ప్రభుత్వ తీరుతో యువత బేజారు

by Ravi |   ( Updated:2023-11-09 01:16:02.0  )
ప్రభుత్వ తీరుతో యువత బేజారు
X

'నీళ్లు, నిధులు, నియామకాలు’... తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిననటువంటి ముఖ్య కారకాలు. ప్రధానంగా నియామకాల గూర్చి చెప్పుకుంటే, ఎన్నో ఆశలతో, ఆశయాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో యువత ఇప్పటికీ ఉద్యోగాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రంలో ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్’, ‘నియామక బోర్డుల’ పనితీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తీరుగా తయారయ్యింది. ప్రారంభంలో అదర కొట్టిన కమిషన్ నేడు ఊదర కొడుతోంది. ప్రస్తుత ఉద్యోగ అవకాశాల కల్పనలో నత్త నడకకి కోర్టు కేసులే సాక్షం. ఈ తతంగం అంతా ‘పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటంలా’ తయారయ్యింది. యువత ఉద్యోగాల కోసం ప్రయాసలు పడుతుంటే ప్రభుత్వం వారితో చెలగాటం ఆడుతున్నట్లుంది వ్యవహారం.

ఇప్పుడు క్యాలెండర్ హామీనా?

రాష్ట్రం సిద్ధించి దాదాపు పది సంవత్సరాలు గడిచినా, ప్రభుత్వ ఉద్యోగాల-కల్పన విషయంలో మాత్రం ఇంకా వెనుకడుగులోనే ఉంది. ఈ పది సంవత్సరాలలో ఏనాడూ కనిపించని ఉద్యోగాల భర్తీ నిబద్ధత ఇప్పుడు ఎన్నికల సమయంలో క్యాలెండర్ అమలు చేస్తాం, ప్రక్షాళన చేస్తాం అని నిరుద్యోగులను మరోసారి మభ్య పెట్టే ప్రయత్నాలు జరగడం సిగ్గుచేటు. ఇప్పటికైనా 'హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయండి అని హైకోర్టులు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఇంకా అదే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో యువతకు ఉద్యోగావకాశాలు అడవి కాచిన వెన్నెలే. ఇప్పటి వరకు ప్రకటించిన వాటిలో కొన్ని జీవోలు, ఆర్థిక శాఖ ఆమోదం వరకే పరిమితం కాగా మరికొన్ని కోర్టు కేసులతో, ఇంకా పోగా మిగిలిన వాటికోసం ఒకవైపు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, మరొకవైపు ప్రత్యక్ష పద్దతిన ఉద్యోగాల తర్జనభర్జనలతో కాలం గడిచిపోతుంది. మరోవైపు నిరుద్యోగుల వయసు కరిగిపోతోంది. ఉద్యోగాల విషయంలో ఆచరించాల్సిన పద్దతి, ‘ప్రభుత్వ ఆదేశాలు, కమిషన్ నిర్వహణ, కోర్టు కేసులు’’ చాలా సంక్లిష్టంగా తయారయ్యాయి. గ్రూప్-2తో ప్రారంభమైన వాయిదాల పర్వం నేటి గురుకులాల భర్తీ వరకు కొనసాగుతూనే ఉంది. ఇక్కడ తప్పు ఉద్యోగాలను జారీ చేసే ప్రభుత్వానిదా మరీ పరీక్షలను నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డుదా లేదా కోర్టులకు కేసులతో వెళ్తున్న యువతదా ఎవరిదీ తప్పు? ప్రస్తుతం స్పష్టంగా కనిపించేది ‘సమన్వయ లోపం’. ప్రభుత్వం ఆయా ఉద్యోగాలకు అనుసరించాల్సిన నియమ నిబంధనలు, కమిషన్ బోర్డు నిర్వహణ లోపం, ఏమి దిక్కుతోచని పరిస్థితిలో కోర్టులు మాత్రమే న్యాయం చేస్తాయని యువత అపార నమ్మకం, ఇవన్నీ కలిసి ఉద్యోగ అవకాశాలను జఠిలం చేశాయి.

కమిషన్ ప్రక్షాళన అత్యవసరం!

