- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రిటిష్ పాలకులనే సవాలు చేసి మూడు సంవత్సరాలు ఆడిన సినిమా గురించి తెలుసా?
'ఆజ్ హిమాలయ్‌కే చోటీసే
ఫిర్ హంనే లల్కారా హై
దూర్ హటో యే దునియావాలో
యే హిందూస్తాన్ హమారా హై'
హిమాలయ శిఖరాల మీది నుంచి సవాలు విసురుతున్నాం. ప్రపంచ వాసులారా దూరం జరగండి. ఈ భారతదేశం మాది' అంటూ 1943లో దేశభక్తి పాటను 'కిస్మత్' సినిమాకు రాసాడు కవి ప్రదీప్. అట్లా ఆనాటి బ్రిటిష్ పాలకులకు సవాలు విసిరాడు. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి నాలుగేళ్ల ముందే ఆ పాట దేశ ప్రజలను ఉర్రూతలూగించింది. మొదట ఆ పాట భావం అర్థం కాని బ్రిటిష్ అధికారులు పట్టించుకోలేదు. కానీ, అర్థం తెలిసాక వారంట్ జారీ చేసారు. దాంతో కవి ప్రదీప్ అజ్ఞాతవాసానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ పాట ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే సినిమా ప్రదర్శించిన ప్రతి టాకీసులోనూ ప్రతి షోలోనూ మళ్లీ మళ్లీ రీలు వెనక్కి తిప్పి ప్రదర్శించాల్సి వచ్చింది.
ఆ ఒక్క పాటతో 'కిస్మత్' ఎంతగా విజయవంతమైందంటే ఒక్క కలకత్తాలోనే మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు ఒకే టాకీసులో నడిచింది. ఎనిమిది వేల రూపాయలకు పంపిణీ హక్కులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్‌కు కోటి రూపాయల లాభం తెచ్చిపెట్టింది. అంతలా ఆనాటి ప్రజలను ఆ పాట, ఆ సినిమా ఆకట్టుకుంది. కవి ప్రదీప్ ఆ పాట ఒక్కటే కాదు అనేక దేశభక్తి గీతాలు రాసి, కొన్ని తానే స్వయంగా పాడి దేశభక్తి గీతాల ప్రవాహం అయ్యాడు. వాటికి శాశ్వత చిరునామాగా మిగిలాడు. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా ఆయనను గుర్తు చేసుకోవడమంటే, దేశం మీద అణువణువునా ప్రేమనూ, భక్తినీ ప్రదర్శించుకున్నట్టే.
అలరించిన అనేక పాటలు
1940లో వచ్చిన 'బంధన్' సినిమాలో ప్రదీప్ రాసిన 'చల్‌చల్‌రే నౌ జవాన్-చలో సంఘ్ చలే హం, దూర్ తేరా గావ్-అవుర్ థకే తేరా పావ్' పాట దేశ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ రోజులలో ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన 'వానర సేన' అన్న చిన్న పిల్లల గ్రూపులో ఈ పాట ఆత్మీయ గీతం అయిపోయింది. పంజాబ్, సింధ్ రాష్ట్రాలలో దాదాపు జాతీయ గీతంలా ఆ పాటను ఆలపించారు. అలా బ్రిటిష్ కాలంలోనే దేశభక్తిని ప్రభోదిస్తూ కవి ప్రదీప్ అనేక పాటలు రాసి గొప్ప ప్రేరణగా నిలిచారు. 1962 ఇండో-చైనా యుద్ధం ముగిసిన తర్వాత అమర సైనికుల బలిదానాలకు కదిలిపోయి కవి ప్రదీప్ రాసిన 'యే మేరే వతన్ కే లోగో-తుం ఖూబ్ లగాలో నారా- యే శుభ్ దిన్ హై హం సబ్ కా లహరా తిరంగా ప్యారా- పర్ మత్ భూలో సీమా పర్ వీరోనే హై ప్రాణ్ గవాయే-కుచ్ యాద్ ఉన్‌హే భీ కర్‌లో-కుచ్ యాద్ ఉన్‌హే భీ కర్‌లో- జో లౌట్ కే ఘర్ నా ఆయే-జో లౌట్ కే ఘర్ నా ఆయే' పాటతో దేశం కన్నీరు పెట్టింది.
