‘మేడే’ కార్మిక వర్గ పోరాట దినం

by Ravi |   ( Updated:2023-05-01 00:15:06.0  )
‘మేడే’ కార్మిక వర్గ పోరాట దినం
X

‘మేడే’ కార్మిక పోరాట దినం. 1886లో చికాగో కార్మికులు తమ విలువైన నెత్తురును పారించి 8గంటల పనిదినం హక్కును సాధించారు. 137 సంవత్సరాల క్రితం సాధించుకున్న ఈ 8 గంటల పనిదినం హక్కు నిత్యం ఉల్లంఘనలకు గురయ్యి నేడు పబ్లిక్, ప్రైవేట్ రంగ సంస్థలు ఇంకా అదనపు విలువను దోపిడీ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అన్ని సంస్థలు కార్మికుల శక్తిని విపరీతంగా దోచుకుంటున్నాయి.

ప్రస్తుతం కార్మికుడు దోపిడీ రూపాలను కార్మిక వర్గం గుర్తించకుండా ఎక్కువ పనిగంటలు తప్పనిసరి అని కార్మికుడే భావించేలా సామాజిక స్థితిని, ఉద్యోగ అభద్రతను కల్పిస్తున్నారు. కార్మికుడి శ్రమనే కాదు, ప్రాణాలు కూడా కోల్పోయేలా ఉద్యోగ పరిస్థితులను సృష్టిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం సాధించుకున్న హక్కును కోల్పోతున్నది.

19వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు ఏర్పడి కార్మికుల అవసరం ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు కార్మికులతో రోజుకు 16 నుంచి 20 గంటలు పనిచేయించేవారు. పైగా పనిచేసే కర్మాగారాలలో సరైన సౌకర్యాలు కూడా కల్పించేవారు కాదు. దీంతో కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. శ్రమను మరవడానికి కాస్తా విశ్రాంతి తీసుకున్నా యాజమానులు కోపోద్రికులై ధిక్కార నేరం కింద జరిమానా విధించేవారు. ఈ దారుణ చర్యల నేపథ్యంలో కార్మికులలో తిరుగుబాటు మొదలై కార్మిక సంఘాల నిర్మాణం, ట్రేడ్ యూనియన్ల ఏర్పాటు చేసుకొని పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని (ట్రేడ్ యూనియన్లను గుర్తించాలని) కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, తగినంత విశ్రాంతినివ్వాలని కోరుతూ కార్మికవర్గం విప్లవ శంఖం పూరించింది. ఈ పోరాటంలో ఎంతోమంది మరణించి తమ హక్కును సాధించుకున్నారు. వారి స్పూర్తికి గుర్తుగా జరుపుకోనేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే.

1923లో తొలిసారిగా భారత్‌లో ‘మేడే’ను పాటించారు.. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటంతో అప్పటి నుంచే కార్మికవర్గాల్లో చైతనం మొదలైంది. ప్రస్తుతం అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.

మేడే హక్కును అణిచివేస్తూ..

చికాగోలో కార్మికులు సాధించిన 8 గంటల పనిదినం ‘‘మేడే’’ హక్కు ప్రైవేటీకరణ, సరళీకరణ మూలంగా మొత్తంగా కార్మికవర్గానికి 8 గంటల పనిదినం దూరమయ్యే స్థితి ఏర్పడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ పోరాటాలను అణచివేసిన సామ్రాజ్యవాద శక్తులు, ప్రజాస్వామ్యం అంటూ డాంబికాలు కొడుతున్న దళారి, బూర్జువా, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులుగా మారి ‘మేడే’ హక్కును అణచివేస్తున్నారు, రద్దు చేస్తున్నారు. ఎంతో త్యాగంతో పోరాడి 8 గంటల పనిదినం సాధిస్తే నేడు 12 గంటలుగా, 16 గంటలుగా పనిదినాలను పొడిగిస్తున్నారు. కార్మిక చట్టాలను బలహీనపర్చడానికి 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వం నుండి నేటి వరకు మన దేశ రాజకీయ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

నేడు అసంఘటిత రంగంలోని కార్మిక వర్గం పూర్తిగా బలైన స్థితి కొనసాగుతూ వస్తోంది. అసంఘటిత రంగంలో కార్మికుడు చనిపోతే, ఆ ప్రాణానికి వెలగట్టి మూడోకంటికి తెలియకుండా శవాన్ని బయటికి తరలించే మెకానిజాన్ని అన్ని ప్రైవేటురంగ పరిశ్రమలు కలిగి ఉన్నాయి. పరిశ్రమలోకి ఎవరూ లోపలికి అడుగుపెట్టనివ్వకపోవడంతో నిజాలు లోపలే బందీ అవుతున్నాయి. మన న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ బలవంతంగా యాజమాన్యం ఇస్తున్న నష్టపరిహారాన్ని బంధువులు తీసుకోవాలని భయపెట్టి వారు తీసుకునేలా చేసి, నిశ్శబ్ధంగా వలస కార్మికుల శవాలను రాష్ట్ర పరిధులు దాటించేస్తున్నారు.

