- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాస్వామ్యాన్ని గుబాళింపజేస్తున్న తీర్పులు
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి శాసన వ్యవస్థ, కార్యనిర్వాహణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనేవి మూడు స్తంభాలు. వీటిలో న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది రాయి వంటిది. న్యాయవ్యవస్థ భారత రాజ్యాంగానికి సంరక్షకుడిలా, భారత ప్రజలకు జవాబుదారీగా, భారత ప్రజాస్వామ్యానికి కాపలదారుల వ్యవహరిస్తుంది. ఇందులో అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు. ఇది కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల ఇతర సమూహాల ఒత్తిళ్లకు లోను కాకుండా తన తీర్పులను వెలువరిస్తూ తన స్వయం ప్రతిప్రత్తిని కాపాడుకుంటూ ఉంటుంది.
అయితే, ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన వరుస తీర్పులు భారత ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలో నలు దిశల చాటేలా చేశాయి. ఇలాంటి తీర్పులు భారత ప్రజాస్వామ్యం బలోపేతానికి తోడ్పడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
చండీగఢ్ మేయర్ ఎన్నిక
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అక్కడి ఎన్నికల అధికారి, సభ్యుల సంఖ్య బలం ఉన్న కూటమికి కాకుండా సంఖ్యా బలం లేని పార్టీ సభ్యునికి వక్రమార్గంలో మేయర్ పీఠాన్ని కట్టబెట్టడాన్ని సుప్రీంకోర్టు తన తీర్పులో ఖండించింది. ప్రజాస్వామ్యాన్ని ఇలా ఖూనీ చేయడానికి మేము అనుమతించమని, ఈ దేశంలో గొప్ప స్థిరీకరణ శక్తి ప్రజాస్వామ్యపు స్వచ్ఛత మాత్రమే అని చెప్పింది.
ఎలక్టోరల్ బాండ్ పథకం
రాజకీయ పార్టీల ఎన్నికల నిధుల సేకరణకు 2017-18 బడ్జెట్‌లో కేంద్రం ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. వీటిని దేశంలోని కంపెనీలు, వ్యక్తులు కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుస్తాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఎలక్టోరల్ బాండ్స్ పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ ఎలక్టోరల్ బాండ్లు కార్పోరేట్ సంస్థలకు, ప్రభుత్వాలకు మధ్య క్విడ్ ప్రోకో సంబంధాన్ని పెంపొందిస్తుందని, ఇది పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకమని, ఇది దేశంలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి తోడ్పాటు అందిస్తుంది కావున ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని 15 ఫిబ్రవరి 2024న ఎలక్ట్రోల్ బాండ్లను పథకాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
బిల్కిస్ బానో కేసు
2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా సంఘటన అనంతరం జరిగిన అల్లర్లలో బిల్కీస్ భాను అనే ఆరు నెలల గర్భిణి దారుణ అత్యాచారానికి గురైంది. దుండగులు ఆమె మూడేళ్ల పాపతో పాటు ఇంట్లో వారందరినీ దారుణ హత్య చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో మొత్తం 11 మంది దోషులకు కోర్టు యావజీవ కారాగార శిక్ష విధించింది. గుజరాత్ ప్రభుత్వం గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజున సత్ప్రవర్తన, 14 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా క్షమాభిక్ష పెడుతూ దోషులను విడుదల చేసింది. వీరి విడుదలపై బిల్కిస్ బాను సుప్రీంకోర్టు నాశ్రయించింది. దోషులు సుప్రీంకోర్టును తప్పుతోవ పట్టించారంటూ వీరు చేసింది క్షమించరాని నేరమంటూ సుప్రీంకోర్టు దోషుల క్షమాభిక్షను రద్దు చేసింది.
వీవీపాట్ ధ్రువీకరణ సమస్య
ఓటరు వెరిఫైబుల్ పేపర్ ఎడిట్ ట్రయల్ రికార్డులకు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల డాటాను విస్తృతంగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ప్రస్తావిస్తూ VVPAT ప్యాడ్లను మొత్తం లెక్కించడంలో ఉన్న ఇబ్బంది ఏమిటని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను భారత అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తన తదుపరి తీర్పులలో వీవీప్యాట్ ప్యాడ్లను మొత్తంగా లెక్కించాలని తీర్పునిస్తే భారత ప్రజాస్వామ్యం మరింత పారదర్శకమవుతుంది.
ఈ విధంగా ఇటీవల సుప్రీంకోర్టు వెలవరిస్తున్న నిష్పక్షపాతమైన తీర్పులతో దేశ ప్రజలకు ప్రజాస్వామ్య వాదులకు భారత న్యాయ వ్యవస్థ మీద ఆశలు చిగురిస్తున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం మీద నమ్మకాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తున్నాయి. అత్యున్నత న్యాయస్థానం అత్యున్నత తీర్పులతో భారత ప్రజాస్వామ్యం మరింత ప్రతిష్టమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
- మధుకర్ మునేశ్వర్
99630 43490