హత్యాచారాలపై శాశ్వత పరిష్కారం అవసరం!

by Ravi |   ( Updated:2024-09-04 01:15:44.0  )
హత్యాచారాలపై శాశ్వత పరిష్కారం అవసరం!
X

నిర్భయ ఘటనతో నిందితులకు ఉరిశిక్ష, దిశా కేసులో నిందితులకు ఎన్‌కౌంటర్ జరిగిపోయింది. అయినా ఈ దారుణ , మారణ ఘటనలు ఆగిపోయాయా? కొంతలో కొంత మేర అయినా తగ్గాయా? రెట్టింపు అయ్యాయి తప్ప తగ్గలేదు. హత్యాచారాలు పెరిగినా మన నినాదం, విధానంలో ఏ మార్పూ రాలేదు.

ఇటీవల ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రెయినీ డాక్టర్‌పై హత్యాచార ఘటనలో నిందితుడికి ఉరిశిక్ష వేయండి అని డిమాండ్ ఒక్కటే.. సమస్యకు మూలం అని ఆలోచించకుండా ఆవేశపూరిత డైలాగ్‌లతో ముందుకు వెళ్తే, రేపు మన ఇంట్లోనే ఓ దీపం ఆరిపోవచ్చు. ఇక హత్యాచారాలు జరిగితేనే అవి తీవ్రమైనవిగా ఉంటేనే స్పందించేలా జనాలను మీడియా ట్యూన్ చేసింది. హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు ఉన్నాయని, అమ్మాయిలు ఆందోళన చేస్తే ఎవరూ స్పందించలేదు.. ఇలాంటి ఘటనలతో కలత చెంది ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే గాని స్పందించని స్థితికి వచ్చేశాం. వీటన్నింటికి పరిష్కార మార్గం ఆలోచించకపోతే ఆడబిడ్డలు మన దేశంలో మ్యూజియంలో చూసుకునే వాళ్లలా మారిపోతారు.

హత్యాచారం తీవ్రతను బట్టే స్పందిస్తారా?

కోల్‌కతా మెడికో ఘటనపై దేశం స్పందించిన విధానం ఓ ఆశను రేకెత్తించింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దేశమంతా నిరసనలు తెలపడం ఆశను తట్టిలేపితే.. కేవలం ఓ హత్యాచారం జరిగినప్పుడు మాత్రమే స్పందించే విధానం కలిచివేసింది. నిర్భయ ఉదంతం తర్వాత మళ్లీ అదే స్థాయిలో అనేక ఘటనలు చోటు చేసుకునున్నా.. మళ్లీ అదే స్థాయిలో స్పందన వ్యక్తం కాలేదు. మీడియా కొన్నింటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వలన జనాలు కూడా వాటిపై మాత్రమే భావావేశాన్ని ప్రదర్శిస్తున్నారు. దేశంలో నిత్యం వందలాది యువతులు కిడ్నాప్ అవుతున్నారు.. లైంగిక దాడులకు గురి అవుతున్నారు. కేవలం హత్యాచార విషయంలో మాత్రమే సమాజం, జనం ఎందుకు తీవ్ర భావోద్వేగాన్ని వెలిబుచ్చుతున్నారు?

2019-2023 మధ్యలోనే 13.13 లక్షల మంది ఆడపిల్లలు మిస్సయ్యారు. 2022లో 62,099 మంది బాలికలు కిడ్నాప్ అయినట్టు NCRB- (జాతీయ నేర గణంకాల నివేదిక) గణాంకాలే చెబుతున్నాయి. గత మూడేళ్లలో భారతదేశంలో కనిపించకుండా పోయిన ఆడవాళ్ల సంఖ్య 31,000 మంది. వీళ్లలో 2,944 మంది 18 ఏళ్ల వయస్కులే. వీళ్లు ఏమైపోతున్నట్టు..? ఎక్కడికి వెళ్తున్నట్లు..? గణాంకాలతో సహా విషయాలు బయటకు వస్తున్నా.. ఎందుకు ఎవరూ స్పందించడం లేదు..? తీవ్రమైన హత్యాచారం అయితేనే స్పందించే దశకు సమాజం చేరుకోవడం విషాదం.

ప్రపంచీకరణ కారణంగా..

ప్రపంచీకరణకు ద్వారాలు తెరిసినప్పుడే ఈ దుస్థితి దేశంలోకి ఎంట్రీ పాస్ తీసుకున్నది. 90వ దశకంలోనే మానవ సంబంధాలను కత్తిరించింది. దాని దుష్ప్రభావాలు మెల్లగా కనిపిస్తూనే ఉన్నాయి. అదే ఇంట్లో వావి వరసలకు విలువ లేకుండా చేసింది. అందులో భాగమే.. ఓ ప్రవాసనంలా కొనసాగుతోన్న హత్యాచార ఘటనలు. సామాజిక మాధ్యమాల్లో కనిపించే అభ్యంతరకర సన్నివేశాలు, సినిమాల్లో వచ్చే కొన్ని సీన్స్. ఎంత అభ్యంతరకరంగా ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం. వీటిని ప్రపంచీకరణ పరిచయం చేసింది. ప్రపంచీకరణ మానవ సంబంధాలను దెబ్బతీయడమే కాదు.. అమ్మాయిలను అంగడి సరకు చేసేసిందనేది ఓపెన్ సీక్రెట్. స్త్రీ శరీరాన్ని రెచ్చగొట్టే సరకుగా, స్త్రీని ఎంజాయ్ బుల్ ఫ్లెష్‌గా స్థిరపరిచే భావనను ప్రపంచీకరణ తీసుకొచ్చింది.

ఎప్పుడో పదేళ్ల కిందట నిర్భయ ఘటన జరిగినప్పుడు ...దేశమంతా కదిలి ప్రత్యేక చట్టం కోసం డిమాండ్ చేసింది. దాంతోనే నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది.. కానీ, చట్టం అమల్లోకి వచ్చినా హత్యాచారాలకు బ్రేక్ పడిందా? మొన్నటి నిర్భయ నుంచి నిన్నటి అభయ వరకు హత్యాచార ఘటనల పరంపర కొనసాగుతూనే ఉంది. చట్టం కొందరికి చుట్టంలా మారింది. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే ఇవేవీ ఉండవని చెప్పే అమాయక జనం ఇంకా ఉన్నారు.. అలాగే, దారుణ ఘటనలకు పాల్పడిన నిందితుడినీ అక్కడిక్కడే ఎన్‌కౌంటర్ చేస్తే మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృత్తం కావని చెప్పే ఆవేశం స్టార్లూ ఉన్నారు. సత్వర చర్యల పేరిట దూకుడు మాని యావత్ సమాజం హత్యాచారాలపై శాశ్వత పరిష్కారం తీసుకోకపోతే.. ఆడబిడ్డలు మన దేశంలో మ్యూజియంలో చూసుకునే వాళ్లలా మారిపోతారు.

ప్రశాంత్ పగిళ్ల

95812 62429

Advertisement

Next Story