- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఆ పోలీసుల త్యాగాలు ఏమైనట్లు!
'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అన్నాడు దాశరథి. మరికొన్ని దశాబ్దాల తర్వాత 'నా తెలంగాణ నిలువెల్లా గాయాల వీణా' అంటాడు అందెశ్రీ. మొదటి వాక్యం చెప్పిన కాలం నాకు తెల్వదు. నేను అనుభవించలేదు, చూడలేదు కాబట్టి దాని చర్చ ఇప్పుడు అప్రస్తుతం. కానీ రెండవ వాక్యం ఏదైతే గాయాల వీణా అని అందెశ్రీ అన్నాడో ఆ సమయంలో మనం మలిదశ ఉద్యమ కాలంలో ఉన్నట్లు లెక్క. దాంతో మనకు సంబంధముంది, అనుభవముంది. కాబట్టి దీనిమీదనే రెండు మాటలను చెప్పుకుందాం.
ఉద్యమానికి ఆజ్యం పోస్తూ..
2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత, కాంగ్రెస్ పార్టీలో అధికార మార్పులు రాజకీయ సమీకరణాలు వచ్చినట్లుగానే తెలంగాణ మలిదశ ఉద్యమం కళ్ళముందే చిలికి చిలికి గాలివానగా ముదిరి తుఫానులా తయారైంది. ఎక్కడ చూసినా బందులు, రాస్తారోకోలు, వంటావార్పులు, ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ లేకుండా అన్ని పార్టీలు, ఆ కులం, ఈ కులం, ఈ సంఘం, ఆ సంఘమని కాకుండా సబ్బండ వర్గాలు ఏదో ఒక మీటింగ్‌తో రోడ్లు, పట్టణాలు, పల్లెలు, కాలేజీలు, యూనివర్సిటీలు అట్టుడికిపోయిన ఘడియలు ఇంకా కళ్ళముందే కదలాడుతున్నాయి. ఉద్యమం చేస్తున్న అనేకమంది వీరులను తమ తుపాకులతో లాఠీలతో చెల్లా చెదురు చేసిన పోలీసోళ్ళు కూడా ఇదే ఉద్యమంలో లాఠీలతో చావు దెబ్బలు తిన్నారు, ప్రాణాలు అర్పించారు, ఉద్యోగాలను త్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న తరుణంలోనే కానిస్టేబుల్ క్రిష్ణయ్య రివాల్వర్‌తో కాల్చుకోని చనిపోయాడు. తన సూసైడ్ నోట్‌లో పాతికేండ్లైనా ఈ ఆంధ్ర పెత్తందారీ రాజ్యంలో నాకు ప్రమోషన్ లేదు. నా తెలంగాణ వస్తే ప్రమోషన్లు వస్తాయనే సారాంశం కూడా ప్రధానమైనది. ఆయన చావుతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చుకుంది. (మలిదశ ఉద్యమంలో కానిస్టేబుల్ కృష్ణయ్య తొలి అమరుడు). అలాగే డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ అధికారి నళిని సైతం ఈ ఉద్యమ సమయంలోనే తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. పోలీసోళ్ళ లాఠీలు ఎంతగా ఉద్యమాన్ని అణిచేందుకు పనిచేశాయో (ఉద్యోగంలో భాగంగా) ఇంకోపక్క ఇదే పోలీసుల త్యాగాలు ఇదే ఉద్యమానికి ఆజ్యం పోస్తూ వచ్చాయి. నళిని రాజీనామాతో రాజకీయ నాయకుల పదవుల రాజీనామాలపైన ప్రజల నుండి తీవ్ర ఒత్తిళ్లు మొదలైనవి.
ఉద్యమకారులపై లాఠీలను ఎత్తకుండా..
