విడిగా విపక్షాలు బీజేపీని కొట్టలేవు!

by Vinod kumar |   ( Updated:2023-05-01 23:46:03.0  )
విడిగా విపక్షాలు బీజేపీని కొట్టలేవు!
X

కాన్పు ఎప్పుడో తెలీదు, దేశంలో విపక్ష ఐక్యతకు పురుటినొప్పులొస్తున్నాయి. కేంద్రంలో ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం పోయి, రాజ్యాంగ భద్రత, దేశ రక్షణకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలనే నినాదం బలపడుతోంది. ప్రస్తుత అనైక్యతా పరిస్థితి ఇలాగే కొనసాగితే.. విపక్షాల రాజకీయ మనుగడ ప్రమాదమని పార్టీలు ఒకటొకటిగా గ్రహిస్తున్నట్టుంది. అందుకే.. నదులన్నీ సముద్రం వైపు సాగే తరహాలో ఐక్యతాయత్నాలు ఒక కేంద్రకం వైపు బలపడుతున్నాయి. అది ఓ కొలిక్కి రావటమన్నది కొన్ని పరిస్థితులు, పరిణామాలు, ఫలితాలపై ఆధారపడనుంది. కాంగ్రెస్‌ సామర్థ్యం కూడా ఇందులో ఓ అంశమే! విపక్ష ఐక్యత కుదిరితే, వ్యక్తులతో పనిలేదు! ఈ లోపున కొందరు నాయకుల వ్యక్తిగత ప్రవర్తన, సామరస్య దోరణి కీలకం కానున్నాయి. ఐక్యంగా తప్ప విడివిడిగా విపక్షాలు పాలక ఎన్డీయే కూటమిని 2024లో ఓడించలేవనే రాజకీయచిత్రం మాత్రం సుస్పష్టం.

ఈ పురిటి నొప్పులు ఫలించేనా..?

ఎన్నికల గొలుసుకట్టు పరిణామాలు దేశ రాజకీయాలను బలంగా ప్రభావితం చేయనున్నాయి.మరో పక్షం రోజుల్లో తేలనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆరు మాసాల్లో జరుగనున్న అరడజన్‌ రాష్ట్రాల ఎన్నికలపైన ఉంటుంది. ఆ ఫలితాల ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికలపైన పడనుంది. వైభవోజ్వలమైన సుదీర్ఘ చరిత్ర కలిగి, ఇప్పుడేమో గుడ్డి దీపంగా మారిన కాంగ్రెస్‌ పునర్వికాసంతో కూడా ఇది ముడివడి ఉంది. కాంగ్రెస్‌ ఎంతో కొంత పుంజుకుంటే ఒక రకంగా, లేదంటే మరో రకంగా పరిణామాలు మారొచ్చు. ఈ లోపున మార్పులు, కాంగ్రెస్‌కు కాసింత అనుకూలంగానే జరుగుతున్నాయి. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ కేంద్రకంగా సాగుతున్న విపక్ష ఐక్యతా యత్నాలు ఆ పార్టీకొక కొత్త ఊపిరి.


కాంగ్రెస్‌-ప్రాంతీయ పార్టీల మధ్య సయోధ్యకు ఆస్కారం పెరిగింది. రేపు విపక్ష కూటమి గెలిస్తే ప్రధాని ఎవరన్న సందేహాన్ని కాసేపు పక్కన పెట్టి, ప్రభావం కలిగిన ప్రతిపక్షాలు ఇచ్చిపుచ్చుకునే దోరణితో వ్యవహరిస్తే.. విపక్ష ఐక్యత సాధ్యమేనన్న అభిప్రాయం బలపడుతోంది. బీజేపీ-కాంగ్రెస్‌కు తాము సమదూరం అన్న వాళ్లు కూడా మనసు మార్చుకొని ఒకింత మెత్తబడ్డట్టు కనిపిస్తోంది. కర్ణాటక ఫలితాల తర్వాత కొంత, కాంగ్రెస్‌ ఓ శక్తిగా ఉన్న రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తిస్‌ఘడ్‌, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఏడాది చివర్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత.. రాజకీయ చిత్రం స్పష్టం కానుంది.

అవరోధం.. సిద్దాంత వైరుధ్యం కాదు..

ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన బీజేపీ (18 కోట్ల సభ్యత్వాలు) కిందటి ఎన్నికల్లో 37.4 శాతం ఓట్లు పొంది కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు లభించిన ఓట్లు 19.5 శాతం. సమాఖ్య భారతంలోని వివిధ రాష్ట్రాల్లో పాలకపక్షాలైన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో సయోధ్యకు ‘నో’ అనటం ఐక్యత కుదరకపోడానికి ఓ కారణం. ఆయా రాష్ట్రాల్లో అవి కాంగ్రెస్‌తో తలపడుతున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్‌ బాగా బలహీనపడటం వల్ల, నిజానికి ఆ పరిస్థితేం లేదు. మమతా బెనర్జీ (బెంగాల్‌), అఖిలేష్‌ యాదవ్‌ (యూపీ), కె. చంద్రశేఖరరావు (తెలంగాణ), అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఢిల్లీ) ఇటీవలి కాలం వరకు బీజేపీ-కాంగ్రెస్‌కు ‘సమదూర’ వాదనతో ఉన్నా... ఇప్పుడు కొంత మెత్తబడ్డట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనాయకులతో భేటీ తర్వాత మమత, అఖిలేశ్‌లతో విడివిడిగా సమావేశమై నితీశ్‌, తేజస్వీ యాదవ్‌లు సయోధ్య చర్యలు చేపట్టాక, విపక్ష ఐక్యత సాధ్యమే అన్నట్టు వారు మాట్లాడుతున్నారు.

వాస్తవానికి విపక్షపార్టీల మధ్య సిద్దాంత వైరుధ్యాలేవీ ఐక్యతకు అడ్డురావటం లేదు. కానీ, కొందరు నాయకుల వ్యక్తిగత పదవి పేరాశ, ‘ఈగో’లు, రాజకీయ వైరాలు, వారి వారి అనివార్యతలు అడ్డొస్తున్నాయి. 2021లో ప్రతికూలతల నడుమ బెంగాల్లో విజయం తర్వాత, బీజేపికి తానే ప్రత్యామ్నాయం అని మమత భావిస్తూ వచ్చారు. ఒకదశలో తమది ఒంటరి పోరే అని ప్రకటించారు. అవినీతి పాలన కార్డుతో తెరపైకి వచ్చి ఢిల్లీ బయట (పంజాబ్‌) కూ విస్తరించిన ‘ఆప్‌’ దేశ రాజకీయాల్లో తామే ప్రత్యామ్నాయం అనుకుంటున్న తరుణంలో.. సొంత మంత్రులు అవినీతి కేసుల్లోనే ఇరుక్కోవడం వారిని వెనుకంజలోకి నెట్టింది. కాంగ్రెస్‌-బీజేపీల వరుస వైఫల్యాల వల్ల దేశంలో రాజకీయ శూన్యత ఉంది, మేం ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలమని టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌ చేసిన కేసీఆర్‌ ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అన్నారు.

కానీ, ఒక అవకాశంగా వచ్చిన కర్ణాటకలో బీఆర్‌ఎస్‌ పోటీకి దిగకపోవడం సందేహాలకు తావిచ్చింది. వీరిలోనూ మార్పు కనిపిస్తోంది. రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు తర్వాత ఆయా పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పోరుకు కొంత సానుకూలంగా మారినట్టు కనిపిస్తోంది. తనకు జాతీయ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని నవీన్‌ పట్నాయక్‌ (ఒడిశా) కుండబద్దలు కొట్టారు. జమ్మూకాశ్మీర్‌ మాజీ సీఎం, పీడీఎప్‌ నేత మెహబూబా ముఫ్తీ మాత్రం కాంగ్రెస్‌ కేంద్రకంగానే విపక్ష ఐక్యత కుదరాలంటున్నారు.

రాజకీయేతర శక్తులేవీ..?

కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే ఉద్యమించే పౌరసమాజం ఇప్పుడేమైందనే ప్రశ్న తరచూ తెరపైకి వస్తోంది. ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికలప్పుడు ఓ జయప్రకాశ్‌ నారాయణో, 2014 ఎన్నికలకు ముందు ఓ అన్నాహజారేనో, 1994 ఏపీ ఎన్నికలప్పుడు సారా వ్యతిరేకోద్యమమంటూ ఓ వావిలాల గోపాల కృష్ణయ్యో, మల్లాది సుబ్బమ్మనో ఉద్యమాలు నడిపారు. ప్రజాందోళనలతో ప్రభుత్వ వ్యతిరేకతను వారు బలోపేతం చేస్తే, అది విపక్ష ఖాతాలో పడి ఎన్నికల్లో ఫలించేది. కాంగ్రెస్‌ పాలనలో సామాజిక పోరాటాలకు, ఉద్యమాలకున్న వెసులుబాటు వల్ల అలాంటిది సాధ్యమయేది. ఇప్పుడే ఉద్యమాలూ లేవు! ‘అచ్చేదిన్‌’ నుంచి పదేళ్ల ప్రస్థానం ‘అమృత్‌ కాల్‌’లో మొగ్గతొడుగుతుంది తప్ప.. ప్రజా సమస్యలపై ఉద్యమించే శక్తులు లేకుండా పోయాయి. 1977లో విపక్షాలన్నీ కలిసినపుడు కూడా వాటి మధ్య సిద్దాంత వైరుధ్యాలున్నాయి.

