- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశానికి సవాల్...ఆత్మహత్యలేనా?
ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులను తీవ్రంగా ఏడిపించి పైశాచిక ఆనందం పొందడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదని, విద్యార్థులందరి ప్రయోజనాలను పరిరక్షించాలన్నది 2012 నాటి యూజీసీ సమానత్వ ప్రోత్సాహక మార్గదర్శకాల సారాంశం. ర్యాగింగ్‌కు ఒడిగట్టేవారికి విధించే శిక్షలు ఊహకందని రీతిలో కఠినంగా ఉండాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు 15 సం.ల కిందటే స్పష్టీకరించింది. అమాయక జూనియర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ, ఆత్మహత్యలకు ప్రేరేపించే ర్యాగింగ్ దుశ్చేష్టలను హెచ్చరికలు, జరిమానాలతో కట్టడి చేయడం అసాధ్యం. ఎంతటి వారైనా సరే శాశ్వత బహిష్కరణ చేయడమే గట్టి పరిష్కారం.
కుటుంబ కలహాలతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, పేదరికం, అప్పుల బాధతో మరికొందరు, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్.. ర్యాగింగ్ పైశాచిక ఆనందం, ప్రేమలో విఫలం. ఇష్టం లేని పెళ్లితో ఇంకొందరు..వరకట్న వేధింపులు, అవమానం, ఆవేశం ఇలా కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడిలో బలహీనమైన క్షణంలో, బలమైన నిర్ణయాలతో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్న వారి సంఖ్యా రోజు రోజుకీ పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు,... ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్దదిక్కును కోల్పోయి చేతికాడికి అందివచ్చిన బిడ్డలు దూరమై....దుర్భర జీవనం గడుపుతున్న కుటుంబాలు ఎన్నో దశాబ్దాలుగా అగమ్య గోచరంగా కొట్టుమిట్టాడుతున్నాయి..
ప్రతి 20 సెకండ్లకు ఒక ఆత్మహత్య...
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి 8 లక్షల మంది పైగా, అంటే ప్రతి 30 సెకనులకు ఒకరు ఆత్మ బలిదానం చేసుకుంటున్నారు, ప్రపంచంలో జరిగే ప్రతీ 4 ఆత్మహత్యల్లో ఒకటి భారత్‌లోనే నమోదవుతోంది. ప్రపంచంలో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 15 నుంచి 30 ఏళ్లలోపు వారే ఎక్కువ కావడం గమనార్హం... ముఖ్యంగా మహిళల కంటే పురుషులే ఎక్కువ ఉండడం గమనించాల్సిన విషయం.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం 2021 భారతదేశంలో సగటున ప్రతి రోజూ 450 మంది, గంటకు 18.7 మంది, ప్రతి ఒక్క నిమిషానికి 3 కి పైగా మధ్యంతరంగా బలవుతున్నారు. ఇక పురుషులు సగటున రోజుకి 326 మంది, గంటకు 13.6 మంది, ప్రతి 4.4 నిమిషాలకు ఒకరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా, మహిళలు మాత్రం సగటున రోజుకి 124 మంది, ప్రతి గంటకు 5.1 మంది, అనగా ప్రతి 12 నిమిషాలకు ఒక మహిళ ఆత్మహత్యలకు బలవుతున్నారు.. 2021లో పురుషులు 1,18,979 కాగా ఆత్మహత్య చేసుకున్న మహిళలు సంఖ్య 45,260.
31 శాతం పెరిగిన ఆత్మహత్యలు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం 2014 మరియు 2021 మధ్య తెలంగాణలో 3,507 విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణలో 2020 నుంచి 2021 మధ్య కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు 31 శాతం పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సగటున 438 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉంది, విద్యార్థుల్లో 15% పెరుగుదల ఉంది. హైదరాబాద్‌లో ఆత్మహత్యల శాతం ఎన్నడూ లేనంతగా భారీ పెరుగుదల 43% ఉండటం బాధాకరం...
