Vaazhai:ప్రతి ఫ్రేమూ ఓ పెయింటింగ్..

by Ravi |   ( Updated:2024-10-20 00:46:09.0  )
Vaazhai:ప్రతి ఫ్రేమూ ఓ పెయింటింగ్..
X

గాజు పురుగులు, కాకులు, కోళ్లు, వాగులు, నీటి మడుగులు, ఆకాశం, పంట పొలాలు, పచ్చటి అరటి తోటలు, మబ్బులు, ఎగిరే పక్షులు, ఆలమందలు, పిల్లల నవ్వులు, చిలిపి అల్లర్లు- అబ్బ విజువల్స్ ఎంత హాయిగా అనిపిస్తాయో! ఎవరికైనా ఇదంతా చూస్తుంటే మాల్గుడి డేస్ లాంటి బాల్యం గుర్తుకు రావాల్సిందే! ఎవరో చేయి తిరిగిన పెయింటర్ కళాత్మకంగా గీసినట్లుండే ప్రతి షాట్‌నీ, స్టోరీలోకి అందంగా అమరుస్తూ aesthetic sense, documentary feel ఉన్న గొప్ప మాస్టర్ పీస్ వెలువరించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. అదే “వాళై”! (Vaazhai). తానన్నట్లుగానే “వాళై” నిజంగానే అతని కెరీర్ బెస్ట్ సినిమా. అంతేకాదు ఆర్టిస్టిక్ మాస్టర్ పీస్ కూడా!

ముడతలు పడ్డ మొహాలు, కళ్ళ నుంచి జారే కన్నీళ్ళు, ప్రార్థించే చేతులు, తలుపు సందుల్లోంచి చీకటిని చీల్చలేని గుడ్డి వెలుతురు, చావును కూడా పండగలాగా చేసుకునే పల్లె జనాలు, చావు డప్పుకు చిందులేసే పిల్లలు, తగాదాలు, కట్టెల పొయ్యి మీద ఎసట్లో ఉడికే అన్నం, పున్నీళ్ళలో పులిసి ‘జలంసీర్’ (German silver) టిఫిన్లలోకి చేరే చద్ది బువ్వ, వారమంతా బడి, శని, ఆదివారాల్లో భుజాలు వాచే పని- ఇదీ బాల్యమే! కానీ ఇది పేదోడి పాకల్లో మగ్గే బాల్యం.

కెమెరా ఒడిసిపట్టిన బాల్యపు అందాలు

రజనీకాంత్, కమల్ హాసన్ ఫ్యాన్ వార్, ట్రంకు పెట్టెల్లో ఆ హీరోల ఫొటోలు, టీచర్ అంటే ఇదీ అని తెలియని ఫీలింగ్, మలినం లేని స్నేహాలు, అంతలోనే తన్నులాటలు, మురికిపట్టిన నల్ల బంగారాల్లాంటి మొహాలు, ఆ మొహాల్లో మిణుగురుల్లా వెలిగే కళ్ళు, పళ్ళు, అమ్మలా అక్కున చేర్చుకునే బడి ఆవరణ, బ్యాక్ బెంచీలో కూనిరాగాలు, వసివాడని పసి ఆశలు, చిన్ని చిన్ని ఆనందాలు, పెద్ద పెద్ద కలలు- ఇదీ బాల్యమే! కష్టాలు, కన్నీళ్ళను కాసేపైనా మరిపించే బాల్యం!

బాల్యంలోని ఇన్ని పార్శ్వాలను ఆ కెమెరా ఎంత అందంగా ఒడిసిపట్టిందని!

మాస్టర్ పీస్ అంటే ఇదీ...

కెమెరా పట్టింది థెని ఈశ్వర్. కానీ ఆ కెమెరాకి కన్ను మాత్రం మారి సెల్వరాజ్! ఎవరో చేయి తిరిగిన పెయింటర్ కళాత్మకంగా గీసినట్లుండే ప్రతి షాట్ నీ, స్టోరీలోకి అందంగా అమరుస్తూ aesthetic sense, documentary feel ఉన్న గొప్ప మాస్టర్ పీస్ వెలువరించాడతను. అదే “వాళై”! మారి సెల్వరాజ్ తీసింది నాలుగు సినిమాలే కానీ ప్రతి సినిమా దేనికదే ప్రభంజనం! “పరియేరుమ్ పెరుమాళ్”, “కర్ణన్”, “మామన్నన్”, ఇప్పుడు “వాళై”! “వాళై” అంటే అరటి పండు లేదా కాయ అని అర్థం!

సెలవు వస్తే వణికే భయం

సినిమా కథంతా అరటి పండ్లు, అరటి గెలలు, అరటి తోటల చుట్టూరా తిరుగుతుంది. శివనెంజా తమిళనాడులోని ఓ మారుమూల పల్లెలో ఎనిమిదో తరగతి చదువుతుంటాడు. వాడికి శేఖర్ అనే స్నేహితుడుంటాడు. క్లాసు రూంలో, ఊర్లో, ఇంటి దగ్గర ఇద్దరిదీ ఒకే జట్టు. శివనెంజాకి “పూంగొడి” అనే టీచరంటే చాలా ఇష్టం. అమ్మంటే భయం. అక్క అంటే ప్రాణం. ఆ ఊరివాడే అయిన “కని”ని చూస్తే చనిపోయిన నాన్నే గుర్తొస్తాడు. అందుకే అతగాణ్ణి పెళ్లి చేసుకోమని అక్కని పోరుతుంటాడు. ఆ ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి ఇష్టమే! ఉన్న ఒక్కగానొక్క ఆవంటే శివనెంజాకు మక్కువ. అంతా కలిపి వాడిదో ముచ్చటైన చిన్ని ప్రపంచం. కానీ ఒకటే భయం ఆ చిన్ని ప్రపంచాన్ని వణికించేస్తుంటుంది. వారమంతా స్కూలుకెళ్ళే శివనెంజా శని, ఆది వారాలొస్తే భయపడిపోతుంటాడు. కారణం ఆ రెండు రోజులూ అరటి గెలలు మోయాలి. ఆ లేత భుజాలు అంతటి బరువును మోయలేవు. ఆ పని నుంచి తప్పించుకోవడానికి అతను ఎత్తు వేయని రోజుండదు. ఆ ఎత్తులేవీ పారవు, రెండుసార్లు తప్ప! ఆ రెండుసార్లూ అతని జీవితమే తల్లకిందులైపోతుంది!

