ఉన్నది ఉన్నట్టు:ధరల పాలిటిక్స్

by Viswanth |   ( Updated:2022-09-03 17:26:35.0  )
ఉన్నది ఉన్నట్టు:ధరల పాలిటిక్స్
X

తీసుకునే నిర్ణయాలు ఓట్లు రాలుస్తాయనుకుంటే ప్రభుత్వాలు ఎంతకైనా సిద్ధమవుతాయి. పెట్రోలుపైన రూ. 50 పెంచి రూ. 8 తగ్గించి 'చాలా మేలు చేశాం' అని కేంద్రం గొప్పలు చెప్పుకుంటున్నది. సంక్షేమానికే ఖర్చు చేస్తున్నామంటూ చిలక పలుకులు పలుకుతున్నది. అదే నిజమైతే సామాన్యుల బతుకులు ఎందుకు మారలేదో, పెట్టుబడిదారులు మిలియనీర్ల నుంచి బిలియనీర్లుగా ఎలా ఎదిగారో వివరించాల్సి ఉంటుంది. ఆటో ఎక్కడానికి సరిపోయేంత డబ్బులు లేక సామాన్యులు సిటీ బస్సును ఎంచుకుంటున్నారు. ప్రజల పన్నుతో బతుకుతున్న పాలకులు మాత్రం స్పెషల్ ఫ్లైట్‌లలో తిరుగుతున్నారు. అధికారిక పర్యటనల పేరుతో హెలికాప్టర్లను వాడేస్తున్నారు. పంచభక్ష్య పరామాన్నాలతో విలాసవంతంగా బతుకుతున్నారు. ఢిల్లీ, దావోస్ లాంటి టూర్లకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. సంపద ప్రజలది. సుఖం పాలకులది.

దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో పెరిగిపోయాయి. సామాన్యుల బతుకు భారంగా మారింది. పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో జీవన పోరాటం చేస్తూ ఉంటే, సంపన్నులు మాత్రం 'విలాసాలకు ఎక్కడా తగ్గేదే లేదు' అనే తీరులో ప్రశాంతంగా ఉన్నారు. సామాన్యుల నడ్డి విరిచి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం మాఫీ చేస్తున్నాయి. అనేక రాయితీలు కల్పిస్తున్నాయి.అల్పాదాయ వర్గాల బతుకు అగమ్యగోచరంగా తయారైంది.

ఇటీవలి కాలం వరకు కరోనా విపత్తును కారణంగా చూపిన వ్యాపారవర్గాలు, ప్రభుత్వాలు ఆ తర్వాత ఉక్రెయిన్ యుద్ధం మీదకు నెట్టాయి. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరల పెంపును ప్రస్తావిస్తున్నాయి. ధరల పెరుగుదలకు నువ్వంటే నువ్వు, అంటూ కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆరోపించుకుంటున్నాయి. చివరకు ఇది 'పొలిటికల్ బ్లేమ్ గేమ్‌'గా మారిపోయింది. ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. ఎగుమతి, దిగుమతుల విషయంలో మొక్కుబడి నిర్ణయాలు తీసుకుంటూ తాత్కాలిక ఉపశమనం కలిగించినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నది.

ఇబ్బందులు పడేది వారే

బియ్యం, గోధుమలు, పిండి, కూరగాయలు, వంటనూనెలు, నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్, ఇలా అన్ని ధరలూ పెరిగాయి. కోడిగుడ్లు, చికెన్, మటన్ సంగతి సరేసరి. చివరకు వేసవిలో ఉపశమనం ఇస్తుందనుకునే నిమ్మకాయల ధర కూడా పెరిగిపోయింది. ధరలు పెరిగినప్పుడు ఎక్కువగా ఇబ్బందులు పడేది పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలే. వేతన జీవులకు ప్రభుత్వాలు ఠంచనుగా ఒకటో తేదీ జీతం వస్తుందని, కష్టకాలంలో కరువుభత్యం కింద ఎంతో కొంత రిలీఫ్ ఉంటుందనే అభిప్రాయాలు ప్రజలలో ఉండేవి. కానీ, ఇప్పుడు వారి పరిస్థితీ గందరగోళంలోనే ఉన్నది.

బ్యాంకు ఖాతాలో జీతం పడేంతవరకు ఎదురుచూపులే. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి చిరుద్యోగులు వీధులలో పడ్డారు. స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకున్నారు. చిరు వ్యాపారులు అప్పులలో కూరుకుపోయారు. చిన్న పరిశ్రమలు సంక్షోభంలో పడిపోయాయి. చివరకు చేద్దామంటే ఉద్యోగం లేక పల్లెబాట పట్టి ఉపాధిహామీ పనులపై ఆధారపడ్డారు. లక్షలాది కుటుంబాలు అప్పుల పాలయ్యాయి. కరోనా సంక్షోభం సమసిపోయినా ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయాయి. వ్యవసాయానికి ఢోకా లేకపోయినా పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు పెరిగాయి. నిరుద్యోగం ప్రబలి పెరిగిపోయి సైబర్ నేరాలు, మోసాలు ఎక్కువయ్యాయి.

ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు

పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో దాని ప్రభావం అన్ని రంగాల మీద పడింది. ధరల తగ్గింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరిగినందునే ఇక్కడ కూడా పెంచక తప్పలేదని కేంద్ర సర్కారు నమ్మబలుకుతున్నది. అది శాస్త్రీయ కారణమే కావచ్చుగానీ, ముడిచమురు ధరలు తగ్గినప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదనే ప్రశ్నలకు కేంద్ర పెద్దల నుంచి సమాధానం లేదు. నిజానికి మోడీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో క్రూడాయిల్ బ్యారెల్ ధర 104-108 డాలర్ల మధ్యలో ఉన్నది. అప్పుడు పెట్రోలు మన దగ్గర రూ. 71.41గా, డీజిల్ ధర రూ. 55.49గా ఉన్నది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్దం వచ్చిన తర్వాత కూడా బ్యారెల్ ధర సుమారు వంద డాలర్లకు కాస్త అటూ ఇటుగానే ఉన్నది. కానీ పెట్రోలు, డీజిల్ ధరలు మాత్రం రూ. 120, రూ. 105 దరిదాపులలో ఉన్నాయి.

ముడిచమురు ధరలే కారణమని అనుకుంటే కరోనా సంక్షోభ సమయంలో బ్యారెల్ ధర 32 డాలర్లకు పడిపోతే పెట్రోలు, డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదనే సందేహం సహజం. మోడీ ప్రభుత్వం ఏర్పడే నాటికి పెట్రోలు మీద సెంట్రల్ ఎక్సయిజ్ పన్ను రూపంలో కేంద్రం వసూలు చేస్తున్నది రూ. 9.48 మాత్రమే. డీజిల్ మీద ఇది రూ. 3.56గా ఉన్నది. ఈ ఎనిమిదేళ్ళలో రూ. 32.90, రూ. 31.80కు పెరిగింది. ఈ కారణంగా వీటి ధరలు అమాంతంగా పెరిగాయి. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో రేట్లు పెంచితే ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే భయంతో సైలెంట్‌గా ఉన్న కేంద్ర సర్కారు ఇప్పుడు ఎడాపెడా పెంచేసింది.

తలకు మించిన భారం

దీంతో సరుకు రవాణా మొదలు క్యాబ్, ఆటో, బైక్ ప్రయాణాలకు ఖర్చు పెరిగింది. అది నెలవారీ బడ్జెట్ సహా కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమైంది. నష్టం వస్తున్నదనే కారణంగా ప్రభుత్వాలు మరో రూపంలో పన్నులు వసూలు చేసుకుని బ్యాలెన్సు చేసుకుంటున్నాయి. ఉత్పత్తి, సేవా రంగానికి చెందిన సంస్థల మొదలు వ్యాపారుల వరకు ఇదే ఫార్ములాను అమలు చేశాయి. కానీ, చిట్టచివరి వినియోగదారుగా ఉన్న సామాన్య ప్రజానీకానికి మాత్రం వీటిని మోయడం తప్ప భారాన్ని దించుకునే మార్గం లేకపోయింది.

'గొర్రె తోక బెత్తెడు' తరహాలో అంతంత మాత్రపు ఆదాయంతోనే నెట్టుకురావాల్సి వస్తున్నది. పిల్లల చదువులు రోజురోజుకూ భారమవుతున్న పరిస్థితులలో ఇప్పుడు కరోనా, ఉక్రెయిన్ యుద్ధం, పెట్రో ధరల పెంపుతో మరింత పెరిగింది. అడ్మిషన్, డొనేషన్, ఫీజులు, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారం, స్కూల్ బస్ కిరాయి, ఇలా అన్నీ తడిసి మోపెడవుతున్నాయి. కరెంటు చార్జీలు, మోటార్ వెహికల్ పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, యూజర్ చార్జీలు, మద్యం ధరల పెంపు, ఇలా అనేక రూపాలలో ప్రభుత్వాలు ఆదాయ మార్గాలను వెతుక్కున్నాయి. ఒకవైపు సంక్షేమ పథకాలకు భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి తగిన ఆర్థిక వనరులను ఇలా సమకూర్చుకుంటున్నాయి. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో ఆదాయం ఆర్జిస్తున్నాయి. కానీ, ప్రజలకు అలాంటి అవకాశం లేకపోవడంతో భరించే పాత్రను పోషించక తప్పలేదు.

