సింగరేణిని రక్షించుకోవాల్సిందే..!

by Ravi |   ( Updated:2024-07-04 01:15:50.0  )
సింగరేణిని రక్షించుకోవాల్సిందే..!
X

ఉత్తర తెలంగాణలో గోదావరి, ప్రాణహిత నదుల నడుమ నాలుగు జిల్లాలలో బొగ్గు ఖనిజం నిక్షిప్తమై ఉన్న ప్రాంతమే సింగరేణి. తెలంగాణ సిరుల మాగాణి సింగరేణి. నల్ల బంగారాన్ని అందించడమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తిలో కూడా భాగస్వామిగా ఉన్నది. లక్షలాది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, ఉత్పాదక రంగాల్లో ముందున్న అతిపెద్ద బొగ్గురంగ సంస్థ కోల్ ఇండియాలో భాగమే.

బీజేపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కోల్ ఇండియాను అందులో భాగమైన సింగరేణిని వేలం పాట ద్వారా ప్రైవేటీకరించడానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 1200 కోట్ల ఖర్చుతో నూతనంగా కనుగొన్న ఆరు బొగ్గు బ్లాక్‌లను వేలం పాటలో అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కార్మిక సంఘాలు ఐక్యంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. దీనితో సింగరేణిలో అగ్గి రాజుకుంది.

కార్మిక చట్టాలను సవరించి..

సింగరేణి, 1971 సంవత్సరం నుండి 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న బొగ్గు ఆధారిత పరిశ్రమలన్నింటికి ఇది ఖనిజాన్ని అందిస్తున్నది. ఇందులో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోల్ ఇండియాలో ఉన్న సంస్థలలో సింగరేణి అత్యధిక ఎక్సలెన్స్ అవార్డులు తీసుకున్నది. దేశవ్యాప్తంగా 255 భూగర్భ గనులు, 175 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. భూగర్భ గనుల సంఖ్యను నానాటికీ తగ్గిస్తూ, ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతులిస్తూ, వాటిని ప్రైవేటీకరించడం కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నది. గత 20 సంవత్సరాల నుండి సింగరేణిలో ఒక్క భూగర్భగనిని కూడా ప్రారంభించలేదు. బొగ్గు రంగ సంస్థలను స్వదేశీ విదేశీ పెట్టుబడిదారీ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే 44 కార్మిక చట్టాలను సవరించి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా చట్టాలను మార్పు చేసి పార్లమెంటులో బిల్లు కూడా ప్రవేశపెట్టింది. తెలంగాణలో సింగరేణికి రావలసిన బొగ్గు బ్లాకులు సత్తుపల్లి, శ్రావణపల్లి, కోయగూడెం, కళ్యాణ్ ఖని తదితర బ్లాకులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేసింది. దీనికి నిరసనగా కార్మిక వర్గం తిరగబడి, పోరాటం చేయడంతో తాత్కాలికంగా నిలుపుదల చేసింది.

వేలం నిర్వహించాల్సిందే అంటూ..

నూతన ఆర్థిక సంస్కరణల వేగం పుంజుకున్నది. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వాలు సంరక్షకులుగా ఉండాలి. కానీ, తామే యజమానులుగా భావిస్తూ దేశ విదేశీ సంస్థలకు వీటిని కారు చౌకగా కట్టబెడుతున్నారు. ఈ కారణంగా కార్మికులు రోడ్డున పడుతున్నారు. నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది. గడిచిన 9 ఏళ్లలో ఒక్క బ్లాక్ కూడా వేలం వేయలేదని, ఈ నెలాఖరులోగా వేలం నిర్వహించాలని, ఒకవేళ ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే, తామే వేలం చేపడతామని కేంద్ర గనుల శాఖ స్పష్టం చేసింది. ఇందుకు తెలంగాణాకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వం వహించడం విషాదకరం. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి వేలం పాటను నిలిపివేయాలని, సింగరేణిని రక్షించాలని రాజకీయాలకతీతంగా ఉద్యమ బాట చేపట్టారు. సింగరేణిలో ఒకప్పుడు లక్షా పదహారు వేల మంది పని చేస్తూ 20 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేవారు. నేడు సుమారు 100 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరింది. అంటే నాలుగు రెట్లు ఉత్పత్తి పెరిగినందుకు కార్మికుల సంఖ్య కూడా దరిదాపు 5 లక్షలకు పెరగాల్సి ఉంది. కానీ నూతన ఆర్థిక సంస్కరణల వల్ల కార్మికుల సంఖ్య కేవలం 35 వేలకే పరిమితం కాగా, 25 వేల మంది ప్రైవేటు ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ప్రైవేటీకరణ ఆత్మహత్యా సదృశ్యమే!

