- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నారులను వెంటాడుతున్న ఆటిజం
బుడి బుడి అడుగులతో ముద్దు ముద్దు మాటలతో బోసి నవ్వులతో ఉండాల్సిన చిన్నారులు అందుకు భిన్నంగా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవడం, ఏదో తెలియని పరధ్యానం, కొన్నిసార్లు కారణం లేకుండానే బిగ్గరగా ఏడవడం, పదేపదే మారాం చేయడం, తమను తామే గాయపర్చుకోవడం చేస్తుంటే తల్లిదండ్రులు తల్లడిల్లుతారు. పిల్లలకు ఉన్న ఈ రుగ్మతను ఆటిజం అంటారు.
ఆటిజం పైకి కనిపించే సమస్య కాకపోవడంతో అందరూ తల్లిదండ్రులు దీనిని గుర్తించడంలో ఆలస్యం చేస్తూనే ఉన్నారు. దానితో సమస్య పెరిగిపోతుంది. ఈ సమస్యపై చదువుకున్న వారిలో కూడా అంత పరిజ్ఞానం లేకపోవడం కూడా దానిని గుర్తించడం కష్టతరం అవుతుంది. ఏడాది వయస్సు వచ్చేసరికే తప్పటడుగులు వేయాల్సిన చిన్నారులు ఒకరి సాయం లేనిదే ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతున్నారు. అంతులేని సమస్యతో అల్లాడే తమ చిన్నారులను చూసుకుని నిత్యం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పుట్టుకతోనే ఈ వ్యాధి బారిన పడి కొన్ని కోట్ల మంది చిన్నారులు అల్లాడుతున్నారు. కన్నవారిని గుర్తించలేక, వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియక, ఎదుటివారు చెప్పేది అర్థం కాక, ఓ విధమైన మానసిక సమస్యను ఎదుర్కొంటూ, జీవితాలను భారంగా వెళ్లదీస్తున్నారు.
లక్షణాలు..
వాస్తవానికి ఆటిజం చాలా సాధారణమైన కమ్యూనికేషన్ డిజార్డర్. దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. అలా అని నిర్లక్ష్యం చేసేదీ కాదు. ఆడి పాడే వయసులో పిల్లలు ముభావంగా ఉంటున్నారంటే, వారిలో కచ్చితంగా ఆటిజం లక్షణాలున్నట్టే. ఆటిజం లక్షణాల్లో కొన్ని పసిపిల్లలు అకారణంగా ఏడ్వటం, గంటల తరబడి స్తబ్ధుగా ఉండడం, తల్లిదండ్రులు పిలిచినా ముభావంగా ఉండడం, తెలిసిన వారిని చూసినా నవ్వకపోవడం. బడి వయసు పిల్లలైతే పక్క పిల్లలతో కలవకపోవడం, ఒంటరిగా ఉండటం, మనుషుల కంటే బొమ్మలు, వస్తువుల పట్ల ఆసక్తి చూపడం, జవాబు ఇవ్వలేకపోవడం, సూటిగా చూడలేకపోతుంటారు. స్పష్టమైన భావోద్వేగాలేవీ వ్యక్తం చేయలేరు. మాటలు సరిగా రాకపోవడం, తాము లేదా ఎదుటి వారు గాయపడినా పట్టనట్టు ఉంటారు. అలాగే నడిచేటప్పుడు మునివేళ్ల మీద నడవడం, ఎదుటివారు అడగనిదే జవాబుగా చెప్పటం, అసందర్భంగా మాట్లాడడం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో ప్రతి దానికీ భయ పడడం, గాలికి తీగ లాంటిదేదన్నా కదులుతున్నా చూసి భయపడడం ఇలాంటి పిల్లల్లో ఉంటుంది. చిన్న చిన్న శబ్దాలకూ గట్టిగా చెవులు మూసుకోవడం, వంటి భావోద్వేగపరమైన అంశాలూ ఉంటాయి.
కౌన్సెలింగ్‌తో ఫలితం
పిల్లలకు చికిత్స కలిగిస్తూనే పిల్లల పట్ల శ్రద్దను కలిగి ఉంటే ఆటిజం పిల్లలతో అద్భుతాలు సృష్టించవచ్చు. పిల్లల్లో భాషాపరమైన ఇబ్బందులు పోగొట్టి స్వేచ్ఛగా మాట్లాడగల స్థాయికి తీసుకెళ్లడం, పిల్లల్లో చురుకుదనం తేవాలి. కావలసిన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఆటిజం పిల్లలకు తగిన మందులు వాడటం, కౌన్సిలింగ్, శిక్షణ ద్వారా మానసిక పరిపక్వతను పెంచటం, పిల్లలకు తగు ఆహారాన్ని మాత్రమే ఇవ్వటం ద్వారా ఆటిజాన్ని అదుపు చేయవచ్చు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఆటిజం పిల్లల పెంపకం శిక్షణ తీసుకున్నట్లైతే మంచి ఫలితం ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషనల్ థెరపీ, ప్లే అండ్ స్టడీ గ్రూప్స్, ఎర్లీ ఇంటర్‌వెన్షన్ శిక్షణ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ, సైకలాజికల్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లతో మంచి ఫలితం ఉంటుంది.
డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి
రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్
97039 35321