ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువయ్యే..

by Ravi |   ( Updated:2023-12-05 00:15:42.0  )
ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువయ్యే..
X

రోజులెప్పుడు ఒకేలా వున్నా స్థితిగతులు మారుతుంటాయి అన్నట్టు… అనేకానేక ఆసక్తికర నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు ఎన్నికల తంతు ముగిసింది. గతంలో కంటే ఈసారి ఎన్నికల సంఘం ఆచి తూచి వ్యవహరిస్తూ, సాధ్యమైనంత వరకు పారదర్శకంగా నిర్వహించడానికి కృషి చేసింది. అయితే రాజకీయంగా చూసుకుంటే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇంకా డబ్బుల ప్రవాహం, ఉచితాల ప్రలోభాలు, సాధ్యం కాని హామీల పరంపర, ఎటుతిరిగి గెలవాలనే తపన తప్ప దేనికోసం అనేదానికి స్పష్టత లేనట్టుగా అదే వ్యాపార ధోరణి… ఎంత కట్టడి చేసినా ఆగలేదు అన్నది నిర్వివాదాంశం. ఇది ప్రజాస్వామ్య వైఖరికి చేటు తెచ్చే అంశం.

ప్రత్యామ్నాయం దొరకగానే...

ఇకపోతే అధికార పక్షానికి ప్రత్యామ్నాయంగా మరో పార్టీలు ఏవీ గడచిన పదేళ్లలో దీటుగా పుంజుకోకపోవడం, కొత్తవి పోటీ చేసే స్థాయికి ఎదగక పోవడం వల్ల ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత కారణంగా తప్పనిసరై మాత్రమే కాంగ్రెస్‌కు ప్రజలు మొగ్గు చూపాల్సి వచ్చింది తప్ప వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కానీ డిక్లరేషన్లు కానీ నమ్మి ఓటు వేయలేదు అనే అనుకోవాలి. ఇక కమలం అభిమానులు మాత్రం బీఆర్ఎస్ కోసం కృషి చేసారు కాంగ్రెస్ రావొద్దు ఏదైనా పర్లేదు అన్న ధోరణిలో... పైకి మాత్రం శత్రువుల్లా లోపాయకారి ఒప్పందాలతో పోటీ చేయాల్సి రావడం అన్న విమర్శలు ఒక కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉన్న బీజేపీ లాంటి జాతీయ స్థాయి పార్టీలకు అవసరమా అనిపిస్తుంది.

ప్రజలను చైతన్యపరిచి..

ఇక ఎగ్జిట్ పోల్స్ బట్టి అప్పుడే అంతా అయిపోయినట్టు కలలు కనడం, తేల్చేయడం కాకుండా భవిష్య కార్యాచరణ వైపు పార్టీలు అడుగు వేయడం మంచిది. అయితే ఈసారి ఎన్నికల్లో యువత ప్రత్యేక శ్రద్ధ వహించడం శుభ పరిణామంగా భావించాలి మనం, ముఖ్యంగా యూట్యూబ్ చానెల్స్, ఇతర సోషల్ మీడియా ద్వారా యువత - ప్రజల్ని చైతన్య పరచడంలో ఇంతకు ముందు కంటే చాలావరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి, ముఖ్యంగా కొల్లాపూర్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒక నిరుపేద, దళిత యువతి కర్నెశిరీష (బర్రెలక్క) బరిలో దిగడం - విశేష స్పందన రావడం అభినందించ తగ్గ విషయం. అంతే గాకుండా నిరుద్యోగ సమస్య తీవ్రతను తన మాటల్లో ప్రజలకు చేరవేయడంలో విజయం సాధించడం చాలా గొప్ప విషయం, ఈనాటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం, నేటి ప్రజాస్వామ్య తీరు తెన్నులకు ఎంతైనా అవసరం. యువత తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనే సందేశం ఇప్పటికే తలలు పండిన రాజకీయాలకు అర్థం అయ్యేలా చేయడంలో యువత విజయం సాధించింది అనే అనుకోవాలి. అయినా ఇంకా ఎంతో మార్పు రావాల్సిన అవసరం ఉంది.

ప్రొఫెసర్ కోదండరాం, నాగేశ్వర్ సార్ లాంటి వారి సేవలు రానున్న ప్రభుత్వానికి ఎంతైనా అవసరం అంతేగాకుండా ప్రభుత్వ వ్యతిరేతను ప్రజలకు చూపించిన యూట్యూబ్ ఛానెళ్ల వారు క్రియాశీల రాజకీయాల్లో పోటీ చేసి రాణించి పదవులతో ప్రభుత్వంలో భాగం కావాల్సిన అవసరం చాలా ఉంది. ధన రాజకీయాలకు స్వస్తి చెప్పి నిజమైన ప్రజాసేవకు బాట వేయాలని బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకుందామని ఆశిస్తూ విజేతలకు, పోరాడిన యోధులకు, యువతకు అభినందనలతో జై తెలంగాణ ...!!

-న్యాలకంటి నారాయణ

95508 33490

Advertisement

Next Story

Most Viewed