- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాస్వామ్యానికి ‘ఓటే’ ఊపిరి!
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల కమిషన్ ప్రతిష్ట మసకబారుతోంది. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ అపహాస్యం పాలవుతోంది. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగాన్ని కులం, డబ్బు, మద్యం ప్రభావితం చేస్తున్నాయి. వీటిని నియంత్రించడంలో ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర వహిస్తోంది. ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా నేతల తలరాతలు మార్చవచ్చు. ప్రభుత్వాలను మార్చడానికి ఓటే వజ్రాయుధం. దాని విలువ తెలుసుకుని, ఎవరిని ఎన్నుకుంటే మేలు జరుగుతుందో ముందు ఓటరు గుర్తిస్తే సుపరిపాలన అందుతుంది. దేశ ప్రగతికి దిక్సూచి ఓటు. ఓటర్లు చైతన్యవంతులు అయితే ఓటు హక్కు సద్వినియోగం అవుతుంది. తద్వారా ప్రజాస్వామ్యం ఫలప్రదం అవుతుంది.
స్వచ్ఛందంగా ప్రజాసేవ చేయడానికి రాజకీయ రంగం ఒక వేదిక. అలాంటి పవిత్రమైన వేదిక దొంగలకు, దోపిడీదారులకు, నేరస్థులకు నెలవుగా మారింది. పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల, అలాగే డబ్బు మద్యం, విరివిగా పంపిణీ చేస్తున్న ప్రాంతాల్లో పోలింగ్ శాతం బాగా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఓటుహక్కు వినియోగించుకోవడం మొక్కుబడిగానే సాగుతోంది. ఓటర్లు అనాసక్తి చూపడం వల్ల అక్రమార్కులకు, దొంగ ఓట్లను పోల్ చేసే అవకాశం లభిస్తోంది. 18 ఏళ్లు వయసు కలిగిన ప్రతి వ్యక్తి బాధ్యతగా ఓటు నమోదు చేసుకోవాలి. కానీ మన దేశంలో అర్హులైన పౌరులు ఓటర్లుగా నమోదు కావడంతో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇటీవల కాలంలో కొంత చైతన్యం పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో అది నెరవేరడం లేదు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి. ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని తెలియజేస్తుంది, వ్యవస్థ మార్పునకు నాంది పలుకుతుంది.
ఓటర్ల నమోదులో భారీ అక్రమాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల నమోదు, తొలగింపులో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఓటుపై వేటు ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది. జగన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీ ఓట్లు తొలగిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో బోగస్ ఓట్లు వేల సంఖ్యలో చేరుస్తున్నారు. పాలకపక్షం అదురు బెదురు లేకుండా అధికారులను అడ్డుపెట్టుకుని బోగస్ ఓట్లు చేరుస్తూ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం పాలు చేస్తున్నారు. అక్రమంగా ఓట్లు తొలగించడం, నమోదు చేయడం ప్రజాతీర్పును అగౌరవపర్చడమే. ఇది రాజ్యాంగ వ్యవస్థలను కూలగొట్టే కుట్రలో భాగమవుతుంది. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చాలన్నా, పేదవాడి స్థితిని, గతిని మార్చాలన్నా ఒక్క ఓటు చాలు. ఓట్ల నమోదు, తొలగింపులో పోలీసులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. అలాంటిది ఏకంగా 15 వేల మంది మహిళా పోలీసులను రాష్ట్రవ్యాప్తంగా బీఎల్వోలుగా నియమించారు. ఏకంగా మహిళా పోలీసులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి సాక్షాత్తూ పోలీసు అధికారులే దానిని పర్వవేక్షించడం తీవ్రమైన నేరంగా పరిగణించాలి. ప్రతిపక్ష పార్టీ ఓట్లు తొలగిస్తూ వైసీపీ వారి ఓట్లు చేరుస్తూ పోలీసులు తమ స్వామిభక్తిని చాటుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని గేలిచేస్తోంది. అధికార పార్టీ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు తొలగించి, పాలకపక్ష వికృత క్రీడలో అధికారులు పావులుగా మారుతున్నారు.
మళ్లీ అధికారంలోకి రావాలంటే కుట్రలు, కుతంత్రాలు తప్ప మరో మార్గం జగన్ రెడ్డికి కనిపించడం లేదు. దీంతో దుర్బుద్ధితో దొంగ ఓట్ల తంతుకు తెరదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచారు. తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో వేలాది దొంగ ఓట్లు నమోదు చేసి అవకతవకలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 27 లక్షల ఓట్లు తొలగించినట్లు సమాచారం.
