మతవాద విజయం కాదు.. దేశ హితవాద విజయం!

by Ravi |   ( Updated:2024-06-06 01:01:06.0  )
మతవాద విజయం కాదు.. దేశ హితవాద విజయం!
X

దేశ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి మోడీ ప్రధానిగా విజయం సాధించారు. ఈ దేశ ప్రజల అభీష్టానికి అనుగుణంగా వచ్చిన విజయం ఇది. ఈ విజయం ఒక మహోన్నతమైన ప్రజా విజయం. ప్రజాస్వామ్య విజయం. జాతీయతా భావం సాధించిన విజయం. ఇది మతవాద విజయం కాదు దేశ హితవాద విజయం! ఈ దేశ ప్రజలు తమ భద్రత కోసం, తమ భవిష్యత్తు కోసం, భారతీయత కోసం, దేశాభివృద్ధి కోసం మోడీ-బీజేపీని ఎన్నుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది. మోడీ-బీజేపీ సాధించిన ఈ విజయం దేశ ప్రజలు ప్రపంచానికి ఇచ్చిన ఒక ఘనమైన సందేశం!

దేశంలో రెండు, మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాక కూడా మోడీ గెలిచే పరిస్థితి లేదనీ, తడబాటులో, అసహనంలో మోడీ ఉన్నాడని.. ప్రజాస్వామ్యానికి హాని చేసే విధంగా వాస్తవాల్ని వక్రీకరించడానికి విపక్ష పార్టీలు చేసిన ప్రయత్నాలను ప్రజలు విఫలం చేశారు. దేశాభివృద్ధిని, దేశ భద్రతను, భారతీయతను, దేశ సామాజిక సామరస్యతను దెబ్బ కొట్టే శక్తుల్ని ఇవాళ ఈ దేశ సామాన్య ప్రజలు తమ ఓటుతో ఓడించారు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ప్రగతి, వచ్చిన స్థానాలను పరిశీలిస్తే ప్రజలు తమకు భారతీయత, దేశ ఐక్యత, దేశ పటిష్టత ముఖ్యమని తెలుసుకున్నారనే క్షేత్ర వాస్తవాన్ని తెలియజెబుతున్నాయి.

ముచ్చటగా మూడోసారి...

గత పదేళ్లుగా దేశంలో ప్రజాస్వామ్యం లేదని అంటున్నవాళ్లు ఈ విజయాన్ని తెలివితో, తెలివిడితో సిసలైన ప్రజాస్వామ్య విజయంగా తెలుసుకోవాలి. 'ప్రజాస్వామ్యం అంటే విదేశీ దుష్టశక్తుల ప్రయోజనాల కోసం పని చేసేటటువంటి, ప్రజల్లో విలువలేని, ప్రజలు ఎన్నుకోని ఏ వ్యక్తో ప్రధాని కావడం కాదు'. 'మాకు ఈ ప్రధానే కావాలి, ఈ ప్రభుత్వమే కావాలి' అని వరుసగా మూడోసారి ప్రజలు తమకు కావాల్సిన మోడీని, బీజేపీని ఎన్నుకోవడం నిజమైన ప్రజాస్వామ్యం. బీజేపీ,మోడీ పనితీరునే ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక దాన్ని నిందించడం, నిరసించడం, అంగీకరించకపోవడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య దేశంలో పౌరులందరూ ప్రజాతీర్పును శిరసావహించి గౌరవించి తీరాలి.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మోడీ-బీజేపీ పనితీరుపై ఈ దేశ ప్రజల విశ్వాసాన్ని విశదం చేస్తోంది. ఇంకా మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా రభస చెయ్యడం వంటివి చేస్తే ప్రజాస్వామ్యాన్ని అవమానించడం, ప్రజల్ని అవమానించడం ఔతుంది.

నెహ్రూ గెలుపు కన్న ప్రశస్తం!

1951, 57, 62 లలో వరుసగా నెహ్రూ ఎన్నిక కావడాన్ని అర్థం చేసుకోవడం చాలా తేలిక. గాంధీ హత్య నెహ్రూకు ఎంతో లాభించింది! హత్యానంతరం 'గాంధీ దైవం, నెహ్రూ దైవకుమారుడు' అన్న భావన నెహ్రూ విజయానికి ప్రధానమైన కారణం. 'కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చింది' అన్న ప్రజల భావన కూడా నెహ్రూ విజయాలకు ఎంతో తోడ్పడింది. పటేల్ మరణించడం కూడా నెహ్రుకు లాభించింది. అప్పట్లో నెహ్రూ తప్పితే ఎవరూ లేని స్థితి ఉండేది. నెహ్రూకు సానుకూలంగా అప్పటి మీడియా ఉండేది. నాడు నెహ్రూ కన్నా గొప్పవారైన అంబేడ్కర్ ఓడిపోవడాన్ని గమనిస్తే నెహ్రూ వరుసగా గెలవడం ఎట్లాంటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవాళ్టి పరిస్థితి వేరు. దేశ విరోధుల కుట్రలు, విదేశీ మాఫియాలు, దేశ వ్యతిరేక ఎకో సిస్టమ్, ప్రాంతీయతా వాదం, మోడీకి వ్యతిరేకమైన 73% ముస్లిం ఓటు, వ్యతిరేక మీడియా పన్నాగాలు, దారుణమైన వ్యతిరేకతతో పత్రికారచనల దాడి, విద్వేష వాదం, విదేశాల డబ్బుతో ఓటర్లను కొనడం వంటి పరిణామాల మధ్య వరుసగా మోడీ మూడోసారి గెలవడం నెహ్రూ గెలుపులకన్నా ఎంతో ప్రశస్తమైంది.

దేశాన్ని గెలిపించిన విజయం!

2014లో బీజేపీ అధికారంలోకి రాకపోయి ఉండుంటే మన దేశం అల్లకల్లోలం అయిపోయి ఉండేదని ప్రజలు తెలుసుకున్నారు. అందుకే బాధ్యతాయుతంగా మోడీ-బీజేపీని ఎన్నుకుని ప్రజలు దేశాన్ని దక్కించుకున్నారు. అప్పటిలాగే మరోసారి దేశ ప్రజలు బాధ్యతాయుతంగా మూడోసారీ ఇదే పార్టీని ఎన్నుకుని దేశాన్ని గెలిపించుకున్నారు. ఈ దేశం ఉనికికి, భద్రతకు, ప్రగతికి మోడీ-బీజేపీ ఎంతో ముఖ్యం. ఈసారి దేశ ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఈ విజయం దేశ ప్రజలు ప్రపంచానికి ఇచ్చిన ఒక ఘనమైన సందేశం!

-రోచిష్మాన్

94440 12279

Advertisement

Next Story

Most Viewed