బలవన్మరణాలకు కారణాలుగా..
తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోను కావడం, ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు, క్షణికావేశంలో భావోద్వేగానికి లోనయ్యే వ్యక్తులు. పరీక్షల్లో మరియు ఇతర పనుల్లో విఫలం చెందినప్పుడు సహచరులు ఎగతాళి చేయడం, ప్రేమ విఫలం కావడం, భార్యభర్తల మధ్య తీవ్ర విభేదాలు వచ్చిన సందర్భాల్లో, పిల్లల శక్తి సామర్థ్యాలను గుర్తించకుండా వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేయడం, తీవ్రమైన మానసిక వ్యాధులకు గురి అయినప్పుడు టీవీ, సోషల్ మీడియా విపరీత ప్రభావం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోలేని బలహీన వ్యక్తులు అత్తింటి వేధింపులు, వరకట్న ఒత్తిళ్లు, చదువుల భారం, ర్యాంకుల కోసం కళాశాల యజమానుల, తల్లిదండ్రుల ఒత్తిడి, అనుమానాలను, అవమానాలను భరించలేకపోవడం, దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితుల ప్రభావం, వాతావరణ పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టిల ప్రభావం ఆత్మీయులను దూరం లేదా కోల్పోవడం నయం కాని దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం, గతంలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని విఫలం చెందడం లాంటి కారణాలతో ఎక్కువ మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
చిన్న సమస్యలకే......
చాలా చిన్న కారణాలకే కొందరు తమ ఉసురు తీసేసుకుంటున్నారు. గతంతో పోల్చితే నేటి ఆధునిక సమాజంలో ఆత్మహత్యలకు పాల్పడేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. పాశ్చాత్య ప్రభావం, మానవ సంబంధాలు - ఆర్థిక సంబంధాలుగా మారిపోవడం. గతంలో తీవ్రమైన సమస్య ఎదురైనపుడే మాత్రమే అఘాయిత్యానికి ఒడిగట్టేవారు. కానీ ఇప్పుడు చిన్న సమస్యకూ చావే పరిష్కారమని భావిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాని ప్రకారం 15 నుండి 19 సంవత్సరాల వయస్సు గల యువతలో మరణానికి నాలుగో ప్రధాన కారణం ఆత్మహత్యలే. ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్ళలో 77 శాతం మంది అల్ప,మధ్య ఆదాయ వర్గాల నుంచే వారే కావడం గమనించదగ్గ విషయం.
ర్యాగింగ్ పైశాచిక ఆనందం ...
ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులను తీవ్రంగా ఏడిపించి పైశాచిక ఆనందం పొందడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదని, విద్యార్థులందరి ప్రయోజనాలను పరిరక్షించాలన్నది 2012 నాటి యూజీసీ సమానత్వ ప్రోత్సాహక మార్గదర్శకాల సారాంశం. దేశం నలుమూలల నుంచి 2017 లో యూజీసీకి 901 ఫిర్యాదులు, 2018 - 21 లో 2,790 ఫిర్యాదులు అందగా 2022 లో ఒక సంవత్సరంలోనే అవి 1,094కి పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. వాస్తవానికి ఫిర్యాదులు చేసేవారి సంఖ్య పది శాతం కంటే తక్కువేనని యూజీసీ అధ్యయనమే తేల్చింది. ర్యాగింగ్‌కు ఒడిగట్టేవారికి విధించే శిక్షలు ఊహకందని రీతిలో కఠినంగా ఉండాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు 15 సం.ల కిందటే స్పష్టీకరించింది. శిక్షల భయం తదనుగుణంగా లేకపోవడం వల్లనే సీనియర్ల వేధింపులు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి. అమాయక జూనియర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ, ఆత్మహత్యలకు ప్రేరేపించే ర్యాగింగ్ దుశ్చేష్టలను హెచ్చరికలు, జరిమానాలతో కట్టడి చేయడం అసాధ్యం. ఎంతటి వారైనా సరే శాశ్వత బహిష్కరణ చేయడమే గట్టి పరిష్కారం. కొంతమంది సున్నిత మనస్కులు తమకు జరుగుతున్న అవమానాలను, ర్యాగింగ్ వేధింపులను తట్టుకోలేక, మానసికంగా కృంగి పోయి ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆత్మహత్యల పరిశోధన నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మానసిక సహాయం.. నామోషీ కాదు..
మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో నేటికీ కూడా అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. మానసికంగా మీరు ఇబ్బంది పడుతుంటే, దయచేసి సహాయం కోసం అడగండి. ఇతరులతో చెప్పుకోవడం అడగడం చిన్నతనంగా నామోషీ కానే కాదని గ్రహించాలి. సహాయం పొందకుండా తప్పించుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మీ జీవితం అన్నిటికంటే చాలా విలువైనది..మీకు సహాయం చేయాలనుకునే వారు చాలా మంది ఉన్నారనే విషయాన్ని నమ్మండి. మిమ్మల్ని చుట్టుముట్టిన వారితో కలిసి ఫ్రీగా, సన్నిహితంగా బాధలను పంచుకోవడం, చెప్పుకోవడం ద్వారా సగం సమస్యలు పరిష్కారమవుతాయని జిడ్డు కృష్ణమూర్తి చెప్పేవారు... ఇబ్బంది ఎక్కువగా ఉంటే మానసిక వైద్య నిపుణుల సలహాలు సూచనలు పాటించి నిండు నూరేళ్ళ జీవితాన్ని కాపాడుకొని, కన్న తల్లీ తండ్రుల కడుపుకోతను దూరం చేయండి!
నివారణ ఎలా సాధ్యం
ఆత్మహత్యలు నివారించడం సాధ్యమే. కానీ ఆత్మహత్యలను నివారించాలంటే ముందుగా ఆత్మహత్యకు ప్రయత్నించిన జనాభాపై దృష్టి పెట్టాలి. కానీ, మన దగ్గర లభించే డేటా సక్రమంగా ఉండదు. దానిపై దృష్టి సారిస్తే మెరుగైన ఫలితాలు రావొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా సాధారణంగా అది ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య కంటే ఆత్మహత్యకు యత్నించిన వారి సంఖ్య 4 - 20 రెట్లు ఉంటుంది. పాఠశాల, ప్రారంభ కళాశాల స్థాయిలో రెగ్యులర్ స్థాయి జోక్యం అవసరమని, చిన్న వయస్సు నుంచే ఆత్మహత్యల ఆలోచనలు, వాటి ప్రభావాలు గూర్చి పాఠ్యాంశాల్లో చేర్చి, విస్తృతమైన అవగాహన అవసరం కల్పించడం చాలా ముఖ్యమని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి కేశవులు తెలియజేస్తున్నారు, యువత కోసం ప్రతి పోర్టల్ లో సైకలాజికల్ కౌన్సెలింగ్ అవకాశాలు, హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ.. డిప్రెషన్ మరియు ఆత్మహత్య గురించి లోతైన చర్చ జరగాలి. కుటుంబ, సమాజ, రాష్ట్ర స్థాయిలో మద్దతు వ్యవస్థలు కూడా చాలా బాగా అవసరం. అలాగే ఆ వ్యవస్థలను సక్రమమైన పద్ధతిలో మెరుగుపరచాల్సిందే. మానసిక ప్రశాంతత కోసం యోగా, మెడిటేషన్, వాకింగ్, జాగింగ్ లాంటివి నిత్యం చేయడం వల్ల సమస్యల నుంచి త్వరగా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలను తగ్గించాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది.
డా. హర్షిణీ బి కేశవులు.
ఎంబిబిఎస్.( ఎండీ )
జూనియర్ సైకియాట్రీ రెసిడెంట్
85010 61659