కొండంత ధైర్యం, భరోసా నాన్న

by Ravi |   ( Updated:2023-06-18 00:46:17.0  )
కొండంత ధైర్యం, భరోసా నాన్న
X

ఈ సృష్టిలో అమ్మ తరువాత అంతటి గొప్ప...శక్తివంతమైన... కొండంత ధైర్యంగా నిలిచే పదం నాన్న. నాన్న అనే పిలుపులో తెలియని అద్భుతం దాగి ఉంటుంది. తన ఊపిరితో మనకు అందమైన రూపాన్ని ఇచ్చి ఈ లోకానికి పరిచయం చేసే ప్రత్యక్ష దైవం నాన్న. నవమాసాలు మోసి తల్లి జన్మ ఇస్తే... అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి కంటికి రెప్పలా అమ్మతో పాటు పురిటిలో ఉన్న బిడ్డ కోసం కంటి పాపలా కాపలా కాస్తాడు నాన్న. బాధ్యతలో, కుటుంబానికి అండగా ఉండడంలో దైవం కంటే నాన్నే గొప్ప. కన్న పిల్లలకు గొప్ప పూలదారి లాంటి జీవితాన్ని ఇవ్వాలని చూస్తాడు‌‌. మనం కోరిన దానిని ఇవ్వడమే కాదు...మన మనస్సులో అనుకున్న దానిని...మన మక్కువను చూసి కోరకముందే తెచ్చిపెట్టి అప్యాయతను పంచుతాడు‌. సమాజంలో తన పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు మన కలలను తన కలలుగా చేసుకొని లక్ష్యాన్ని చేరుకోవడంలో తను చిరునవ్వులతో కృషి చేస్తాడు.

బంగారు మార్గాన్ని నిర్దేశిస్తూ..

నాన్న తనకు ఎన్ని బాధలు ఎదురైనా ఈ ప్రపంచానికి గొప్పగా మనలను అందించాలని తపిస్తాడు. పొద్దంతా చేసిన రెక్కల కష్టాన్ని మరిచి కొడుకు, కూతుళ్ల ఉన్నతిలో తన సంతోషాన్ని వెతుక్కుంటాడు. గొప్ప విజయాలు సాధించడానికి తాను ఎంతకైనా తెగించి తను వెనుక ఉండి మనలను ముందుకు నడిపిస్తాడు. తన జీవితాన్నంతా పిల్లల భవిష్యత్తుకు ధారపోసి ఒక్కో మెట్టుతో ఆకాశానికి ఎదిగే నిచ్చనలా నిలబడతాడు. తను సాధించని లక్ష్యాన్ని ...తను చేరుకోలేని గమ్యాన్ని కంటే ఉన్నతమైన స్థానంలో పిల్లలను ఉంచడానికి నిరంతరం తపిస్తాడు. గుండెల్లో ఎంత బాధ ఉన్నా... అప్యాయతను పంచుతూ ..దైవంలా కోరిన ప్రతిదీ తీరుస్తాడు. అమ్మ లాలిపాటలతో లాలిస్తే నాన్న చేతి వేలితో సమాజంలో నడకను నేర్పిస్తారు. మన తప్పు ఒప్పులను పసిగడుతూ తప్పటడుగులు వేయకుండా నడకను నేర్పిస్తూ బిడ్డల బంగారు మార్గాన్ని నిర్దేశిస్తాడు.

మనలో ధైర్యాన్ని నూరిపోయడమైనా.. మనలో గొప్ప ఆలోచనలు నింపడంలోనైనా నాన్నకు మించిన గురువు ఉండరు. మనం ఉన్నత స్థానంలో ఎదగడానికి దోహదపడే మొదటివారు నాన్నే‌. పిల్లల ఉన్నత స్థానాలకు ఎదగాలనే ఆలోచనే తప్పా మరోటి ఉండదు. అడిగిన ప్రతీది ఎంత కష్టమైన మనకు తెచ్చి పెట్టడడమే నాన్నకు తెలుసు. మన జీవితంలో మొదటి స్థానం అమ్మదైతే.. రెండో స్థానం నాన్నది. అమ్మ కనిపించే వాస్తవమైతే.. నాన్న ఓ నమ్మకం.. లాలించేది అమ్మ ఒడి.. నాన్న భుజం లోకాన్ని చూపే బడి. అమ్మ జోల పాట ఎలాగో.. నాన్న నీతి పాఠం అలాగ.

ఆయన పట్ల కృతజ్ఞతగా ఉంటూ..

తమ కన్నా మిన్నగా బిడ్డ తయారు కావాలని కలలు కనేది కన్నవారే. కాలం బాట మీద కనిపించని సాధకుడు ఎక్కుపెట్టిన బాణం బిడ్డ అయితే వంచిన విల్లువారి తల్లిదండ్రులు. చిట్టి చేతులు పట్టి లోకాలను చూపిన కన్నవారి చేతులు పిన్న వారి కోసం చివరి శ్వాస దాకా అలా ఆశగా చాచే ఉంటాయి. బిడ్డకు అంతా తానే అయ్యి ఉండే తండ్రికి కృతజ్ఞతలు తెలిపే పండుగే ఫాదర్స్‌ డే. ప్రపంచ వ్యాప్తంగా యాభై రెండు దేశాల్లో జూన్‌ నెల మూడవ ఆదివారం పితృ దినోత్సవంగా పాటిస్తున్నారు.

నాన్న ఉంటే చాలు... కొండంత ధైర్యం.. ఎందుకంటే మనల్ని దండించి అయినా... సరైనా దారిలో నడిచేలా చేసే గురువు. మన ఆందోళనలకు తను మందై మాన్పుతాడు. మనం విజేతలుగా నిలబడడానికి.. మన కోసం ఆకాశానికి ఎదిగే నిచ్చెనగా నిలుస్తారు... అమ్మ అప్యాయత చూపితే... నాన్న మన బాధ్యతను భారమనుకోకుండా.. ఎన్ని బాధలు ఎదురైనా మనదాకా రాకుండా కంచెలా కాపలా కాసి మన ఎదుగుదలకు తను శిఖరమైతాడు... తప్పు చేసినప్పుడు మన తరఫున ముద్దాయిగా నిలబడతాడు... మనం విజేతలుగా నిలిస్తే తను సంబరపడిపోతాడు. తను కొవ్వొత్తిలా కరిగిపోతూ మనల్ని ఎప్పుడూ వెలుగులో ఉంచేలా చేయడంలో నాన్న పాత్ర గొప్పది. కొడుకు, బిడ్డల మానసిక వేదనలకు గురికాకుండా తనలో తాను మనసులో అనేక సంఘర్షణలు ఎదుర్కొంటూ ..మన కోసం యంత్రంలా పని చేస్తాడు... అటువంటి తండ్రి త్యాగాన్ని మనం గుర్తించాలి. తండ్రి ఉన్న వారు కృతజ్ఞతగా గౌరవించడంతో పాటు... తండ్రి అయిన వారు తమ పిల్లల పట్ల బాధ్యతగా మెదులుకోవాలి.

(నేడు వరల్డ్ ఫాదర్స్ డే)

సంపత్ గడ్డం

దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు

78933 03516

Advertisement

Next Story