యువతా.. తేల్చుకోవాల్సిన తరుణమిదే!

by Ravi |   ( Updated:2023-10-18 01:00:51.0  )
యువతా.. తేల్చుకోవాల్సిన తరుణమిదే!
X

తెలంగాణ రాష్ట్రంలో యువత గోస పడుతున్నది. స్వరాష్ట్రం వస్తే కొలువులకు కొదవుండదని నమ్మి, ఉద్యమం చేసి ఏండ్ల కల నేరవేర్చుకుంటే.. 9 ఏండ్లు గడిచినా కొలువులు వచ్చుడేమో కానీ.. ఉద్యోగాల కోసం ఎదురు చూసి ప్రాణాలు తీసుకుంటున్నరు. అందుకే స్వరాష్ట్రంలో యువత అరిగోస పడుతున్నది. ఇన్నేళ్లూ నోటిఫికేషన్లు లేక ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు గ్రామాల్లో కూలి పనులకు పోయిన ఘటనలెన్నో చూశాం.. తీరా సర్కార్ కొలువుల నోటిఫికేషన్లను నమ్మితే మనోవేదన తప్ప మిగిలిందేమీ లేదనేది ఏ విద్యార్థినడిగినా చెబుతారు. చదువుల పేరుతో పల్లె నుంచి పట్నం బాటపట్టినా.. అప్పులు చేసి కోచింగులు తీసుకుంటున్నా.. ఏళ్లకు ఏళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టినా.. పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో విద్యార్థిలోకంతో పాటు రాష్ట్ర ప్రజలకూ అర్థమైంది. ఉద్యోగాలంటూ ఊదరగొట్టిన సర్కార్.. ప్రశ్నాపత్రాలు లీకేజీలు, ఓఎమ్మార్ షీట్ల లెక్కల్లో తేడాలు.. పరీక్షల నిర్వహణలో లోపాలు.. కోర్టు కేసులు.. పరీక్షల రద్దులు.. వాయిదాలు.. ఇదీ కొలువుల నిర్వహణలో ఏడాదిగా జరుగుతున్న తంతు. చివరికి మొన్నటికి మొన్న జరిగిన ఘటనలు అందరినీ కలిచివేశాయి.. కదిలించాయి.. కానిస్టేబుల్ ఫలితాల్లో ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న బిడ్డల తల్లిదండ్రుల కడుపుకోతను ఏ పాలకుడు తీర్చగలడు? గ్రూప్- 2 రద్దుతో ప్రవళిక అనే విద్యార్థిని ఆత్మహత్య ఉదంతాన్ని.. పాలకుల స్పందనపై యువతరం ఆగ్రహ జ్వాలలనూ చూశాం.. ఏది ఏమైనా ఎన్నికల వేళ రాష్ట్ర యువతకు ఇది తేల్చుకోవాల్సిన తరుణమే.

మాకొద్దు.. ఈ ఉద్యోగాలనే స్థాయికి

నిజంగా ఏ రాష్ట్రంలోనైనా నిరుద్యోగ యువతకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఓ కల్పతరువులాంటిది. కానీ తెలంగాణలో ఎక్కడాలేని ఆరోపణలు ఎదుర్కొంటూ.. తప్పుమీద తప్పు చేస్తూ తీర్చుకోలేని అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఇంకా చెప్పాలంటే ఎన్నో ఏళ్లుగా కొలువుల కోసం ఎదురుచూస్తున్న బిడ్డల ఆశలను సమాధి చేసింది. తమ బిడ్డలు ఉద్యోగం సాధించి అండగా ఉంటారని భావించిన ఎంతో మంది తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేసింది. ఓ భుజం మీద బియ్యం బస్తాలు.. మరో భుజం మీద పుస్తకాల మూటలు పట్టుకుని.. ఉద్యోగం వస్తే తప్ప ఊర్లో కనపడమంటూ సవాల్ చేసిన సరస్వతీ పుత్రుల భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చింది. మరి ఇదంతా బోర్డు నిర్వాకమేనా? ఇందులో పాలకుల జోక్యాన్ని సైతం శంకించాల్సిన అవసరముందంటోంది విద్యార్థిలోకం. ఎన్నో తప్పిదాలు.. మరెన్నో సందేహాస్పద ఘటనలు.. వెరసి టీఎస్‌పీఎస్సీ నిర్ణయాల వల్ల చివరకు విద్యార్థులు ‘మాకీ ఉద్యోగాలు వద్దు బాబూ.. ఈ టెన్షన్ మేం భరించలేం.. మా కుటుంబాలకు సమాధానాలు చెప్పలేం.. మా ముఖం ఊర్లో చూపించుకోలేం..’ అంటూ కొందరు విద్యార్థులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాపురించగా.. మరికొందరు సహచర మిత్రుల వల్ల గుండె నిబ్బరం చేసుకుని ఆశగా బతుకుతున్నారు.

పోయిన ప్రాణాల సంగతేంది?