1963లో ఢిల్లీ నేషనల్ స్టేడియంలో ఆ పాటను లతామంగేష్కర్ హృద్యంగా పాడగా ప్రధాని నెహ్రూ కదిలిపోయారు. లతని దగ్గరకు తీసుకుని 'నన్ను ఇవ్వాళ ఏడిపించావు తల్లీ' అన్నారు. ప్రదీప్‌ని అదే రోజు తీన్‌మూర్తి భవన్‌లో ఆ పాట వినిపించేందుకు ఆహ్వానించారు. రాష్ట్రీయ కవిగా గౌరవించి సన్మానించారు. గాంధీకి నివాళిగా ప్రదీప్ రాసిన 'దే దే ఆజాదీ బినా ఖదగ్ బినా డాల్, సాబర్మతికే సంత్, తూనే కర్ దియా కమాల్' అంధీ మే భీ జల్తీ రహీ గాంధీ తేరీ మషాల్' ఇంకా 'హం లాయే హై తూఫాన్ సే కష్తీ నికాల్' లాంటి పాటలు ఇప్పటికీ బాలల దినోత్సవం రోజున దేశమంతా వినిపిస్తూనే వుంటాయి.
చిన్నతనం నుంచే కవితలు
అంతలా దేశభక్తి భావాలను వికసింప చేసిన కవి ప్రదీప్ మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతానికి చెందిన 'బడ్‌నగర్'లో 2 ఫిబ్రవరి 1915న జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు రాంచంద్ర ద్వివేది. అందరూ రామూ అని పిలిచేవారు. తల్లి భజన పాటలు పాడేది. వాటితో రామూ ప్రేరణ పొందారు. తండ్రి నుంచి స్వాభిమానం, మొండితనం అలవడింది. టీచర్ అయినా, మేనమామ అయినా మాటంటే పడేవారు కాదు. అలహాబాద్‌లో ఇంటర్ పూర్తి చేసుకుని లక్నో విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివారు. టీచర్‌గాచేరమని అంతా సలహా ఇచ్చారు. తన కిష్టం లేదని టీచర్ కాలేదు. లక్నోలో ఉండగానే కవి ప్రదీప్‌గా మారి తన కవితలతో అందరినీ ఆకట్టుకున్నారు.
అప్పుడు ప్రదీప్ రాసిన 'పానీపట్' అన్న కవిత విశేష ప్రాచుర్యం పొందింది. తర్వాత బాంబేలో జరిగిన ఒక కవిసమ్మేళనంలో ప్రదీప్ కవితలను అప్పటి ప్రసిద్ధ సినీ నిర్మాత, దర్శకుడు హిమాంశురాయ్ విన్నారు. ఆఫీసుకు రమ్మన్నారు. హీరో అవకాశం ఇస్తాడేమోనుకున్నారు ప్రదీప్. కానీ, కవిగా నెలకు రెండు వందల రూపాయల జీతం మీద ఉద్యోగం ఇచ్చారు హిమాన్షురాయ్. ఆ కాలంలో రెండు వందలంటే చాలా పెద్ద అమౌంట్. 1939 లో వచ్చిన 'కంగన్' సినిమా కోసం నాలుగు పాటలు రాసారు ప్రదీప్. తర్వాత వచ్చిన 'బంధన్' లో 12 పాటలు రాయడమే కాకుండా మంచి స్వరమున్న ప్రదీప్ రెండు పాటలు కూడా పాడారు.
అన్నీ సూపర్ హిట్‌లే
నాస్తిక్, జాగృతి సినిమాలకు ప్రదీప్ రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రగిలిన మత విద్వేషాలతో కలిగిన ప్రాణ నష్టం చూసి 'నాస్తిక్' సినిమా కోసం రాసి పాడిన 'దేఖ్ తేరీ సంసార్ కి హాలత్ క్యా హోగయి భగవాన్' అన్న పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తుంది. ఇక 'జాగృతి' కోసం ప్రదీప్ రాసిన 'ఆవో బచ్చో తుమ్‌హే దిఖాయే, వందేమాతరం, వందేమాతరం' కూడా పిల్లలనూ పెద్దలనూ ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. ఆయన బాంబేలో ఉండగానే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూశారు. భద్ర అనే అమ్మాయిని చూపించగా, ప్రదీప్ ఆమెను ఒకే ప్రశ్న అడిగాడు.
'నేను ఒక మండుతున్న జ్వాలను. నువ్వు నీళ్లలాగా వుంటానంటే వివాహం చేసుకుంటానన్నాడు' ఇంకేముంది. పెళ్లి జరిగింది. ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. దేశభక్తి గీతాలతో పాటు భక్తి గీతాలు, భజనలు కూడా రాసారు ప్రదీప్. ఆయన జీవితంలో విజయాలూ, సంతోషాలే కాదు, దుఃఖాలు వున్నాయి. తల్లిదండ్రులిద్దరినీ దుండగులు హత్య చేసారు. ఆ దుఖం నుంచి బయట పడడానికి ప్రదీప్‌కు చాలా సమయం పట్టింది. ఇలా దేశభక్తి గీతాల కవి శిఖరంగా నిలిచిన కవి ప్రదీప్‌కు జాతీయ సంగీత నాటక అకాడెమి అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించాయి. స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా కవి ప్రదీప్ కు నివాళులు.
వారాల ఆనంద్
9440501281