- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంజనీర్ల జోక్యం తగ్గింది..నేతల జోక్యం పెరిగింది!
మనిషి నాగరికత సివిల్ ఇంజనీరింగ్‌తో మొదలైంది. ఆ రోజుల్లో ఇంజనీరు అంటే సివిల్ ఇంజనీరు అనే భావించేవారు. ఒక ఇల్లు నిర్మించాలన్నా ఒక రోడ్డు వేయాలన్నా, కాలువ తవ్వాలన్నా సివిల్ ఇంజనీరును సంప్రదించేవారు. ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడంతో ఒక ప్రణాళిక వేసి డిజైన్ చేసి అంచనాలు వేయడంలో సిద్ధహస్తుడు సివిల్ ఇంజనీరు. తర్వాత్తర్వాత పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడానికి మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కూడా భాగస్వాములయ్యారు. ప్రభుత్వ పనులలో రాజకీయ నాయకులు, పాలనాదికారులు మితిమీరిన జోక్యంతో పనులు తొందరగా చెయ్యాలని ఆదేశాలిచ్చి, ప్రతి పని విభాగానికి మధ్యలో కనీస సమయం ఇవ్వకుండా ఒత్తిడి చేస్తూ పనుల నాణ్యతను చెడగొడుతున్నారు. పనుల్లో ఇంజనీర్ల జోక్యంలో తగ్గి పనుల నిర్మాణంలో నాణ్యత తగ్గిపోతోంది.
ఒకనాటి నిర్మాణాలు, 1923లో నిర్మించిన నిజామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా పటిష్టంగా ఉన్నాయి. ఆ రోజుల్లో నాణ్యతకు పెద్ద పీట వేసేవారు. అదే విధంగా విజయవాడ వద్ద కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ బ్రిటిష్ వారి హయాంలో 1855లో పూర్తయింది. 1952లో వచ్చిన వరదలకు ఈ పాత బ్యారేజీ కొట్టుకొని పోవడంతో మరో ఆనకట్టను నాలుగేళ్లలో నిర్మించారు. ఈనాటికీ ఇది ఎన్నో వరద తాకిళ్లకి నిలబడి వుంది. ఒక కాంక్రీటు స్లాబ్ వేస్తే , పునాది దగ్గర నుండి పనుల్లో నిమగ్నమై, పర్యవేక్షణ చేస్తూ స్టీల్, కాంక్రీట్ డిజైన్ ప్రకారం ఉన్నాయా లేదా అని ఇంజనీర్లు, సూపర్‌వైజర్లు భయంతో వ్యవహరించేవారు. ఖచ్చితంగా 21 రోజులు కాంక్రీటుకు క్యూరింగ్ చేసేవారు. ఆ కట్టడాలు అప్పటి పరిజ్ఞానంతో నిర్మించినా ఎటువంటి లోపాలు లేకుండా ఇప్పటికీ నిలబడి ఉండి ప్రజాప్రయోజనాలు నెరవేరుతున్నాయి.
ఒత్తిడి వల్లే నాణ్యత ఔట్
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రభుత్వేతర నిర్మాణాల్లో చాలా మార్పు వచ్చింది. పాలకులు తమ పదవీ కాలంలోనే భారీస్థాయి ప్రజాపనులు పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. కానీ వాటి నిర్మాణానికి తగిన సమయం ఇవ్వకుండా త్వరగా పనులు కావాలని గుత్తేదార్లపై ఒత్తిడి పెంచడం తో నాణ్యత తగ్గుతోందని మొన్నటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాల్లో మనం గమనించవచ్చును. నిర్మాణాల్లో నైపుణ్యత లోపించి గ్రామాల్లో అక్కడక్కడ ప్రభుత్వ బిల్డింగ్ స్లాబ్ క్రింది భాగంలో స్టీల్ కనిపిస్తుంది. చత్తు వేసేటప్పుడు స్టీల్ షటర్ మద్యభాగంలో కొంత గ్యాప్ ఉండేటట్లు ఏదైనా ఒక చిన్న ఎత్తు పెట్టినా అక్కడ మనకు షటర్ విప్పిన తరువాత స్టీల్ కనపడదు. ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే ప్రభుత్వ నిర్మాణాలు చాలా కాలం ఉంటాయి. అదేవిధంగా రోడ్డు నిర్మాణాలలో కూడా వర్షం నీరు పడితే నీరు రెండు వైపులా వెళ్లి, నీరు రోడ్డు మీద నిల్వ ఉండకపోతే చాలాకాలం పాటు రోడ్లు కూడా మన్నికతో ఉంటాయి.
