స్థాయికంటే ఘోరంగా పతనమయ్యాయి. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో సీపీఎం అధికారాన్ని కోల్పోయింది. పుష్కరకాలమవుతున్నా మళ్లీ పవర్‌లోకి వస్తామనే ఆశ ఆ పార్టీకి లేదు. సీపీఐ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉండిపోయింది. ఈ రెండూ జాతీయ పార్టీ హోదాను నైతికంగా కోల్పోయాయి. అయినా ఇంకా ఆ పేరుతోనే చెలామణి అవుతున్నాయి. ఆ పార్టీల నాయకత్వమే వాటికి శాపం. బాహ్యశక్తులు ఆ పార్టీలను బలహీనపర్చాల్సిన అవసరం లేదు. రాజా, సీతారాం, నారాయణ, తమ్మినేని, కూనంనేని లాంటి నేతలతో మరింత పతనం అనివార్యం.
బూర్జువా పార్టీలకు తోకలుగా..
కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, బీఆర్ఎస్ లాంటివన్నీ బూర్జువా పార్టీలనేది ఉభయ కమ్యూనిస్టు పార్టీల భావన. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు, పొత్తు కోసం సీపీఐ, సీపీఎం వెంట పడేవి. ఇప్పుడు ఆ పార్టీలకు అంత సీన్ లేదు. బూర్జువా పార్టీ అంటూ విమర్శిస్తూనే దాని పంచన చేరడానికి తహతహలాడుతున్నాయి. బీజేపీని మతతత్వ పార్టీ అంటూ విరుచుకుపడే కమ్యూనిస్టులు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు దగ్గరయ్యాయి. కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం విరుద్ధ వైఖరితో అధికార బీఆర్ఎస్‌తో చేతులు కలిపాయి. చివరకు తోక పార్టీ అని విమర్శించిన కేసీఆర్‌కే తోక పార్టీలుగా మారాయి.
కొట్లాడాల్సిన పార్టీతో పొత్తా?
తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే... చందంగా బీజేపీని ఓడించడానికి బీఆర్ఎస్‌తో కలిశాయంట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ అటువైపు వెళ్ళడానికి సిద్ధపడలేదు. ఇంతకాలం కేసీఆర్‌ను నియంత అనీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి, నిరంకుశమైనదంటూ తూర్పారబట్టి... మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పొత్తు పెట్టుకున్నాయి. మునుగోడు సీపీఐకి కంచుకోట అయినప్పటికీ నిస్సిగ్గుగా బీఆర్ఎస్‌కు తాకట్టు పెట్టింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు, ధరణి, పోడు భూములు, నిరుద్యోగం, అధికార పార్టీ దౌర్జన్యాలు.. ఇలాంటి అనేక అంశాలతో ప్రభుత్వంపై ఇంతకాలం కొట్లాడి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిపై నిత్యం కొట్లాడాల్సింది పోయి బీఆర్ఎస్‌తో పొత్తుపెట్టుకోవడం చూసి జనం నోళ్లు వెళ్లబెట్టారు.
కేడర్‌ను పట్టించుకోని లీడర్లు
నవ్విపోదురుగాక అనే తీరులో రెండు కమ్యూనిస్టు పార్టీల నేతలు ప్రజల్లో పల్చనయ్యారు. కేడర్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలప్పుడు ఇదే జరిగింది. తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కల్వకుంట్ల కవిత ఢిల్లీలో తలపెట్టిన దీక్ష సందర్భంగానూ రిపీట్ అయింది. దీక్షను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించగా నిమ్మరసం ఇచ్చి కవితతో దీక్షను విరమింపజేసింది సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఒకవైపు కవితను రాష్ట్రంలోని జిల్లాల లీడర్లు తూర్పారపడుతూ ఉంటే ఢిల్లీలో ఆమెకు మద్దతు పలికి కేడర్ అసహ్యానికి గురయ్యారు.
నారాయణ.. నారాయణ...
ఏనాడూ మహిళా రిజర్వేషన్ గురించి పట్టించుకోని కవిత ఇప్పుడు ఢిల్లీలో కొంగ, దొంగ దీక్షలు చేస్తున్నారంటూ సీపీఐ రాష్ట్ర నాయకుడు ఉజ్జిని రత్నాకర్ రావు విమర్శించారు. నిరుద్యోగ భృతి, జాబ్ నోటిఫికేషన్లు, పోడు భూములు, ప్రాజెక్టుల నిర్మాణం.. అనేక విషయాల్లో ఆయన బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. కానీ ఆ పార్టీ జాతీయ నేత నారాయణ మాత్రం నిస్సిగ్గుగా కవితకు మద్దతు పలికారు. కేడర్ దుమ్మెత్తిపోస్తున్నా పిల్లి కళ్లు మూసుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు. సీపీఎం తీరు మాత్రం ఇందుకు భిన్నమేమీ కాదు. ఆ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా ఉన్న తమ్మినేనిపై జిల్లాస్థాయి నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తుంటారు. ఒక్కరికీ ఈయన అందుబాటులో ఉండరు.