స్కూలు కుర్రాడి దృష్టి కోణం

1999లో తన జీవితంలో జరిగిన, తమిళనాడును వణికించిన ఓ ఘోరమైన యాక్సిడెంటు ఆధారంగా మారి సెల్వరాజ్ ఈ సినిమా తీశాడు. అయితే దీన్ని ఒక బయోపిక్ లాగానో, ట్రాజెడీ స్టోరీగానో తీయాలని డైరెక్టర్ భావించినట్లుగా అనిపించదు. ఒక స్కూలుకెళ్లే కుర్రాడి దృష్టి కోణం నుంచి ఈ సినిమాను మనకు చూపించే ప్రయత్నం చేశాడతను. మోయలేని భారం జీవితాలను కుదేలు చేస్తున్నా చిన్ని చిన్ని సంతోషాలు వెతుక్కునే పేద పిల్లల బతుకు చిత్రాన్ని మన ముందు ఆవిష్కరిస్తాడు. కూలీల వెతలు, పెట్టుబడిదారుల దోపిడీ, మనుషుల్ని మనుషులుగా చూడని స్వార్థం, వేతనం పెంపు కోసం వర్కర్ల డిమాండ్లు, స్ట్రైకులు, ఆకలి కేకలు, కుల వివక్ష - ఇలాంటి అంశాలను కథలో అలవోకగా చేర్చేశాడు. కుర్రాడి కోణం కాబట్టి ఇవేవీ సీరియస్ టర్న్ తీసుకోవు. కానీ అంతర్లీనంగా కథలో ఇమిడిపోయి కథనానికి బలం చేకూరుస్తాయి. కథ శివనెంజా చూట్టూ తిరుగుతూనే క్లైమాక్స్ చేరుకుంటుంది. యాక్సిడెంట్ కంటే, శివనెంజా రియాక్షన్ కే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది. అంత ఘోరమైన యాక్సిడెంటును ఇంతగా టోన్ డౌన్ చేసి చూపిస్తారా అన్న వాళ్ళున్నారు. కుర్రాడి కోణం కదా, అలాగే ఉంటుంది మరి!

ప్రాణం పోసిన విజువల్స్

నేను మారి సెల్వరాజ్ మొదటి రెండు సినిమాలు చూడలేదు కానీ “మామన్నన్” చూశాను. కాన్సప్ట్, క్రాఫ్ట్ పరంగా చాలా నచ్చింది. థెని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, స్లో మోషన్ కోసం వాడిన స్పీడ్ ర్యాంపింగ్ టెక్నిక్ కొత్తగా అనిపించాయి. ఇప్పుడు “వాళై” సినిమాకీ అతనే సినిమాటోగ్రాఫర్. ఇందులోనూ అవే విజువల్స్ కనిపిస్తాయి. సినిమాకి అవి మంచి డ్రమాటిక్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. పైగా పచ్చని ప్రకృతి మధ్య తీసిన సినిమా కావటాన “మామన్నన్” కంటే “వాళై” కళ్ళకు గొప్ప విజువల్ ఫీస్ట్ లా తోస్తుంది. క్లోజ్ ఆప్‌లో కనిపించే డీటేలింగ్ సినిమాకి మరింత అందాన్నిస్తుంది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు ఆ విజువల్స్‌కి ప్రాణం పోస్తాయి.

సినిమా మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించి...

ఇక్కడ పొన్వేల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శివనెంజా క్యారెక్టర్ చేసిన కుర్రాడే ఈ పొన్వేల్. ఎంత సహజంగా నటించాడో! తన అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో సినిమా మొత్తాన్నీ ఒంటి చేత్తో నడిపించేశాడీ అబ్బాయి. అతని స్నేహితుడు శేఖర్ గా నటించిన రాహుల్ కూడా చాలా నేచురల్ గా కనిపిస్తాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. తెలియకుండానే వాళ్ళ అమాయకపు చేష్టలకు నవ్వేస్తుంటాము. ఇక టీచర్ గా నిఖిలా విమల్ కళ్ళకు ఇంపుగా కనిపిస్తుంది. ‘కని’గా కలయరాసన్, శివనెంజా అక్కగా దివ్యా దురైస్వామి, తల్లిగా కర్ణన్ జానకి తమ పాత్రలకు న్యాయం చేశారు. చిన్న పిల్లల నుంచి అంత గొప్ప నటనను రాబట్టుకోవడానికి డైరెక్టర్ ఎంత శ్రమపడ్డాడో ప్రతి ఫ్రేములో అర్థమైపోతుంది. మేకప్ లేని సహజత్వం గుండెలను నేరుగా తాకుతుంది.

సినిమా: వాళై (Vaazhai)

రచన, దర్శకత్వం : మారి సెల్వరాజ్

ఓటీటీ: డీస్నీ, హాట్ స్టార్


సమీక్షకురాలు

శాంతి ఇషాన్

Advertisement

Next Story

Most Viewed