మొన్న గ్రూప్-2 రద్దుతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి లోకం నినదిస్తుంటే.. కాదు.. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రభుత్వ పెద్దలయితే ఆమె అసలు గ్రూప్-2కి అప్లై చేయలేదంటూ సెలవిచ్చారు. కానీ యువత ఆమె అప్లికేషన్‌ను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన చాలు సర్కార్‌కు యువతపై, నిరుద్యోగులపై ఎంత ప్రేముందో. ఇక ఇటీవల మంత్రి కేటీఆర్ ఓ టీవీ చానెల్లో మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీని సరిదిద్దుతామని.. అవసరమైతే బోర్డును సైతం ప్రక్షాళన చేస్తామంటూ చెప్పుకొచ్చారు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ సైతం ప్రకటిస్తామన్నారు. అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే కదా.. సరే.. ప్రక్షాళన చేయడం అవసరమే.. మరి ఇప్పటి వరకు సర్కార్ కొలువులపై ఆశలు పెట్టుకున్న యువతకు జరిగిన నష్టాన్ని పూడ్చగలరా? సరే వారి భవిష్యత్తుకైనా భరోసా కల్పించగలరా.. ఉద్యోగాలు ఇక మాకు రావని తనువు చాలించిన వారి ప్రాణాలు తీసుకురాగలరా?

నవ్వుల పాలైన ఇంటికో ఉద్యోగం..

ప్రజాస్వామ్యంలో ఏం జరగాలన్నా యువత అనుకుంటేనే.. పోరాటాలు చేయాలన్నా.. ఉద్యమాలు జరగాలన్నా.. చివరకు ప్రభుత్వాలు ఏర్పడాలన్నా.. యువత తలుచుకుంటేనే.. అది ఎవరికైనా తెలిసిందే.. స్వరాష్ట్ర సాధనలో అందరూ చూశారు కూడా.. మరి రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తుంటే పాలకుల చిత్తశుద్ధి ఏమైనట్టు.. యువత ఉద్యోగాల కోసం రోడ్ల మీదికొస్తుంటే ఎందుకు అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు? గత ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నిరుద్యోగ భృతి ఇప్పటివరకు అతీగతి లేకుండా పోయింది. ఇంటికో ఉద్యోగం నవ్వులపాలైంది. మరి చిత్తశుద్ధి ఉండి ఈసారి ఏమైనా పట్టించుకుందా అంటే అదీ లేదు. మొన్న బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోలో అసలు నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదు. జాబ్ క్యాలెండర్ ప్రస్తావన కూడా లేదు. అంటే.. ఈసారి ఎలాగూ యువతలో, నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది కాబట్టి వాళ్లని పట్టించుకోకున్నా పర్వాలేదనా.. లేక వాళ్ల మద్దతు అవసరం లేకుండానే గద్దె మీద కూర్చుంటామనే ధీమానా?

సర్కార్ మారితే తప్ప..

ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే.. మళ్లెప్పుడు పరీక్షలు ఉంటాయో అని.. అసలు ఉంటాయో ఉండవోనని.. పట్నాలకు వెళ్లి చదువుకుంటున్న యువత దిక్కుతోచని పరిస్థితుల్లో ఊళ్లోకి తిరుగు పయనమయ్యారు. హాస్టళ్లు, రూంలు ఖాళీ చేసి మూటాముల్లెతో ఇంటిదారి పట్టారు. అయితే వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. ఊర్లో మొహం ఎట్లా చూపించాలని కొందరు అంటుంటే.. ఇంకొందరేమో ఇంకా ఎప్పటిదాకా చదవాలి అంటూ వాపోతున్నారు. కొందరైతే అప్పులు తెచ్చి చదివినం.. కొలువుల నోటిఫికేషన్ మళ్లెప్పుడొస్తదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వేలాదిమంది విద్యార్థులు మన ఆవేదన ఓటు రూపంలో బయటకు తెలియజెప్పాలని ప్రచారం చేస్తున్నారు. కొందరు విద్యార్థులైతే తేల్చుకోవాల్సిన తరుణమిదే అంటూ ఆగ్రహంగా ఉన్నారు. యూనివర్సిటీ స్టూండెట్స్ అయితే ఏకంగా కేసీఆర్‌పై పోటీ చేసేందుకు వేలాదిగా నామినేషన్లు వేస్తామంటూ ప్రకటించారు. మరికొందరు తామేంటో చూపిస్తాం.. గ్రామాల్లో తిరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామంటూ ప్రతిన బూనుతున్నారు. సర్కార్ మారితే తప్ప కొత్త కొలువులు రావంటూ నినదిస్తున్నారు.

ఎవరొచ్చినా విస్మరించొద్దు..

మరి యువతలో సర్కార్‌పై ఎందుకింత వ్యతిరేకత.. కొలువుల మాటిచ్చి నిలుపుకోకపోవడమే కదా.. నిరుద్యోగులకు అది చేస్తాం.. ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ చెప్పుకొచ్చి తీరా గెలిచాక పట్టించుకోకపోవడంతోనే కదా ఇదంతా.. ఎంత వ్యతిరేకత ఉన్నా ఐదేండ్లు గడిపి ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా కొలువుల ప్రకటనలు.. అందులోనూ భారీ అవినీతి ఆరోపణలు.. పరీక్షల రద్దు.. అందుకే, యువతా.. తేల్చుకోవాల్సిన సమయమిదే. ఇప్పటికైనా ఓటు అనే వజ్రాయుధం మీ చేతిల్లోనే ఉంది. ఈసారి ఏమరపాటునో.. మోసపు మాటలను నమ్మితేనో.. మరో ఐదేళ్లు ఎదురుచూపులే. ఈసారి ఎలాగూ యువత ఓటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఏది ఏమైనా వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే యువతను, నిరుద్యోగులను విస్మరించడం తగదు. ఈసారైనా అవినీతి లేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుతో పాటు.. సరైన జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని యువత, నిరుద్యోగులు కోరుకుంటోంది..

యుగంధర్ దువ్వ

63023 06532

Advertisement

Next Story

Most Viewed