ఒకవైపు ప్రభుత్వ పెద్దలు తమ అలవాటులో భాగంగా త్వరలో కొలువులు అంటూనే యువతకు వాయిదా పద్ధతిలో ఆశలు కల్పిస్తూ, ఇంకోవైపు ‘కాంట్రాక్టు ఉద్యోగుల’ విషయంలో ఏమీ తోచని స్థితిలో వేతనాలను పెంచుతూ అసంబద్ధ క్రమబద్దీకరణతో తన పనిని తాను చేసుకుపోతున్నారు. ఇక ఉద్యోగాల కల్పనలో ఉన్న ప్రతిబంధకాలను గమనిస్తే, జిల్లాస్థాయి ఉద్యోగాలను కొత్త జిల్లాల ఆవిర్భావ సాకుతో, రాష్ట్రస్థాయి ఉద్యోగాలను రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ ఇంకా పూర్తి కాలేదని, జోనల్ వ్యవస్థ రద్దు కావడంతో జోనల్ స్థాయి ఉద్యోగాల భర్తీ కుదరదని ఎప్పటికప్పుడు నిరుద్యోగ యువతను ఇన్ని సంవత్సరాలుగా మభ్య పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉద్యోగాలను కల్పించాలనే దృఢ నిశ్చయం కన్నా వాటికున్న ప్రతిబంధకాలనే ఎక్కువగా చూపించటం జరుగుతోంది.

‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ మొదట్లో ఘనంగా పని చేసిన నేడు నెమ్మదించిందనే చెప్పాలి. ప్రభుత్వం, కమిషన్ మధ్య సమన్వయ లేమి కారణంగా జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలు వాయిదాల పర్వంలో పడుతున్నవి. నియామక మార్గదర్శకాలు, నిబంధనల విషయములో తర్జనభర్జనల మధ్య కమిషన్ పనితీరు గందరగోళంగా తయారయ్యింది. మొదటి దశలొ భాగంగా పరిమిత సంఖ్యలో వచ్చే దరఖాస్తు పరీక్షలను ఆన్ లైన్ లో విజయవంతంగా నిర్వహించినా, భారీ సంఖ్యలో వచ్చే రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి ఉద్యోగాలు అయిన గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పరీక్షల నిర్వాహణలో లోటుపాట్లను ఎదురుకుంటుంది. ప్రశ్న పత్రాల తయారీలో, విడుదల చేసే కీలలొ తప్పులు, నిర్వహణలో లోటుపాట్లు వంటివి కమిషన్ పై నమ్మకాన్ని మసకబారిస్తున్నవి. రానున్న రోజులలో కమిషన్ పని ఇంకా పెరగనున్నది. కావున నిరుద్యోగ యువతలో కమిషన్ పట్ల నమ్మకాన్ని కల్గించాలి. అందుకు కమిషన్ ప్రక్షాళన, నిరంతర ఉద్యోగాల భర్తీ అత్యవసరమైన కార్యాచరణ.

శిక్షణా నైపుణ్యాలను పెంచాలి..

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత స్వప్నం - ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే, కేవలం ప్రతి నెలకు తీసుకునే వేతన ఆదాయం కాదు, అది ఆ ఉద్యోగి పూర్తి కుటుంబానికి ఊతం ఇచ్చే ఆధారం. ఉన్నత చదువులు పూర్తి చేసి కూడా ఉద్యోగం రాక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో ఆధారపడాల్సి వస్తోంది. అస్సలే వ్యవసాయరంగంలో ఒడిదుడుకులు ఉండటంతో ఇది ఇంకాస్తా కష్టంగా తయారయ్యింది. ఇలా ఉపాధి లేని వారికి ఇతర రంగాలలో కావాల్సిన శిక్షణ, నైపుణ్యాలను ఇప్పించి ప్రత్యామ్నాయాలను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూడేండ్ల నాడు లేని సద్బుద్ధి ముప్పదేండ్ల నాడు రాదు అన్నట్లు కాకుండా ఇకనైనా ఉద్యోగాల కల్పన వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ మాధ్యమిక స్థాయిలో మాత్రమే విద్యా విధానం బాగా ఉన్నప్పటికీ దాని కింది ప్రాథమిక స్థాయి, పైన ఉన్నత స్థాయి ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో ఖాళీల కొరత విద్యార్థులను వెక్కిరిస్తున్నాయి. ఒకవైపు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలకై చర్చ జరుగుతుండగా మరొకవైపు వాటిలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాల గూర్చి పట్టించుకునే నాథుడే కరువు అయ్యారు.

ఏం బిడ్డా! తెలంగాణ రాష్ట్రమొస్తే సర్కారీ కొలువు వస్తదన్నావు కదా అని తల్లిదండ్రులు అడిగితే తెల్లమొహం వేసుకోవాల్సిన పరిస్థితి నిరుద్యోగ యువతది. మరీ అటువంటి యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వ బాధ్యత ఎంతైనా ఉంది. ఇక రానున్న రోజులలో కొత్త ప్రభుత్వం శ్రద్ధతో, ప్రణాళికబద్ధంగా, మార్గదర్శకంగా ఉద్యోగ అవకాశాలను కల్పించి యువతను తద్వారా రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

-డా. చాకేటి రాజు

పొలిటికల్ అనలిస్ట్

9625015131

Advertisement

Next Story