నేరుగా ఇంజనీర్లయి, పని అర్థం కాక..
మన దేశంలో వృతి విద్యా కోర్సులలో ముఖ్యం గా మెడిసిన్ కోర్సు పూర్తి అయిన తరువాత కంపల్సరీగా హౌస్ సర్జన్ చేసినట్లుగా ఇంజనీరింగ్ కోర్సులలో నేరుగా పనులలో పాల్గొనే పద్ధతి లేదు. దాంతో ఇంజనీర్లకు ఎటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా పోయింది. వీరు నేరుగా ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రవేశించి, అక్కడ జరిగే నిర్మాణాలు అర్థం కాక సతమతమవుతున్న విషయం వాస్తవం. ఒకసారి ప్రభుత్వ ఇంజనీరుగా ప్రవేశిస్తే అనుభవం లేకున్నా అధికారం చలాయించడం ద్వారా మంచికంటే చెడు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సందర్భంగా, మన యువ ఇంజనీర్లు ఖచ్చితంగా ప్రపంచ ప్రసిద్ధ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితాన్ని ఒక పాఠంగా చదవాలి.
నిజాయితీ అసమర్థతగా మారి...
మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన విధి నిర్వహ ణలో భాగంగా, ఒక గ్రామానికి వెళ్లినప్పుడు పని పూర్తి అయిన తరువాత అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ రాత్రి తాను పని చేసుకోవడానికి తన వెంట తెచ్చుకున్న కొవ్వొత్తిని వెలిగించి పనిని పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత కొవ్వొత్తిని ఆర్పి వేసి మరొక కొవ్వొత్తిని వెలిగించి తన పనిని మళ్లీ మొదలుపెట్టుకున్నాడు. అది గమనించిన గ్రామ పెద్ద ఆ కొవ్వొత్తిని ఎందుకు ఆర్పివేసి మరొక కొవ్వొత్తిని వెలిగించారు అని అడుగగా దానికి ఆయన ఇలా చెప్పారు. మొదట నేను ప్రభుత్వ పనిని చేశాను, ఆ తరువాత నా వ్యక్తిగతమైన పని చేసుకున్నాను అని జవాబు ఇచ్చా రు. మనం చేస్తున్న పనిలో ఎంత నిజాయితీ తోడైతే ఆ పని అంత బాగుంటుందని మోక్షగుండం తెలియచెప్పారు. ప్రస్తుతం నిజాయితీగా పనిచేసేవారిని ఈ లోకం అసమర్థుడుగా చిత్రీకరిస్తోంది.
ఆయన జీవితం ఓ ఆదర్శ పాఠం
ఆ రోజుల్లో మోక్షగుండం విశ్వేశ్వ రయ్య జాతి మెచ్చే కట్టడాలను కట్టి అందరి మెప్పు పొందారు. 12-04-1962న వారు ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. మర ణించి 62 ఏళ్లయినా మనం ఆయనను స్మరిం చుకుంటున్నాం. ఆయనతో ఎందరో ఇంజనీర్లు పనిచేసి ఉండవచ్చును కానీ కేవలం మోక్షగుండం విశ్వేశ్వరయ్యనే గుర్తు పెట్టుకుంటున్నాం. మనందరం మంచినే ప్రోత్సహి స్తున్నాం కానీ ఆచరణే కష్టమవుతుంది. కాబట్టి అందరు రాణించలేకపోతున్నారు. స్వీయ నియంత్రణతో సాధారణ జీవనాన్ని గడుపుతూ విశ్రాంత జీవితాన్ని కూడా ప్రజాపనులకు కోసం ఉపయోగించిన కర్మజీవి ఆయన. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజును ప్రతియేట ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకుంటున్నాము. గొప్ప వ్యక్తిత్వం గల సివిల్ ఇంజనీర్, సహనశీలి, క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన ఆయన జాతికి ఉపయోగపడే ఎన్నో ప్రజా పనుల నిర్మాణాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నుండి భారతరత్న బిరుదును 1955లోనే పొందిన మొదటి సివిల్ ఇంజనీరు. ఆయన జీవిత విశేషాలను, విజయాలను నెమరువేసుకుంటూ ఆయనను స్ఫూర్తిగా తీసు కొని ఆయన అడుగుజాడలలో నడవడానికి మన ఇంజనీర్లు ప్రయత్నాలు చేస్తారని ఆశిద్దాం.
సోమ శ్రీనివాసరెడ్డి
కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్