1947 ప్రాంతంలో అప్పుడు రాజకీయాలు కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేవి. అవి నేడు పూర్తిగా రాజకీయంగా మారి, రాజకీయమే ‘వ్యాపార సరుకు’గా మారిపోయిన స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో సామాజిక విలువలు, సామాజిక బాధ్యత, ప్రజల జీవించే హక్కు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాయి. కార్మిక చట్టాల సవరణలతో 8 గంటల పనిదినం ఉనికిలో లేకుండా పోతున్నది. పెరిగిన పనిగంటలకు కార్మికులు సిద్ధపడితేనే వారికి జీవనోపాధి హక్కు దొరుకుతుంది లేకపోతే, ఉద్యోగాలుండి తొలగించే అధికారాన్ని కూడా ఈ సవరణ ద్వారా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు పొందగలుగుతున్నారు. ఇక సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, పారిశ్రామిక వివాదాల చట్టం యొక్క స్థితి రేపు రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. కార్మికుల శ్రమను విపరీతంగా దోచుకునే అవకాశం ఇప్పటికే ఉన్నప్పటికి, ఈ కార్మిక చట్టాల సవరణల ప్రక్రియ ద్వారా పనిగంటల పొడిగింపు వంటి నిరంకుశ విధానాలకు చట్టబద్ధత చేకూరుతున్నది.

కాంట్రాక్ట్ వ్యవస్థతో శ్రమదోపిడీ..

ప్రపంచం సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందింది. ఎంతలా అంటే ‘మేడే’ హక్కులను కూడా అమలు చేసుకోలేని స్థితికి, ప్రభుత్వం ఖాతరు చేయకున్నా మనం అడగలేని స్థితికి దిగజారిపోయాం. ఒకవైపు గత రెండు దశాబ్దాలుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు 12 గంటల పనిదినంగానే కొనసాగిస్తున్నాయి. దాంతో వారి జీవితాలు చిన్నాభిన్నమౌతున్నప్పటికి ఆ స్థితిని చూసి భయపడుతున్నామే తప్ప, పని గంటల గురించి మనమెవరం గొంతెత్తి ప్రశ్నించలేము. ఇలాంటి అసంఘటిత కార్మిక రంగం ఎక్కువగా కలిగిన మన దేశంలో కార్మిక చట్టాల సవరణలకు ముందే, మన తెలంగాణలో ఇతర రాష్ట్రాల కార్మికులు 12 గంటల పనిదినాలను, ఇంకా ఒత్తిడి పెంచితే, 18, 24 గంటల పనిదినాలను కూడా పాటిస్తున్నారనేది ఒక వాస్తవం. ఇలాంటి సమయాల్లో అలసటతో ప్రమాదాలు జరిగి తమ ప్రాణాలను, తమ జీవించే హక్కును కూడా కోల్పోతున్నారు. ఇప్పటికే మన టీఎస్ఆర్‌టీసీలో 8 గంటల పనిదినం అసలే అమలు కావడం లేదు. మినిమం 10 నుండి 12 గంటలు కార్మికులు విధులు నిర్వహించాల్సి వస్తుంది.

సింగరేణిలో మాత్రం కార్మిక వర్గానికి బలం ఉంది కాబట్టే 8 గంటల పనిదినం అమలవుతున్నది. సింగరేణిలో కూడా సంఘటిత కార్మికవర్గం 35 వేలు ఉంటే, అసంఘటిత, కాంట్రాక్ట్ కార్మిక వర్గం 40 వేలకు పైగా ఉన్నారు. వీరిని అన్ని పనులకు యాజమాన్యం ఉపయోగించుకుంటోంది. నిజానికి కాంట్రాక్ట్ కార్మికులు కొన్ని పనులకే పరిమితమై ఉంటారు. కానీ దేశవ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులే శాశ్వత కార్మికుల కన్నా, ప్రమాదకర స్థలాల్లో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. వారు ప్రమాదానికి గురైతే యాజమాన్యం శాశ్వత ఉద్యోగికి నష్టపరిహారం ఇచ్చినట్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగి మరణాలకు నష్టపరిహారం ఇవ్వదు. ప్రాణాల మధ్య తేడాలను చూపిస్తుంది. దీంతో శవాన్ని పెట్టుకొని న్యాయం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇది అన్ని రంగాల్లో కొనసాగుతున్నది. ఇదే స్థితి ప్రైవేట్ పరిశ్రమలన్నిట్లోను కొనసాగుతున్నది. ఒక్కోసారి పోలీసులు ఈ ఘటనలో దూరి బాధిత కుటుంబాలను బెదిరించి, యాజమాన్యం తరపున నిలబడి కార్మికులకు రావల్సిన న్యాయపరమైన హక్కులను కూడా అందకుండా చేస్తున్నారు.

ప్రస్తుతం 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా సవరించాల్సిన అవసరం లేదు. కాబట్టి వాటిని అవే చట్టాలుగా కొనసాగించాలని, కార్మిక చట్టాలు సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఒకే విధంగా అమలు చేయించాలని అదే ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యతగా కార్మిక వర్గాల బలమైన పోరాటాలు నిర్మించాల్సిన అవసరాన్ని పౌరహక్కుల సంఘం గుర్తిస్తూ అలాంటి పోరాటాలకు మా మద్దతు అందజేస్తామని తెలియజేస్తున్నాము. మన దేశంలో దత్తాసామంత్, శంకర్ గుహనీయోగి లాంటి కార్మిక నేతల అవసరం ఎంతైనా ఉంది.

ఎన్. నారాయణరావు

ప్రధాన కార్యదర్శి

పౌరహక్కుల సంఘం

Advertisement

Next Story

Most Viewed