- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manipur: ప్రజాస్వామ్య వ్యవస్థకే.. మాయని మచ్చ!
మణిపూర్‌లో పరిపాలన చేతకాక, శాంతి భద్రతలు నశిస్తుంటే, గత రెండు నెలలుగా బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వహించి నీచ రాజకీయం చేస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోలు.. అసాంఘిక శక్తుల దురాఘతాలు స్పష్టంగా చూపుతున్నాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులు, పారామిలటరీ దళాలు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నాయి.
మణిపూర్‌లో స్త్రీల మానాలకు, పురుషుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మణిపూర్‌లో మానవత్వం మంటకలిసింది. పశు ప్రవర్తన పెరిగింది. మైనార్టీలకు మన దేశంలో రక్షణ లేదని ఈ వీడియోలు ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతున్నాయి. ఒక్క బీజేపీ పాలనలో తప్పా గతంలో ఎన్నడూ మన దేశ ప్రతిష్ట ఇంతగా దిగజారలేదు. మణిపూర్‌ని బీజేపీ ఆధీనంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కారే పాలిస్తుంది. వారి పాలనలో ప్రభుత్వ అనుకూల మూకలు పశు ప్రవర్తనతో ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ తెస్తున్నారు.
మతం మత్తులో..హద్దులు దాటి..
మణిపూర్‌లో ముగ్గురు గిరిజన స్త్రీలను అల్లరి మూకలు గుంపులుగా చుట్టుముట్టి.. కర్రలు, కత్తులు, ఆయుధాలు ధరించి, వారిని వివస్త్రలను చేసి, వీధులలో తోసుకుంటూ బహిరంగంగా ఊరేగిస్తూ పొలాల్లోకి ఈడ్చుకుంటూ పోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దృశ్యమయ్యాయి. అక్కడ ఆ స్త్రీలపై సామూహిక మానభంగం చేయడం ఆ వీడియోలో కనపడుతున్నాయి.. వారిలో 21 సంవత్సరాల కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయి కూడా ఉందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆమె సోదరుడిని సైతం కొట్టి హింసించి చంపేశారు. మణిపూర్‌లో రెండు నెలలుగా తగలబడుతుంటే, బాధ్యత లేని ప్రధాని ఎన్నికల ప్రచారాలకు, విదేశీ పర్యటనలకు వెళ్లడం, దానికి దేశ, విదేశాల్లో బీజేపీ అనుకూల వర్గాలు జేజేలు పలకడం అమానుషత్త్వానికి పరాకాష్ట. కనీసం మోదీ బాధితులను సైతం ఓదార్చింది లేదు. వారికి ధైర్యం చెప్పలేదు. శాంతి భద్రతలపై సమీక్ష చేయలేదు. మణిపూర్‌ను వదిలి ఇతర ప్రాంతాలకు ప్రాణ భయంతో వలసలు పోతున్నవారికి భరోసా కల్పించలేదు. రెండు నెలలుగా సాగుతున్న ఈ మారణకాండలో పోలీసుల కాల్పులలో 86 మంది పైచిలుకు మరణాలు సంభవించాయి. ఇది మరో గుజరాత్ మారణకాండను మరిపించేలా ఈ సామూహిక హింసాకాండ జరుగుతూనే వుంది.
తమను రక్షించమని, తమ ప్రాణాలను కాపడమని భగవంతుణ్ణి వేడుకుంటున్న వందలాది మంది క్రైస్తవుల పై పోలీసులు లాఠీచార్జి చేశారు. వారి వందలాది ప్రార్ధనా మందిరాలైన చర్చిలను ధ్వంసం చేశారు. హిందూ మతం మత్తులో హింస హద్దులు దాటింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వీడియోల ఆధారంగా కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. ఇకనైనా మోదీ ప్రభుత్వం కనీసం స్పందిస్తుందా? ఈ దురాగతాలకు బాధ్యత వహిస్తుందా? లేదా ఎప్పటి మాదిరిగానే స్థబ్దంగా, మౌనంగా ఉండిపోతుందా? అనేది వేచి చూడాలి. మణిపూర్ ఘటనను.. సుప్రీంకోర్టు సుమోటోగా కేసును తీసుకొని, మణిపూర్ సంఘటనలపై, తన ప్రత్యక్ష పర్యవేక్షణలో సత్వర విచారణ జరిపించి దోషులను కాలయాపన లేకుండా కఠినంగా శిక్షించాలి. మణిపూర్‌లో జరిగిన, జరుగుతున్న అరాచకత్వంపై మానవతా వాదులు, ప్రజాస్వామిక వాదులు మనుషులుగా స్పందించాలి. అసమర్థ బీజేపీ పాలనను ఐక్యంగా ఎండగట్టాలి. దేశ, విదేశీ మీడియా కండ్లు తెరవాలి. సోషల్ మీడియా ప్రజాపక్షం వహించి మణిపూర్ దురాగతాన్ని ఖండించాలి.
డా. కోలాహలం రామ్ కిషోర్
98493 28496