దేనికి దశాబ్ది ఉత్సవాలు!?

by Ravi |   ( Updated:2023-06-02 01:42:59.0  )
దేనికి దశాబ్ది ఉత్సవాలు!?
X

స్వరాష్ట్రం సాధించాకా, రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు పెంచుతామని, నిరుద్యోగులను ఆదుకుంటామని రోడ్డు మీద పడేసినందుకా ఈ దశాబ్ది ఆవిర్భావ సంబరాలు? దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఎన్‌ఈపీ-2020 అమలుపరుస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పేద, మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసేటువంటి కుట్రలో ఉన్నందుకా ఈ దశాబ్ది సంబరాలు? రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడి దాదాపు 6½ సంవత్సరాలు గడుస్తున్నా, జిల్లాకు ఒక్క ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, ఒక్క ఇంటర్మీడియట్ కళాశాల, ఒక్క మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉన్నందుకు ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలా? రాష్ట్రంలో షీ-టీమ్స్ ఉన్నా, అమ్మాయిలకు కనీస రక్షణ కల్పించడంలో విఫలం అవుతున్నందుకా ఈ ఉత్సవాలు? పేద-మధ్యతరగతి వారికి జేబులు గుల్ల చేసేందుకు బస్సు టికెట్ల రేట్లు పెంచినందుకా? బస్సు పాసుల రేట్లు పెంచి పేద విద్యార్థులను విద్యకు దూరం చేసినందుకు జరుపుకోవాలా ఈ ఉత్సవాలు!

రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతున్నందుకు విద్యార్థి సంఘాలను, జర్నలిస్టులను అక్రమ కేసులు పెట్టి మానసిక మనోవేదనకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని బొందపెడుతున్నందుకా ఈ ఉత్సవాలు. ఎన్నికల సమయంలో ప్రతి ఇళ్ళులేని పేదవాడికి డబుల్ బెడ్ రూంలు కల్పిస్తామని ఇప్పుడు ఆ ప్రస్థావన కేవలం ఎన్నికల హామీగా మార్చుతున్నందుకు చేయాలా ఈ దశాబ్ది ఉత్సవాలు? 33 జిల్లాల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ఆరోగ్య పరిస్థితిని గాలికి వదిలేసినందుకా ఈ సంబరాలు? ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయకుండా, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఏర్పరచి పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందకుండా చేస్తునందుకా ఈ సంబరాలు! ఎంతో పకడ్బందీగా జరగాల్సిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్ష పేపర్లు లీక్ చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నందుకా ఈ దశాబ్ది వేడుకలు! తెలంగాణ రాష్ట్రంలోని యువత ఆర్తనాదాలు వినపడలేదు కానీ, ఇక్కడ కంపెనీలు పెట్టి, పొరుగు రాష్ట్రాల వారిని నియామకం చేసుకుంటూ ఇక్కడి వారికి మోసం చేస్తూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాందుకా? ఈ దశాబ్ది ఆవిర్భావ సంబరాలు?

బుర్ర అఖిల్

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

86393 82358

Also Read: దగాపడ్డ తెలంగాణ!

Advertisement

Next Story