కళ్ళు చెవులున్నా చూడలేని వినలేని...
లీడర్లకు వ్యక్తిగత ప్రయోజనాలు, పార్టీకి ఫండింగ్ అవసరం ప్రధానమయ్యాయి. పార్టీ సిద్ధాంతం, ప్రజలు, వారి సమస్యలు, పరిష్కారానికి ఆందోళనలు.. ఇలాంటివన్నీ అటకెక్కాయి. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ధరణి సమస్యలు, అధికార పార్టీ భూకబ్జాలు, ఎమ్మెల్యేల అవినీతి, దళితబంధు కమిషన్లు, ధర్నాలు చేసే ప్రజాస్వామిక వాతావరణం కరువు.. ఇలాంటివేవీ కమ్యూనిస్టుల కండ్లకు కనిపించడంలేదు. కేవలం గులాబీ నోట్లు మాత్రమే వారికి ఇంపుగా కనిపిస్తున్నాయి. నిత్యం ప్రగతి భవన్‌ను, సమావేశాల సందర్భంగా అసెంబ్లీని ముట్టడిస్తూ ఉంటే నేతలు ప్రేక్షకులుగా మిగిలిపోయారు. బీజేపీ బూచిని చూపి పార్టీ కేడర్, ప్రజల కళ్ళకు గంతలు కడుతున్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నా వారి అవసరాలు తీరుతున్నాయన్న సంబురాల్లో మునిగిపోయారు.
ప్రజలు ఛీకొడుతున్నా, కేడర్ చీదరించుకుంటున్నా నవ్విపోదురుగాక.. చందంగా వ్యవహరిస్తున్నారు. ఒక్క సీటునూ గెల్చుకోలేని బలహీనతపై రివ్యూలూ ఉండవు. పశ్చాత్తాపం అంతకన్నా లేదు. ఒక్క పిలుపుతో గంటల వ్యవధిలో వేలాది మంది ప్రజలను సమీకరించే సత్తా ఉన్న పార్టీలు పెట్టే సభలకు ఇప్పుడు కిరాయి ఇచ్చినా మీకో దండం... అంటూ జనం తప్పుకుంటున్నారు. ఎవరెన్ని శాపనార్ధాలు పెట్టినా మాకు కనిపించవ్.. వినిపించవ్ తరహాలో బేషరమ్ నేతలుగా మిగిలిపోయారు. సాగునీరు, తాగునీటి కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదు. హాస్టళ్లలో పురుగుల అన్నం పెడుతున్నారని పిల్లలు ధర్నా చేసినా వీరికి పట్టదు. చివరకు స్కూళ్ళలో టాయ్‌లెట్లు లేవని ఆడపిల్లలు తరగతులు బహిష్కరించినా వీరికి ఆ సమస్యలు అర్థంకావు.
మనదీ ఒక బతుకేనా... అంటూ డెబ్బై ఏండ్ల క్రితం శ్రీశ్రీ రాసిన గేయం నేటి కమ్యూనిస్టులకు చక్కగా వర్తిస్తుంది. మేల్కొంటారా.. లేక నిద్రపోతున్నట్లు నటించి సైలెంట్‌గా ఉండిపోతారా అనేదా ఆ పార్టీలు, వాటి నేతల ఇష్టం. ప్రజల నుంచి ఒంటరి కావడమే కాదు.. వారి ఛీత్కారానికి గురవుతున్నారు. ఇంత బతుకు బతికి ఇంటెనక.. అన్నట్లు సాయుధ తెలంగాణ పోరాటం నడిపించిన గుర్తింపు కాస్తా ఇప్పుడు ఒక తమ్మినేని, ఒక కూనంనేని పుణ్యమా అని పార్టీ ఆఫీసులకు, ప్రెస్‌మీట్లకు పరిమితమైంది. ఏ పార్టీ ఫండింగ్ ఇస్తే దానికే జై అన్నట్లు నేతలు తయారయ్యారు. రాజాలు, సీతారాంలు ఉన్నంతకాలం తెలంగాణలో ఈ పార్టీల భవిష్యత్తు భజన బృందం గానే మిగిలిపోతుంది.
ఎన్. విశ్వనాథ్
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672