సమాజమే బాధ్యతను విస్మరిస్తే..!?

by Ravi |
సమాజమే బాధ్యతను విస్మరిస్తే..!?
X

మన దేశంలోని రాజకీయ పార్టీల నాయకులు వారు పురుషులైనా, మహిళలైనా తమ అధికార, రాజకీయ అవసరాలకు ఉపయోగపడుతుందనుకున్నప్పడు మాత్రమే మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాలకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. పార్టీల వారీగా విడిపోయి ద్వంద్వ విధానాలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తారు. కోల్‌కతాలో ట్రైనీ పీజీ వైద్యురాలిని వైద్యశాలలో నాలుగు గోడల మధ్య ఆటవికంగా హత్యాచారం చేసి చంపారు. ఇలాంటి ఘోరనేరాలపై కఠినంగా శిక్షలు విధించి కట్టడి చేయకపోతే ఇవి ఇంతటితోనే ఆగవు. అబ్బాయిలు ఇంటా, బయట నడుచుకొనే తీరు, మహిళలతో ఎలా ప్రవర్తించాలో కుటుంబంలో చెప్పలేకపోతున్నారు. పట్టించుకోని సమాజం. కట్టుతప్పిన విశృంఖల దశకు చేరిన మనుషుల ప్రవర్తనే కారణం. టెక్నాలజీ బాధితులకు, పేదలకు బాసటగా నిలిచిన నాడే ఆ టెక్నాలజీకి సార్థకత. ఇలా రెండు వైపులా పదునున్న కత్తి పట్టుకొని సమాజంలోని నైతిక విలువలను తుంచేస్తున్న తీరు ఎన్నటికీ మారుతుందో?

హత్యాచారాలను అడ్డుకోలేమా?

మరోవైపు తనను కాపాడవలసిన తోటి వైద్యులే ట్రెయినీ డాక్టర్ చావును అసహజ మరణం అంటూ, ఆత్మహత్య కాదంటూ వాదిస్తున్నా ఆమె పంచనామాను మార్చి రాసిన తీరు దుర్మార్గం. సుమోటోగా కోర్టు జోక్యంతో దోషులను గుర్తిస్తున్నారు. ఇందులో పాలకుల పాపం ఏ మేరకో త్వరలో తేలనుంది. ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రుల దుఃఖం లోతు ఎంతో? కడుపు కోత బాధ బరువెంతో.. ఈ బాధను తీర్చే ఔషధాలు, కడుపు కోతకు తట్టుకునే పెయిన్ కిల్లర్లు, కన్నోల్ల కన్నీళ్లు ఇంకిపోయే ఆయింట్మెంట్ ఉంటే బాగుండని, విలువలు మరిచిన సమాజం ముందు ఏడ్చే బాధైనా తప్పేదనే వారి దీన వేదన అరణ్య రోదన కారాదు. ప్రభుత్వాలు ఓవైపు ఎన్ని చర్యలు చేపడుతున్నా మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో మూడొంతుల మంది నిర్దోషులుగా విడుదలవుతున్నారు. హీనమైన ఈ నేరాల్లో శిక్షలు అరకొరగా ఉండటం మరీ దారుణం.

శిక్ష పడుతుందనే భయం లేకనే..

మన రాష్ట్రంలోని 2022లోనే కోర్టుల్లో విచారణ పూర్తయి 609 అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడగా 4,486 కేసులను కొట్టేశారు. మహిళలపై నేరాలను అరికట్టడానికి రాష్ట్రంలో చేపట్టిన అనేక చర్యలు మెరుగ్గా ఉన్నప్పటికీ, అత్యాచార నిందితులకు శిక్ష విషయంలో పరిస్థితి పేలవంగా ఉందంటున్నారు. 90 శాతం కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసినవారే. బంధుమిత్రులు సర్ది చెప్తుండడంతో బాధితులు పునరాలోచనలో పడటంతో కేసులు వీగిపోతున్నాయి. 2023లో రాష్ట్రంలో నమోదైన అత్యాచార కేసుల్లో 69.18శాతం మంది పెళ్లి చేసుకుంటామని మభ్యపెట్టి లైంగిక చర్యలకు పాల్పడ్డారు. ప్రతి వ్యక్తి నుండి సమాజం వరకు పాలకుల నుంచి పాలితుల వరకు మీ ఇంట్లోనే ఈ సంఘటన జరిగిందని భావించి నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా పాలకులపై ఒత్తిడి పెంచడి. బాధ్యతగా వ్యవహరిస్తే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కృతం అవుతుంది. ఆధునిక టెక్నాలజీని మనిషి మనుగడకు, నైతిక విలువలు పెంపుదలకు, విచక్షణతో కూడిన ప్రవర్తనకు తోడ్పడేలా వాడుకుందాం. మహిళను ఎదగనిద్దాం.. మానవత్వాన్ని పూజిద్దాం.

మేకిరి దామోదర్,

95736 66650

Advertisement

Next Story