విద్యా కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి!

by Ravi |   ( Updated:2024-10-24 01:00:52.0  )
విద్యా కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి!
X

ప్రాథమిక పాఠశాలలను అనుసంధానం చేస్తూ, పూర్వ ప్రాథమిక విద్యను సార్వత్రికం చేయడం, నాణ్యమైన విద్య ద్వారా పాఠశాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధి , ఉపాధి నైపుణ్యాలు, అప్రెంటిషిప్‌లతో కూడిన ప్రమాణాలతో ఉన్నత విద్య, ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రాథమిక నైపుణ్యాలతో బాధ్యత గల ప్రపంచ పౌరులుగా తయారు చేయడం, విద్యకు సంబంధించిన ఇతర అంశాలను పరిశీలించి, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సూచించే అంశాలతో పాటు, బోధనా పద్ధతులలో, అభ్యసనా సామర్థ్యాల మూల్యాంకనలో వస్తున్న మార్పులను, పర్యవేక్షణలో సాంకేతిక అంశాల వాడకంపై ప్రభుత్వానికి సిఫార్సులు, సూచనలు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని చైర్మన్‌గా నియమించింది. కమిషన్‌లో ఉండాల్సిన ముగ్గురు సభ్యుల నియామకం పూర్తికాకుండానే చైర్మన్ ప్రభుత్వం నిర్దేశించిన అంశాల పరిశీలనకు క్షేత్ర పర్యటనలు చేస్తూ కార్యరంగంలోకి దూకడాన్ని స్వాగతిస్తున్నాం.

క్షేత్రస్థాయిలో పరిస్థితి..

ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యలు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల విద్యా కమిషన్ చైర్మన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో మౌలిక వసతులు, ఆర్థిక వనరులు, పరిశోధన, నిధుల కొరత, మెస్ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్, బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీ, నియామకాలపై విస్తృతంగా చర్చించారు. ప్రైవేటు రంగంలో వైద్య విద్య అందించే కళాశాలలు 28 ఉండగా వాటిలో 50% వరకు అధ్యాపకులు లేరు. 66.31% ట్యూటర్ల కొరత ఉంది. ఇక లెక్చర్ హాళ్లు, పరీక్షా కేంద్రాలు సరిపోను లేవనేది, గ్రంథాలయాల్లో పుస్తకాల కొరత క్షేత్రస్థాయిలో వాస్తవాలు. ఇవన్నీ నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీల్లో బయటపడ్డాయి. అట్లే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కూడా అధ్యాపకుల కొరత ఉంది. అన్ని విశ్వవిద్యాలయాల పరిస్థితి తీసుకోవాల్సిన చర్యలు ఇంచుమించు ఇవే ఉన్నాయి.

నాణ్యమైన విద్య అప్పుడే సాధ్యం!

పాఠశాల విద్యకు సంబంధించిన సమస్యల్లో ఖాళీ పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పనే ప్రధానం కానున్నది. పాఠశాల విద్యను 5+3+3+4 పద్ధతిలో వ్యవస్థీకరించి, పాఠ్యప్రణాళికలను, పాఠశాల విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నూతన జాతీయ విద్యా విధానం మీద రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు చేయాలి. ఏ విద్యా సంస్థ అయినా సరే పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు గాని వాటిలో మౌలిక వసతుల కల్పన, బోధనా సిబ్బంది నియామకాలు ఏటా జరగకుండా విద్యాసంస్థలను నాణ్యమైన విద్యను అందించే విజ్ఞాన కేంద్రాలుగా రూపొందవు. ప్రైవేటు విద్యాసంస్థలు కూడా నిర్దేశించిన నిబంధనల ప్రకారం బోధన జరిగేలా, సౌకర్యాల కల్పన జరిగేలా ప్రభుత్వ నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని ఆచరణాత్మక సూచనలను విద్యా కమిషన్ చేయాలి.

జీడీపీలో విద్య కోటా చాలా తక్కువ!

దేశీయంగా విద్యకు జీడీపీలో ఆరు శాతం నిధులను కేటాయించాలని కొఠారి కమిషన్, జాతీయ విద్యా విధానం సిఫార్సు చేశాయి. కానీ వ్యయం 3.5% లోపే ఉంటుంది. అందులోనూ భవనాల నిర్మాణం వంటి వాటికి అధికంగా ఖర్చు చేస్తూ, విద్యా పరిశోధన ఉపాధ్యాయ శిక్షణ తదితర కీలక అంశాలను విస్మరిస్తున్నారు. కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు బడ్జెట్లో 30% నిధులను విద్యాశాఖకు కేటాయించాలి. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో 7.31% నిధులు మాత్రమే కేటాయిస్తే, విద్యా సంస్థల అవసరాలు తీర్చలేని పరిస్థితి ఉంది. విద్యా కమిషన్ నిధులు పెంచడానికి ఆచరణాత్మక సిఫార్సులు చేసినప్పటికీ, ప్రభుత్వం ప్రాధాన్యతతో నిధులు కేటాయిస్తేనే విద్యా కమిషన్ సూచనలకు సార్థకత కలుగుతుంది. విద్యా కమిషన్ నియామకం ఆరంభ శూరత్వం కాకూడదు.

ఉపాధితో ముడిపడిన విద్య ఆవశ్యం!

రాష్ట్ర జనాభాలో 60 శాతం 35 ఏళ్ల లోపు వయసు వారే! ఆ యువశక్తిని సద్వినియోగం చేసుకునేలా, అన్ని రంగాల్లో తెలంగాణ సమాజం ముందంజ వేసేలా చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య పరిరక్షణ, సెమీకండక్టర్ల తయారీ, హరిత ఇంధనాలు, వ్యర్థాల నిర్వహణ, వ్యవసాయంలో డ్రోన్ సాంకేతికల వినియోగం తదితర రంగాల్లో నిపుణుల కొరత ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కృత్రిమ మేధ, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ, డేటా సైన్స్‌తో పాటు ఆరోగ్య బీమా, చిల్లర విపణి, నిర్మాణ రంగాల్లోనూ భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని అందిపుచ్చుకునేలా మన యువతను తీర్చిదిద్దుకోవడానికి తగిన విధంగా కమిషన్ సిఫార్సులు చేయాలి.

నైపుణ్యాల వృద్ధి కీలకం

ప్రపంచీకరణ యుగంలో ఒక స్పష్టమైన దార్శనికత, అందుకు అవసరమైన కార్యాచరణ లేకుండా విద్యావ్యవస్థను తీర్చిదిద్దడం సాధ్యం కాదు. కాబట్టి విశ్వవిద్యాలయాలను మన సామాజిక అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించేలా, విద్యార్థులకు నైపుణ్యాలు అలవర్చేలా , పాఠ్య ప్రణాళికలను తయారు చేయడంతో పాటు అందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించా లి. ఆర్థిక వనరులతో సంబంధం ఉన్న అంశాలపై చైర్మన్ ప్రభుత్వానికి సూచనలు చేయగలరే కానీ విధాన నిర్ణయం తీసుకోవాల్సింది అంతిమంగా ప్రభుత్వమే! ప్రధానంగా విద్యాశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి. విద్యా కమిషన్ చేయబోయే సిఫార్సులకు చట్టబద్ధత వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే మన విద్యారంగాన్ని మేలిమి విద్య అందించే విజ్ఞాన కేంద్రాలుగా మార్చగలుగుతాం.

కె. వేణుగోపాల్,

పూర్వ అధ్యక్షులు, ఏపిటిఎఫ్,

98665 14577

Advertisement

Next Story