పునర్విభజనతో నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే..!

by Ravi |
పునర్విభజనతో నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే..!
X

2002లో ఆటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చేసి 2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచాలని నిర్దేశించింది. అయితే ఇప్పుడు పునర్విభజన ద్వారా కేంద్రం అనుసరించే విధానాల వల్ల నాడు కుటుంబ నియంత్రణ ద్వారా జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేసిన మన దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లనుంది. జనాభా తక్కువగా ఉండడంతో లోక్‌సభలో ఆయా రాష్ట్రాల ప్రతినిధ్యానికి భారీగా కోత పడనుంది. మరి ఈ కల్పిత సంక్షోభాన్ని దక్షిణాది రాష్ట్రాలు అధిగమించడం ఎలా..?

దేశంలో ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక జనాభా తక్కువ. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించే ఈ జనాభా లెక్కల ప్రామాణికంతో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ఉన్న 543 మొత్తం స్థానాల్లో 23.74 శాతం అంటే 129 స్థానాల ప్రాతినిధ్యం ఉండగా కేంద్రం చేసే పునర్విభజన వల్ల ఆ రాష్ట్రాల ప్రాతినిధ్యం 6.26 శాతం తగ్గిపోయి 129 స్థానాల నుండి 103 స్థానాలకు పడిపోనుంది. కానీ ఇబ్బడిముబ్బడిగా జనాభా పెరుగుదలలో పెద్దన్న పాత్ర పోషించిన ఉత్తరాది రాష్ట్రాలకు వరంగా లోక్‌సభ నియోకవర్గాల పునర్విభజన విధానాలు ఉండడం గమనార్హం. అంటే 2026లో పునర్విభజన విధానాల ద్వారా జనాభా నియంత్రణలో దక్షిణ రాష్ట్రాల సాఫల్యత వాటి రాజకీయ ప్రతినిధ్యానికే ఎసరు పెడుతుంది.

ఎలా పునర్విభజించినా నష్టం మనకే!

పునర్విభజన కోసం రెండు ప్రతిపాదనలను ఆలోచిస్తున్న కేంద్రం మొదటగా జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ స్థానాలను 848కి పెంచి దేశ జనాభాతో భాగించగా వచ్చేది దేశ పార్లమెంట్ స్థానం యొక్క సగటు జనాభా, ఈ సగటు పార్లమెంట్ జనాభా సంఖ్యతో రాష్ట్ర జనాభాను భాగిస్తే ఆ రాష్ట్రంలోని పార్లమెంటు స్థానాల సంఖ్య వస్తుంది.. ఈ విధంగా చూస్తే మన దక్షిణాది రాష్ట్రాల స్థానం పార్లమెంట్ లో 130 నుంచి 165 కు కొద్దిమేర పెరిగినప్పటికీ, నిష్పత్తి ప్రకారం చూస్తే దారుణంగా 23శాతం నుండి 19 శాతానికి పడిపోనుంది.

ఇక రెండో ప్రతిపాదన ఏంటంటే.. లోక్‌సభ స్థానాలను ప్రస్తుతం ఉన్న 545కే పరిమితం చేసి చేపట్టబోయే జనాభా లెక్కల ప్రకారం పునర్విభజించటం. ఇలా చేసినా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే. ఈ విధానంలో దేశ జనాభాను 545తో భాగిస్తారు. అప్పుడు జనాభా అధికంగా పెరిగిన రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు కూడా పెరుగుతాయి. జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తగ్గిపోతాయి. ఈ లెక్కన తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 14కు పడిపోతాయి. అంటే మూడు స్థానాలు ఎగిరిపోతాయి. అంటే పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల మాట ఏ మేరకు చెల్లుబాటు అవుతుందో అర్థం చేసుకోవచ్చు.

జనాభా నియంత్రణకు ఇది శిక్షా?

దక్షిణాది రాష్ట్రాల మాదిరిగా ఉత్తరాది కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఉత్తరప్రదేశ్, బిహార్‌లు లోక్‌సభలో తమ సీట్ల సంఖ్యను ఇప్పటికన్నా ఎక్కువగా పెంచుకోనున్నాయి. ఈ లెక్కన చూస్తే పరిపాలన, అభివృద్ధి, జనాభా నియంత్రణ వంటి అంశాలపై దృష్టి సారించిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్షగా లోక్‌సభ ప్రాతినిధ్యానికి, రాజకీయ ప్రాధాన్యానికీ కోటపడబోతుందన్న మాట. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తమై దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అసమానతలు లేకుండా లోక్‌సభ స్థానాలను పునర్విభజన చేసే విధంగా ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలతో స్థూలమైన ఏకాభిప్రాయాన్ని సాధించి తమ రాజకీయ ప్రాధాన్యతను కాపాడుకోవాలి.

తెలుగు రాష్ట్రాలకు నష్టం ఎక్కువే!

ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న రెండు విధానాల్లో కాకుండా అన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాలను పెంచేలా చర్యలు చేపడితే మంచిది. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న లోక్‌సభ స్థానాల సంఖ్యకు అదనంగా 33 శాతం పెంచడమే ఈ ప్రతిపాదన. ఈ లెక్కన ఉత్తరప్రదేశ్‌లో 27 స్థానాలు పెరుగుతాయి. తమిళనాడులో 13, ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 5 లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి. ఈ ఫార్ములా వల్ల లోక్‌సభ స్థానాల సంఖ్య అన్ని రాష్ట్రాల్లో పెరగడంతోపాటు ఇప్పుడున్న జనాభా పార్లమెంట్‌ స్థానాల నిష్పత్తి దాదాపు కొనసాగుతుంది. ఈ పెంచిన 33 శాతం సీట్లలో మహిళా కోటాను అమలు చేయవచ్చు. తద్వారా రాజకీయ ప్రాధాన్యత అసమానతలు తొలగి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో పునర్విభజన జరిగి ఆయా రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యాన్ని పార్లమెంటులో కాపాడుకోగలుగుతాయి.

ఏమరుపాటుగా ఉంటే..

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ రెండు పునర్విభజన విధానాల ద్వారా తీవ్రంగా నష్టపోనున్నాయి. మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రం నుండి బీజేపీ తరపున ఎంపీలుగా గెలిచిన వారు ఈ లోక్‌సభ స్థానాల పెంపుదల అంశంలో నోరు మెదపకపోతే రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినవాళ్లు అవుతారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి కేంద్రంపై తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడుకునే దమ్ము మన నేతలకు ఉండాలి. కాబట్టి ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా కేంద్ర బీజేపీ తమకు కొరకరాని కొయ్యగా ఉన్న తెలంగాణకు మాత్రం అన్యాయం చేసేందుకు తహతహలాడిపోతోంది..

పిన్నింటి విజయ్ కుమార్

విద్యార్థి నేత, కేయూ

90520 39109

Advertisement

Next Story

Most Viewed