- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికల్ హబ్‌గా తెలంగాణ..!
ఉమ్మడి పాలనలో సర్కారు దవాఖానల నిర్వహణ దారుణంగా ఉండేది. పాడైపోయిన పరికరాలు, అరకొర సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరత, పరిశుభ్రత లేని పరిసరాలు, మందుల కొరతతో దవాఖానాలే రోగగ్రస్థమై ఉండేవి. ప్రజలు ఓ దశలో ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు. దీంతో చేసేది ఏమి లేక ప్రయివేటు దవాఖానాలను ఆశ్రయించి అప్పుల పాలైన సందర్భాలు అనేకం. ఈ దుష్పరిణామాలపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దే కర్తవ్యంలో భాగంగా జిల్లాలో మెడికల్ కళాశాలల ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. దీంతో తొమ్మిదేండ్లలో ప్రభుత్వ దవాఖానాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
మహిళలకు 57 రకాల సేవలు..
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ ప్రొఫైలింగ్ విధానం రోగ నిర్ధారణలో సత్ఫలితాలు సాధించింది. మనకెన్ని గొప్ప దవాఖానాలు ఉన్నాయని కాదు.. అవి ప్రతి పౌరుడికి చేరువైతే సార్థకత అని బార్బరా బాక్సర్ అన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ దవాఖానాలకు దీటుగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో శస్త్రచికిత్సల సంఖ్య పెరిగింది. 2014లో 92గా ఉన్న మాతృ మరణాల రేటు 2023 నాటికి గణనీయంగా 43కు పడిపోయింది. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు 30 శాతం ఉండేవి. కానీ తొమ్మిది ఏండ్లలో సీన్ రివర్స్ అయ్యింది. ప్రతి వందమంది గర్భిణుల్లో 69మంది పురుడు కోసం ప్రభుత్వ దవాఖాననే ఆశ్రయించారు. రాష్ట్రం ఏర్పడక ముందు నిమ్స్ దవాఖాన మాత్రమే సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేవి. రాష్ట్రంలో నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వచ్చి చికిత్స పొందాల్సిన పరిస్థితి. కానీ అప్పుడు నిమ్స్‌లో 900 పడకలు మాత్రమే ఉండేవి. ఆ సంఖ్య స్వరాష్ట్రంలో 3,489కి పెంచింది. ఇంకా నిమ్స్ విస్తరణ పనులు పూర్తయితే మొత్తం పడకలు 4వేలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి గరిష్ట కవరేజీ పరిమితి రూ.2లక్షల నుండి రూ.5 లక్షలకు పెరిగింది. మే 2023 వరకు 15,39,994 మంది ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం 22 జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్స్ హబ్స్ ఉండగా..టిఫా స్కానింగ్ వంటి అత్యాధునిక పరికరాలను సైతం అందుబాటులోకి తెచ్చారు. మరో 11 జిల్లాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవడం ముదావహం. ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వ పథకాలు కీలక భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఆరోగ్య మహిళ పథకం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న మహిళలకు వయస్సుతో సంబంధం లేకుండా 57 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రజారోగ్య పరిరక్షణ ముఖ్యమని..
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహంచిన హల్త్ ఫిట్‌నెస్ కాంపెయిన్‌లో 3 కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా, తెలంగాణ రాష్ట్రం 3 కేటగిరీల్లోనూ అవార్డులు సాధించడంతో పాటు, నీతి ఆయోగ్ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీల్లో 3వ స్థానాన్ని సాధించడం తెలంగాణ కీర్తిని పెంచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. పేద విద్యార్థులకు వైద్య విద్య నాడు అందని ద్రాక్షే. అలాంటిది కళాశాలతో పాటు కార్పొరేట్ వైద్యం అందించి, ‘మెడికల్ హబ్’గా ప్రభుత్వం తీర్చిదిద్దింది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతున్నాయి. రాష్ట్రం ఏర్పడక ముందు 17,000 పడకలు ఉంటే అప్ గ్రేడేషన్‌తో పాటు, భవిష్యత్‌లో అందుబాటులోకి తెస్తున్న 50,000 పడకలతో అనుహ్య ప్రగతి సాధించింది. ఒకేసారి 8 మెడికల్ కళాశాలలు ప్రారంభించుకొని రికార్డు సృష్టించింది. ఇదే ఏడాది మరో 9 మెడికల్ కళాశాలల్లో వర్చువల్ తరగతులు ఒకే రోజు, ఒకే సమయానికి సీఎం కేసీఆర్ ప్రారంభించినారు. ఒక్కో కాలేజీకి వంద ఎంబీబీఎస్ సీట్లతో 17 కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి.
2014-15 విద్యా సంవత్సరంలో తెలంగాణలో 2950 మెడికల్ సీట్లు ఉండగా ఈ విద్యా సంవత్సరం 7,090 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పీజీ మెడికల్లో కూడా 1,183 ఉంటే ప్రస్తుతం 2,548 సీట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో తొమ్మిది ప్రభుత్వ కళాశాలలు ప్రారంభానికి సిద్ధం అయ్యాయి. మొత్తం 26 కళాశాలలు ఏర్పాటు చేయగా వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వస్తే దేశంలో వైద్య విద్యకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్రం వైద్యారోగ్య రంగంలో సాధించిన ప్రగతి దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచి ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్య రంగంగా అభివృద్ధి దిశగా తెలంగాణ రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’ గా అవతరించింది.
(నేడు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం)
డా. సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కేయూ
98662 55355