సింగరాయపల్లి, ఇల్లందు సమీప గ్రామంలో మొదటగా బొగ్గు ఖనిజం బయటపడ్డది. ఆరంభంలో ఉత్పత్తి ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండగా 1920 డిసెంబర్ 23న ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా 1925 నుండి విద్యుత్పత్తిలో భాగమైంది. నేడు రామగుండం, పాల్వంచ, జైపూర్, భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 134 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి ప్రైవేటీకరణ ఆత్మహత్యా సదృశ్యమే కాగలదు. పలు సందర్భాల్లో బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని, కాంట్రాక్టును రద్దు చేయమని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా టెండర్లను రద్దు చేయలేదు.

ఉపాధిని దెబ్బతీస్తున్న యంత్రాలు..

కార్మికుల ప్రమేయం తగ్గించి బొగ్గు ఖనిజాన్ని పెద్ద మొత్తంలో తక్కువ కాలంలో యంత్రాల ద్వారా వెలికి తీసేందుకు ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపడుతున్నారు. వీటి వలన ఆయా గ్రామ ప్రాంతాల్లో వందల మీటర్ల లోతున తవ్వడం వల్ల అవి బొందల గడ్డలుగా మారుతున్నాయి. మట్టి గుట్టలుగా ఏర్పడటం వల్ల పంటలు పండటం లేదు. ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాలు కావడం వల్ల పునరావాసం కూడా పెనుసవాలుగా మారుతుంది. సింగరేణిలో యంత్రాల ద్వారా ఉత్పత్తి జరగడం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. భూగర్భగనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరిపితే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అందుకే బహుళజాతి కంపెనీలకు, విదేశీ కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే ప్రైవేటీకరణ విధానాలను ప్రజలు, కార్మిక సంఘాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.

అన్ని యూనియన్లూ కదలి రావాలి

ఈ ప్రాంతాల నుండి వెలికి తీసిన ఖనిజాన్ని ఇక్కడి పరిశ్రమలకు గాని, అభివృద్ధికి కానీ ఉపయోగించాలి. కానీ దేశ, విదేశీ కార్పొరేట్ శక్తులు మాత్రమే లబ్ధి పొందుతున్నాయి. ఈ అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం ఉండటం లేదు. ప్రజలు జీవించే హక్కుకు కూడా భంగం కలుగుతోంది. అందుకే అభివృద్ధిగా ప్రచారం జరుగుతున్న దీనిని బుద్ధి జీవులు విధ్వంసక అభివృద్ధిగా అభివర్ణిస్తున్నారు. విధ్వంసం ఎన్నటికీ అభివృద్ధి కాదని పాలకుల చర్యలను ప్రశ్నించే, నిరసించే ప్రజలపైన, రచయితల పైన, కార్మికుల పైన, కవుల పైన, మేధావుల పైన, బుద్ధి జీవుల పైన పాశవిక చట్టాలు విరుచుకు పడుతున్నాయి. పౌర, ప్రజాస్వామిక వాదులు గొంతు విప్పాల్సిన సందర్భం ఇది. సింగరేణిని రక్షించుకోవడం కోసం అన్ని ట్రేడ్ యూనియన్‌లూ ఒక్కటిగా కదలిరావడం శుభ పరిణామం.

రమణాచారి

99898 63039

Advertisement

Next Story

Most Viewed