మహిళా సాధికారత వైపు..

by Ravi |   ( Updated:2023-12-10 00:30:58.0  )
మహిళా సాధికారత వైపు..
X

తెలంగాణ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు నూతనంగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి వరం కురిపించింది. డిసెంబర్ 9న సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన 'మహాలక్ష్మి పథకం'లో ఒక అంశమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఉచిత బస్సు ప్రయాణంలో లబ్ధిదారులు మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళా సాధికారతను పెంపొందించడమే కాకుండా పరోక్షంగా ప్రతీ కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు కూడా ఉంటుంది.

ఆడబిడ్డలను దీవించిన ప్రభుత్వం

పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, హైదరాబాదు సహా ఇతర నగరాల్లో నడిచే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అంతరాష్ట్ర ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనయితే రాష్ట్ర సరిహద్దు వరకు ఈ సదుపాయం ఉంటది. రోజూ సుమారు 40 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తే వారిలో దాదాపు 55 శాతం మంది మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఈ పథకం అమలుతో ఏడాదికి రూ.3 వేల కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడొచ్చు కానీ ఈ పథకం వల్లనైతే సమస్త తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ అని దీవించినట్లున్నది. ఎంతోమంది మహిళా ఉద్యోగినులు, మహిళా కార్మికులు, మహిళా కూలీలు తాము సంపాదించే సంపాదనలో ఒకవంతు రవాణాకే వెచ్చించాల్సి వస్తున్నది. ఈ పథకం ద్వారా వాళ్లకెంతో ఆర్థిక వెసులుబాటు కల్గుతుంది. పొదుపు దిశగా ఆలోచన బాటలు పడతాయి.

తగ్గనున్న బాలికల డ్రాపౌట్

18 సంవత్సరాల లోపు బాలికలకు ఉచిత బస్ పాస్‌ల సౌకర్యం ఇదివరకే రాష్ట్రంలో అమలులో ఉంది. కానీ ఇది కేవలం పనిదినాల్లో మాత్రమే. సుమారు 20 కి.మీ.ల లోపు ఆర్డినరి బస్‌లలో రోజుకు ఒకసారి నిర్దిష్ట స్టాప్‌ల మధ్య అప్ అండ్ డౌన్ సౌకర్యం మాత్రమే ఉన్నది. సెలవు దినాలలో ఈ పాస్‌లు పనిచేయకపోవడం...కండిషన్స్‌తో ఈ సౌకర్యం కల్పించడం వలన ఎంతోమంది బాలికలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది బాలికలు మధ్యలోనే తమ చదువులను ఆపేస్తున్నారు. ఇప్పుడు ఈ పథకం వల్లనైతే బాలికల డ్రాపౌట్ తగ్గడమే కాకుండా, బాల్యవివాహాలు కూడా తగ్గి ఉన్నత చదువుల వైపు సాగే అవకాశాలు పెరుగుతాయి.

విమర్శలూ ఉన్నాయి...

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మీద కొన్ని వర్గాల నుండి నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మహిళలు, బాలికలు చెప్పకుండా ఇంటినుండి వెళ్లిపోయే అవకాశాలుంటాయని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిమీద సోషల్ మీడియా గ్రూప్‌లలో హాస్యాస్పద మెస్సేజ్‌లను గుప్పిస్తున్నారు. ఈ పథకాన్ని మహిళా సాధికారతా దిశవైపు గానే ఆలోచించాలి తప్ప వాళ్ల అనుమానాలకు తావులేదని మహిళాలోకం వ్యక్తం చేస్తున్నది. అంతేగాకుండా లబ్ధిదారులకు సరైన న్యాయం జరగాలన్నా, ప్రభుత్వం మీద అధిక భారం పడకుండా ఉండాలన్నా, ఉద్యోగం చేసే మహిళల విషయంలో కొంత జీతం మార్జిన్ ను నిర్ణయిస్తే బాగుంటది. అదేవిధంగా బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. కొన్ని రూట్లలో లేడిస్ స్పెషల్ బస్‌లను నడిపించాలి...ఈ సౌకర్యం ఉన్నచోట ట్రిప్పుల సంఖ్యను పెంచాలి. ఈ పథకం వల్ల ఆర్టీసీ ప్రయాణం వైపు మొగ్గు చూపే ప్రజల సంఖ్య పెరుగుతది. దీనివల్ల ప్రైవేటు ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి మీదనైతే తప్పకుండా ప్రభావం చూపుతది. వాళ్ల సంక్షేమంను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని చర్యలను చేపడితే బాగుంటది.

మన రాజ్యాంగంలో 4వ భాగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలు వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం తగిన సంక్షేమ పథకాలను అమలుచేయొచ్చని తెలియజేస్తాయి. కానీ ప్రస్తుతం మన ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తున్నాయి. బడ్జెట్లో అధిక కేటాయింపులు ఈ సంక్షేమ పథకాలకే పోతున్నాయి. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను మాత్రమే ప్రవేశపెట్టాలి. అంతే తప్ప తమ పదవుల కోసం మితిమీరిన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఖజానాను కుదించవద్దు... సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టిన వెయ్యకూడదు.

గట్టు రాధికమోహన్

హన్మకొండ

91826 18463

Advertisement

Next Story

Most Viewed