పరస్పర నిందారోపణలు

పెట్రోలు, డీజిల్ ధరలపై రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల మధ్య బ్లేమ్ గేమ్ వికృతరూపం తీసుకున్నది. ఎనిమిదేండ్ల కాలంలో దాదాపు డబుల్ రేటు స్థాయికి చేరుకుంటున్నది. ప్రజలలో వచ్చే వ్యతిరేకతను పసిగట్టి కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ పన్నును తగ్గించింది. రాష్ట్రాలూ ఇదే తరహాలో వ్యాట్‌ను తగ్గించి ప్రజలకు రిలీఫ్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉచిత సలహా ఇచ్చింది. చాలా రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. కొండంత పెంచి గోరంత తగ్గించి రాష్ట్రాలపై ఒత్తిడి తేవడమేంటని నిలదీశాయి.కేంద్ర ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్లలో నాలుగు రెట్ల మేర పెట్రోలు, డీజిల్‌పై పన్నులను పెంచి దాదాపు ఒక ఏడాది బడ్జెట్‌కు సమంగా ఆదాయాన్ని ఆర్జించిందని అంచనా. కేంద్రం, రాష్ట్రాలు బ్లేమ్ గేమ్‌కు పాల్పడుతున్నాయి.

ధరలను నియంత్రించడానికి, సామాన్యులకు అందుబాటులోకి తేవడానికి మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. ఆర్థికవేత్తలు వల్లెవేసే జీడీపీ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం లాంటి పదాలు సామాన్యులకు అర్థమయ్యేవి కావు. వారికి కావాల్సిందల్లా కుటుంబానికి అవసరమైన వస్తువులను కొనగలిగే పరిస్థితి ఉందా లేదా అనేదే. పండిస్తున్న రైతుకు మద్దతు ధర దొరకడంలేదు. కొనే వినియోగదారుడికి ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఈ మధ్యలో జరిగే వ్యవహారంలో లాభపడుతున్నది పన్నుల రూపంలో వసూలు చేసే ప్రభుత్వాలు, కృత్రిమ కొరత సృష్టించే దళారులు, ప్రాసెసింగ్ చేసి అమ్ముకునే బడా వ్యాపారులు. వీరి లాభాలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. ప్రజల అప్పులు వడ్డీతో సహా కట్టలేనంతగా పేరుకుపోతున్నాయి.

కష్టం వీరిది, సుఖం వారిది

అందుకే కరోనా టైమ్‌లో కోట్లాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతే పెట్టుబడిదారుల సంపద లెక్కలకు అందనంతగా పెరిగిపోయింది. రేపటి బతుకు కోసం సామాన్యుడు జీవన్మరణ పోరాటం చేస్తూ ఉంటే మరింత సంపనను పోగేసుకోడానికి, మార్కెట్‌ను చేజిక్కించుకోడానికి, కొత్త యూనిట్లను స్థాపించడానికి తహతహలాడుతున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పెట్టుబడుల కోసం వెంపర్లాడుతున్న పరిస్థితే ఇందుకు నిదర్శనం. పార్టీలకు, ప్రభుత్వాలకు ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు. వారి దృష్టంతా ఓటు బ్యాంకుపైనే. తీసుకునే నిర్ణయాలు ఓట్లు రాలుస్తాయనుకుంటే ప్రభుత్వాలు ఎంతకైనా సిద్ధమవుతాయి. పెట్రోలుపైన రూ. 50 పెంచి రూ. 8 తగ్గించి 'చాలా మేలు చేశాం' అని కేంద్రం గొప్పలు చెప్పుకుంటున్నది.

సంక్షేమానికే ఖర్చు చేస్తున్నామంటూ చిలక పలుకులు పలుకుతున్నది. అదే నిజమైతే సామాన్యుల బతుకులు ఎందుకు మారలేదో, పెట్టుబడిదారులు మిలియనీర్ల నుంచి బిలియనీర్లుగా ఎలా ఎదిగారో వివరించాల్సి ఉంటుంది. ఆటో ఎక్కడానికి సరిపోయేంత డబ్బులు లేక సామాన్యులు సిటీ బస్సును ఎంచుకుంటున్నారు. ప్రజల పన్నుతో బతుకుతున్న పాలకులు మాత్రం స్పెషల్ ఫ్లైట్‌లలో తిరుగుతున్నారు. అధికారిక పర్యటనల పేరుతో హెలికాప్టర్లను వాడేస్తున్నారు. పంచభక్ష్య పరామాన్నాలతో విలాసవంతంగా బతుకుతున్నారు. ఢిల్లీ, దావోస్ లాంటి టూర్లకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. సంపద ప్రజలది. సుఖం పాలకులది.

ఎన్. విశ్వనాథ్

99714 82403

Advertisement

Next Story

Most Viewed