ఇందిరాగాంధీ అత్యంత శక్తివంతురాలిగా ఉండటం, సర్కారు నాటి అప్రజాస్వామిక పంథా, విపక్షాలు తమ మనుగడ సంక్షోభంలో పడిందని బలంగా నమ్మడం.. వారిని కలిపాయి. 1971 గ్రాండ్‌ అలయెన్స్‌ 450కి పైగా స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థుల్ని నిలిపింది. అయినా వారివి వేర్వేరు గుర్తులు అవటం వల్ల కూటమి విఫలమైంది. అదే నొక్కిచెప్పి, జేపీ 1977లో అందర్నీ ఉమ్మడి (రైతునాగలి) గుర్తుపై పోటీ చేయించి గెలుపు దక్కించారు.

ఇప్పుడూ అలా కలువకపోతే, బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోతుందనే భయం కూడా విపక్షాల్లో ఉంది. 90 శాతం పైన ఈడీ కేసులు విపక్షాల వారిపైనే అనే స్పృహ వారి మెదళ్లను మెలిపెడుతోంది. గుర్తు ఒకటి కాకపోయినా.. విపక్షాల నుంచి ఒకే (ఉమ్మడి) అభ్యర్థి ఉండేలా చూసుకోవాలనే వాదన బలపడుతోంది ఇప్పటిదాకా విపక్షాలకు ఒక నాయకుడు లేడు. సమైక్య కార్యక్రమం లేదు, ఉమ్మడి అభ్యర్థీ లేడు. అలా పోటీ చేస్తే విపక్షాలకు 300-305 స్థానాలు లభించి, బీజేపీ కూటమి 235 నుంచి 240కి తగ్గిపోయే ఆస్కారం ఉందనేది ఒక పరిశీలన! ‘ప్రతిపక్ష సమైక్యతా వేదిక’ (ఓయూపీ) అంటూ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం ఇటీవల ఓ ఆలోచన పంచుకున్నారు.

దేశం మొత్తాన్ని నాలుగు జోన్లుగా విడగొట్టి, ఎక్కడ ఎవరికి ప్రాబల్యం ఉంటే, వారి మాట చెల్లుబాటయ్యేట్లు సీట్ల పంపకాలతో ఉమ్మడి విపక్ష అభ్యర్థులుండాలన్నారు. కాంగ్రెస్‌ ఆధిపత్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (209 సీట్లు), కాంగ్రేసేతర...(225), బీజేపీ మిత్రపక్షాల.. (53), నిర్దిష్టంగా ఎవరికీ ఆధిపత్యం లేని.. (56) స్థానాల్లో బీజీపీ అభ్యర్థులపై ఒంటరి పోటీదారులని దింపడం ద్వారా విపక్ష విజయం సాధ్యమన్నది ఆయన ప్రతిపాదన. కొంచెం అటిటుగా ఇది సాధ్యమే!

నిజాయితీపరుడే కానీ..

కాంగ్రెస్‌ కేంద్రకంగా విపక్ష ఐక్యతకు బిహార్‌ సీఎం నితీశ్‌ శ్రమిస్తున్నారు. ‘నాకు ప్రధాని పదవిపై వ్యామోహం లేదు, విపక్షాల ఐక్యతే నా లక్ష్యం’ అంటున్నారే గానీ, రాజకీయంగా అంత నమ్మదగ్గ నేత కాదు. బీజేపీతో, బీజేపీకి వ్యతిరేకంగా వెంటవెంటనే ప్రభుత్వాలు ఏర్పరచి, సీఎంగా వెలగబెట్టిన ఆయన నిర్వాకాలే ఇందుకు నిదర్శనం. మిత్రపక్షంగా బీజేపీ నాయకులకు విందు ఏర్పాటు చేసి, దానికి నాటి గుజరాత్‌ సీఎం నరేంద్రమోదీ రావద్దని షరతు పెట్టిన వాడు. ‘పిలవడం వరకే తప్ప ఎవరు రావాలో, రాకూడదో ఆయనెవరు చెప్పడానిక’న్న బీజేపీ నేతల అభ్యంతరాలతో అసలా డిన్నరే జరుగలేదు.

తర్వాత ఎంచక్కా బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని, దానికి వ్యతిరేకంగా ఆర్జేడీ మద్దతుతో ప్రస్తుత ప్రభుత్వాన్ని నడపడం, ఆయన నిలకడలేని అవకాశవాదాన్ని ఎత్తిచూపేదే! కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పాట్నాలో విపక్షాల ఓ పెద్ద భేటీ అంటున్నారు. అక్కడ ఎంత సయోధ్య కుదురుతుందో చూడాలి. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కొన్ని పార్టీలు, కొందరు ముఖ్యమంత్రులు భయపడుతున్నారు. భయపడే వారిని, దైర్యంగా ఎదుర్కొనే వారిని ప్రజలెట్లా చూస్తారన్నదాన్ని బట్టి విపక్షాల ఐక్యత నిలబడటం, నీరుగారటం ఆధారపడొచ్చు.. కానీ, జనం ఎలా స్పందిస్తారనేది కాలమే నిర్ణయించాలి.

-దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

[email protected],

9949099802




Advertisement

Next Story