- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చేతులతో కాక చేష్టలతో పద్మశ్రీ
మనిషికి వైకల్యం ఉన్నా మనసుకు మాత్రం వైకల్యం ఉండకూడదంటారు. మానసిక దృఢత్వం ఉన్నవారు శారీరక వైకల్యాలను అధిగమించడమే గాక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన వికలాంగుడు, సామాజిక సేవాతత్పరుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కె.ఎస్ రాజన్న.
కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాకు చెందిన కేఎస్ రాజన్న 11 ఏళ్ల వయసులో పోలియో బారిన పడి చేతులు, కాళ్లు చచ్చుబడి వికలాంగుడైన రాజన్న ధైర్యం కోల్పోకుండా మోకాళ్లపై నడవడం నేర్చుకున్నాడు. అందరితో సమానంగా విద్యనభ్యసించి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొందాడు. ఆ తర్వాత వికలాంగులు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, వికలాంగుల హక్కులను పరిరక్షించడానికి, వికలాంగుల సమాన అవకాశాల కోసం పనిచేయాలని నిర్ణయించుకొని సామాజిక కార్యకర్తగా శ్లాఘనీయమైన సేవలందించారు. వికలాంగుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసి వివిధ రంగాల్లో అఖండ విజయాలు సాధించారు. వందలాది మందికి ఉపాధి కల్పించి వేలాది మంది వికలాంగులకు స్వావలంబన కల్పించారు. ఆయన వికలాంగులకు ఉపాధి హామీ కల్పించడం కోసం వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి తన సంస్థ ద్వారా ప్రత్యేకంగా 500 మందికి పైగా వికలాంగులకు ఉపాధి కల్పించారు. ఈయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం 2013లో రాజన్నకు 'కమిషనర్ డిసేబుల్' పదవి ఇచ్చింది.
వికలాంగులకు ఎన్నో సేవలు అందించి..
రాజన్న 54 ఏళ్ల వయసులో రాష్ట్ర తొలి వికలాంగ కమిషనర్‌గా సభ్యులయ్యారు. ఆయన హయాంలో వికలాంగుల జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేయడంతో ఆ వివరాలను కూడా నమోదు చేయడానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అనేక సమస్యలపై అధ్యయనం చేసి వికలాంగులకు ప్రశంసనీయమైన సేవలందించారు. కమిషనర్ పదవిలో రాజన్న 2016 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం 2015 ప్రారంభంలో ఆయనను పదవి నుంచి తొలగించింది. రాజన్నను తొలగించడంపై రాష్ట్ర వికలాంగుల సంఘాలు విమర్శించాయి. కాగా ఆ తర్వాత ఏర్పాటైన సిద్ధరామయ్య ప్రభుత్వం పునః సంస్కరణల్లో భాగంగా రాజన్నను తిరిగి నియమించింది. పునర్నియామకం తర్వాత ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. కేఎస్ రాజన్న సమాజ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం “అంకితభావంతో కూడిన సామాజిక కార్యకర్త” విభాగంలో ఆయనకు 2024 మే 9న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఆయనను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. సంకల్పం, నిర్విరామ కృషితో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని మరోసారి నిరూపించిన "కె.ఎస్.రాజన్న" జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని చెప్పడంలో అతిశయోక్తి లేదు..
- కోట దామోదర్
93914 80475