- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ ఉద్యోగులకు పాస్‌పోర్ట్ పొందడంలో ఇన్ని తిప్పలా..?
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా తయారైంది రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగ, ఉపాధ్యాయుల పరిస్థితి. పాస్‌పోర్ట్ జారీ విధానాన్ని సరళీకృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ల క్రితమే ఉత్తర్వులు జారీ చేసినా జిల్లా స్థాయిలో అమలుకు అధికారులు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా, విద్యా శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధిత అధికారులు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నారు. రూల్స్‌కి విరుద్ధంగా డీఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేసిన ఆదేశాలను సైతం కింది స్థాయి అధికారులు బేఖాతరు చేస్తున్నారు.
సులభ పద్ధతిలో పాస్‌పోర్ట్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాస్‌పోర్ట్ పొందాలంటే అపాయింటింగ్ అథారిటీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకొని పాస్‌పోర్ట్ దరఖాస్తుకు జత చేయాల్సి వచ్చేది. వివిధ స్థాయి అధికారులు ఆమోదించి ఉద్యోగి చేతికి ఎన్ఓసీ అందేవరకు విపరీతమైన జాప్యం జరిగేది. దీంతో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా ఆలస్యమయ్యేది. ఉద్యోగ, ఉపాధ్యాయులను వ్యయప్రయాసలకు గురిచేస్తున్న ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ల క్రితమే సవరించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పాస్‌పోర్ట్ జారీ కోసం సరళీకృత విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
నూతన విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల విభాగాధిపతులను లిఖితపూర్వకంగా కోరింది. దీనిలో భాగంగానే లెటర్ నం. HYD/30/POL/OPM/2019/MISC Dated: 14.11.2019 ద్వారా తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు సైతం డిప్యూటీ పాస్‌పోర్ట్ ఆఫీసర్ లేఖ రాశారు. నూతన విధానం అమలుకు డీఈవోలు, ఎంఈవోలు, గెజిటెడ్ హెడ్మాస్టర్లకు తగిన సూచనలు చేయాలని కూడా ఆ లేఖలో స్పష్టంగా కోరారు. పాస్‌పోర్ట్ ఆఫీసర్ రాసిన లేఖను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ లెటర్ నం.L.Dis.No. 2422/Ser.IV/2019 Dated:25.01.2020 ద్వారా డీఈవోలు, ఆర్జేడీలకు సర్క్యులేట్ చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంఈవోలు, హెడ్మాస్టర్లకు సమగ్రమైన, స్పష్టమైన సూచనలు ఇవ్వాలని కూడా డీఈవోలు, ఆర్జేడీలను డైరెక్టర్ ఆదేశించారు.
ఒక్క సర్టిఫికెట్ జత చేస్తే చాలు!
ఈ ఉద్యోగులకు కొత్త పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ రీఇష్యూ కోసం కింది మూడు సర్టిఫికెట్లలో ఏదైనా ఒకటి పాస్‌పోర్ట్ దరఖాస్తుకు జతపర్చాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నది. ఆ మూడు సర్టిఫికెట్లలో మొదటిది, ఐడెంటిటీ సర్టిఫికెట్ (అనెక్జర్-ఏ) కాగా, రెండవది, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (అనెక్జర్-జి). అనెక్జర్-ఏ, అనెక్జర్-జి సర్టిఫికెట్లను అపాయింటింగ్ అథారిటీ లేదా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ మాత్రమే జారీ చేస్తారు. ఇక మూడవది, ఇంటిమేషన్ లెటర్ (అనెక్జర్-హెచ్). ఈ అనెక్జర్-హెచ్ పై కార్యాలయ నియంత్రణాధికారి సంతకం చేస్తే సరిపోతుంది. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు కంట్రోలింగ్ ఆఫీసర్‌కు కేవలం సమాచారం ఇస్తే చాలు అని అనెక్జర్-హెచ్ నిర్దేశిస్తున్నది. హైస్కూళ్లలో పనిచేసే టీచర్లకు స్కూల్ హెడ్మాస్టర్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సంబంధిత కాంప్లెక్స్ హెచ్ఎం/ఎంఈవోతో అనెక్జర్-హెచ్ పై సంతకం చేయించి దరఖాస్తు సమర్పిస్తే చాలు. వెరిఫై చేసి వెంటనే పాస్‌పోర్ట్ జారీ చేస్తారు.
మోకాలడ్డుతున్న డీఈవోలు!
నిబంధనల ప్రకారం అనెక్జర్-హెచ్‌తో చాలా సులభంగా, త్వరగా పాస్‌పోర్ట్ పొందే హక్కు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉంది. అయినప్పటికీ తమ నుంచి శాఖాపరమైన పర్మిషన్ తీసుకున్న తర్వాతే పాస్‌పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని పలువురు డీఈవోలు టీచర్లకు హుకుం జారీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ జారీలో తీసుకొచ్చిన సరళీకృత విధానానికి డీఈవోలు తూట్లు పొడుస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేసిన ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారు. తమ ఆదేశాలకు భిన్నంగా పాస్‌పోర్ట్ తీసుకునే టీచర్ల విదేశీ సందర్శన దరఖాస్తులను తిరస్కరిస్తామని డీఈవోలు లిఖితపూర్వక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డీఈవోల హెచ్చరికలకు భయపడి ఎంఈవోలు, హెడ్మాస్టర్లు అనెక్జర్-హెచ్ పై సంతకం చేయడానికి జంకుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సీరియస్‌గా తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి, తమ ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్న డీఈవోలపై డైరెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలి. పాస్‌పోర్ట్ పొందే విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సరళీకృత నిబంధనలు అన్ని జిల్లాల్లో అమలయ్యేలా చూడాలి.
మానేటి ప్రతాపరెడ్డి
TRTF గౌరవాధ్యక్షుడు
98484 81028