నోటీసు ఇవ్వకుండా.. తొలగింపా?
నిబంధనల ప్రకారం ఓట్ల తొలగింపు బూత్ లెవల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలి. ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించాలంటే ఆ వ్యక్తికి లేదా కుటుంబ సభ్యులకు ముందస్తు నోటీసివ్వాలి. దానికి వారు సమాధానమిచ్చాక అది సహేతుకంగా లేకపోతే జాబితా నుంచి తొలగించాలి. ఒకే వ్యక్తి పేరు జాబితాలో రెండు చోట్ల ఉంటే ఎక్కడ ఓటు తొలగించాలో నోటీసిచ్చి అడగాలి. బూత్ స్థాయి అధికారులే పరిశీలించి ఇవన్నీ చేయాలి. అయితే కొంతమంది బూత్ స్థాయి అధికారులు వైసీపీ నాయకులతో కుమ్మక్కై వాలంటీర్ల సహకారంతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తున్నారు. ఒకే కుటుంబంలోని ఒకరి ఓటు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో... మరొకరిది వేరే కేంద్రం పరిధిలో చేర్చుతున్నారు. ఓటర్ల లిస్ట్ మొత్తాన్ని తమ ఇష్టానుసారంగా మారుస్తూ.. ఓటర్లను అయోమయానికి గురిచేస్తున్నారు. తమ ఓటు ఏ బూత్‌లో ఉందో కూడా తెలియడం లేదు.
2022 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాత ఫాం 6, 7 అతిక్రమణ గురించి అనేక ఫిర్యాదులు వచ్చినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. అవే తప్పులతో ఓటర్ల జాబితాను విడుదల చేశారు. దొంగ ఓట్ల నమోదు, ప్రతిపక్షాల ఓట్ల తీసివేతలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీకి పిలిచి చీవాట్లు పెట్టడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. సత్వరం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, బూత్ లెవల్ నుంచే దృష్టి సారించి ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్ల తనిఖీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం సమగ్రంగా ఓట్ల సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంది. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను కఠినంగా శిక్షించాలి.
ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగాలంటే..
రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ ,నేను నా దేశ ప్రజల చేతికి కత్తి ఇవ్వలేదు. ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో.. అమ్ముకొని బానిసలవుతారో అది వారి చేతుల్లోనే ఉంది. రేపటి నీ భవిష్యత్ నీ చేతుల్లోనే ఉంది.. అది ఓటు రూపంలో. పాలకపక్షాన్ని నీవు నిలదీయాలన్నా, ప్రశ్నించాలన్నా నీ ఓటు ద్వారానే సాధ్యమవుతుంది. అది సద్వినియోగం అయితే నీ తలరాతను, రాష్ట్ర భవిష్యత్‌ను మారుస్తుంది. ఓటు అనే రెండు అక్షరాలు దేశ భవిష్యత్‌కు పునాది. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కొనసాగాలంటే స్వేచ్ఛగా, నిర్భయంగా పౌరులు ఎన్నికల క్రతువులో పాల్గొని ఓటుహక్కును వినియోగించుకోవాలి.
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అన్ని వ్యవస్థలు బలహీనపడి తమ ఉనికిని కోల్పోతున్నాయి. ఇప్పటికే న్యాయ వ్యవస్థ పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షలా మారింది. ఎన్నికల వ్యవస్థ పాలకపక్షాల చేతిలో కీలుబొమ్మగా మారిందనే అపోహలు ఉన్నాయి. ఇక ఎన్నికల వ్యవస్థ బలహీనపడితే ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలవుతుంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. ఇది మన ప్రజాస్వామ్యానికి ఊపిరి. ప్రజలు తమ ఓటు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే మంచి నాయకులు ఎన్నికవుతారని గుర్తించాలి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా, సాంఘిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించాలన్నా ఇదే కీలకం. డబ్బు, అధికారం, హింసతో నెగ్గాలని ఎన్నికల బరిలోకి వస్తున్న వారి ఆటలు కట్టించాలి. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం రాష్ట్రంలో నిష్పక్షఫాత ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతను ప్రదర్శించడం ద్వారా నియంతల పాలనకు కాలం చెల్లి ప్రజా ప్రభుత్వాలు ఏర్పడతాయి.
మన్నవ సుబ్బారావు
99497 77727