తెలంగాణ ఉద్యమం అంతకు మించిన తీవ్రతతో నడుస్తున్న తరుణంలోనే 2013 సెప్టెంబర్ 7న ఏపీఎన్‌జీఓ తరపున భారీ మీటింగ్ సమైక్యాంధ్ర కొరకు హైదరాబాద్‌లో నడుస్తున్నది. దాదాపుగా నాటి ఆంధ్రప్రదేశ్ పాలకులైన వారంతా ఈ మీటింగ్‌లోనే ఉన్నారు. చుట్టూ లక్షల మంది సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నవాళ్ళే అక్కడ బందోబస్తు నిర్వహించే పోలీసుల్లో కూడా నూటికి ఎనభై మంది ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే. నాటి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మీటింగ్ ఒక సంచనలం సంతరించుకుంది. సభా వేదికపైన తెలంగాణ వద్దు ఆంధ్రప్రదేశ్ ముద్దు అంటూ సాగిపోతున్న సందేశానికి దీటుగా జై..తెలంగాణ అంటూ ఒక్కసారిగా గుండెలు అవిసిపోయేలా పిడుగులా పిడికిలెత్తి నినదించినోడు కానిస్టేబుల్ శ్రీనివాస్. ఇతనిపైన లాఠీలతో దెబ్బల వర్షం కురిపించారు అదే పోలీసులు. అయినా సరే తెలంగాణ నినాదాన్ని మరింత జోష్‌గా పలికిన తీరు, తెలంగాణ ఆకాంక్షను తెలియజేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అప్పుడే సద్దుమణుగుతున్న ఉద్యమం మళ్ళీ అగ్గి రగులుకుంది. అలాగే ఎంతోమంది తెలంగాణ ప్రాంత పోలీసులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న తెలంగాణ ఉద్యమకారులపైన తమ లాఠీలను ఎత్తకుండా మిన్నకున్నారు. ఇది గమనించిన పోలీసుశాఖ పెద్దలు ఎక్కువగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పోలీసులను ఉద్యమ అణచివేతకు ఉపయోగించారనే చెప్పాలి.
ఆ హామీలు ఏమయ్యాయి..
అయితే, ఈ నాలుగు సంఘటనలను బట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పోలీసులు ఎన్ని త్యాగాలకు సిద్ధపడ్డారో మనకర్ధమైంది. మరీ ఆనాడు రాజీనామా చేసిన డీఎస్పీ నళిని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు! జై తెలంగాణ అంటూ గర్జించిన శ్రీనివాస్ ఏ స్థానంలో ఉన్నాడు! తెలంగాణ వస్తే శ్రీనివాస్‌కు డైరెక్ట్‌గా ఎస్‌ఐ పోస్ట్ ఇస్తామని చెప్పిన హమీ ఏమైంది! పోలీసు వ్యవస్థనంతా ఒకే గొడుగు కింద తెస్తామని పలికిన మాటలు నీటి మూటలు ఎందుకైనయ్! ఎవరెవరికో చట్టసభల్లో రాజకీయ అవకాశం ఉన్నప్పుడు పోలీసులకు డిపార్ట్మెంట్ తరఫున కనీసం ఒక ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేకపోయారు! పోలీసుల ప్రమోషన్లు ఏమైనట్లు! 317 జీఓ కింద పోలీసుల బదిలీ వ్యవహారాలు ఎందుకు కఠినమైనట్లు! ఇందులో పనిచేసే హోంగార్డులకు కారుణ్య నియామకాలు ఎందుకు ఎత్తేసినట్లు, వీరి రెగ్యులరైజ్ ఏమైనట్లు!
బహుజన పోలీసుల బలిదానం వ్యర్థమేనా?
ఎక్కడ పోలీసుల త్యాగాలు! ఎక్కడ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ నినాదపు ఫలితాలు! ఎవరు అనుభవిస్తున్నారు వీళ్ళ త్యాగాలను! ఇప్పటివరకు కనీసం ఒక్కసారైనా కానిస్టేబుల్ శ్రీనివాస్ రాష్ట్ర ఉత్తమ పోలీసుగా ఎందుకు ఎంపిక కాలేదు! కనీసం దశాబ్ది ఉత్సవాలలో కూడా తాను కన్పించలేదు ఎందుకు! చిత్రం ఏమిటంటే తెలంగాణ కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసి లాఠీలతో చావు దెబ్బలు తిన్న సాధారణ పోలీసు కానిస్టేబుల్ శ్రీనివాస్. కానీ ఇప్పటికీ అతని మీద వేధింపులు ఉండటం దేనికి నిదర్శనం! అయితే ఇక్కడ త్యాగాలు చేసిన పోలీసులంతా బహుజనులే కావడం మరొక విశేషం. అందుకేనేమో వీరి త్యాగం ఎక్కడా తెరమీద కన్పిస్తలేదు! ఇలా ఆలోచిస్తూ రాసుకుంటూ పోతే పోలీసుల బాధ ఇంకా తీరని వెతగానే మిగిలి వుంది తెలంగాణలో. నా తెలంగాణలో ఈ గాయాలు మానేదెన్నడు?
వరకుమార్ గుండెపంగు
99485 41711