- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తొలి మహిళా టీచర్..
తరతరాలుగా దళిత బహుజనులకు, మహిళలకు అగ్రవర్ణ స్త్రీలకు సైతం విద్యను నిరాకరించిన మనువాదంపై తిరుగుబాటు చేసి, దేశంలో మొట్టమొదటిసారి మహిళలకు దళిత బహుజనులకు విద్యను నేర్పిన ధీర వనిత సావిత్రి బాయి పూలే. ఆధునిక తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా చరిత్రలో చిర స్థాయిలో నిలిచింది. మనిషిని మనిషిగా చూడ నిరాకరించిన కుల, మత వ్యవస్థల పునాదిగా వస్తున్న సంప్రదాయం, కట్టుబాట్లు, అచారాలు, దేవుడు, దయ్యాలు తదితర మూఢ నమ్మకాల ముసుగులో మెజారిటీ ప్రజలకు హైందవ సంస్కృతి అక్షరాలను నిషేధించింది. అందుకే హిందుత్వానికి పునాది అయిన మను అధర్మ, అశాస్త్రీయ వాదులు విద్యా బుద్ధులు నేర్పే దళిత ఉపాధ్యాయులపై విద్యాలయాలలో దాడులకు తెగబడుతున్నారు. కొటగిరి మల్లికార్జన్ సార్ నుండి తుక్కుగూడ రాములు సార్ వరకు మతం, దేవుడు ముసుగులో తమ దౌర్జన్యాలను కొనసాగిస్తున్నారు. దళిత బహుజనులు, మహిళలు విద్య నెర్చుకోరాదని నాడు బ్రహ్మణులు సావిత్రి బాయి పూలే పై దాడి చెసిన వారసత్వాన్ని ఆధునిక మను వాద గుండాలు కొనసాగిస్తున్నారు. దళితులు, మహిళలు చదువుకోకూడదని, జ్ఞానాన్ని పొందవద్దని, గౌరవంగా, సమానంగా జీవించడాన్ని నాటి నుండి నేటి వరకు మనువాదులు తమ దౌర్జన్యాల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. అదే సమయంలో సావిత్రి బాయి నుండి నేటి వరకు మనువాదుల దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ ప్రతిఘటిస్తూనే ఉన్నారు.
దళితులకు విద్య నేర్పిన దంపతులు..
1831 జనవరి 3న పేద రైతు తొటమాలి కుటుంబంలో సావిత్రి బాయి జన్మించినది. సావిత్రి బాయి చిన్న నాటి నుండి ధైర్యశాలి. చిన్న వయస్సులోనే మనువాద పితృస్వామ్య, అగ్ర వర్ణ వ్వవస్థపై, కుల వ్యవస్థపై తిరగబడినది. ఆమెకు తొమ్మిది ఏళ్ల వయస్సులోనే సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతి రావు పూలేతో బాల్యవివాహం జరిగింది. తదనంతర కాలంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడింది. విద్య లేనిదే బహుజనులకు జ్ఞానం లేదని ఫూలే ప్రారంభించిన సత్యశోధక్ సమాజ్ ఉద్యమంతో భాగస్వామ్యం అయి భర్త వద్ద చదువు నేర్చుకున్నది. 1848లో ఉపాధ్యాయ శిక్షణ పొంది తొలి మహిళ టిచర్‌గా మారి విద్య నిరాకరించబడ్డ మహిళలకు పాఠశాలలు ప్రారంభించి విద్య నేర్పినది. దేశంలో మొట్టమొదటిసారి అస్పృశ్యులకు చదువు చెప్పి చరిత్ర సృష్టించారు. అంతేకాక భర్త చనిపొయిన భార్యను భర్త చితిలోనే కాల్చే అమానవీయమైన విష సంస్కృతిని ప్రతిఘటించింది. వారికి ఆశ్రయం కల్పించి తిరిగి జీవితంలో నిలబెట్టారు. ఒంటరి స్త్రీలకు చదువు నేర్పారు. వారికి పునర్వివివాహం చేసినది.
ప్లేగు వ్యాధి సోకి..
1860లో వితంతువులకు గుండు చేయబోమని క్షవరులతో సమ్మె చేయించింది. పిల్లలను కనకుండా ఓ బ్రాహ్మణ అనాథ అయిన యశ్వంత్‌ను పెంచి పెద్ద చేసి వైద్యుడిగా మార్చారు. 1896లో మహరాష్ట్రలో కరువు కటాకాలు, భయంకరమైన ప్లేగు వ్యాధితో అల్లాడుతున్న ప్రజలకు సేవలు చేశారు. 2000 వేల మంది ఆకలి తీర్చి ఆశ్రయం కల్పించారు. చివరకు ప్లేగు వ్యాధి సోకి సావిత్రి బాయి పూలే కనుమూశారు. తెలంగాణ ప్రభుత్వం ఈమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించడం సంతోషకరం. 1997లో నాటి భారత ప్రభుత్వం ఆమె గుర్తుగా తపాళా బిళ్లలను విడుదల చేసింది. మనమందరం సామాజిక విప్లవకారిణి సావిత్రి బాయి పూలే బాటలో పయాణించి అసమానతలు లేని నవసమాజం నిర్మించుకొవాలి. నాణ్యమైన కామన్ విద్యావిధానాన్ని సాధించుకోవడమే సావిత్రి బాయి పూలేకు నిజమైన నివాళి అవుతది.
- పి.శంకర్
దళిత బహుజన ఫ్రంట్(డిబిఎఫ్)
94411 31181