- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైవిధ్యాత్మక సాహితీ విరాగి... ఆలూరి బైరాగి
ప్రతి మాటకీ శక్తి ఉంది పదును ఉంది.
ప్రతి మాట అర్థం ఉంది. ఔచిత్యం ఉంది
కవి జీవితం నుంచి కవిత్వం వెలువడడం తాదాత్మ్యకతను కనబరుస్తుంది. కవితా వస్తువు కవి జీవితం నుంచి రావడం కవిత్వానికి సజీవకత - శాశ్వతత్వం కలుగజేస్తుంది. జీవన ప్రయాణంలో ఎక్కువ కవిత్వం వెలువరించిన కవులు, ప్రసిద్ధి పొందిన వారు, తెలుగు నేల పైన ఎక్కువగా ఉన్నారనిపిస్తుంది. జీవితంలో ప్రతీ దశలోనూ మెరుపులు మరకలు కవులను స్పందింపజేస్తాయి. తమ అనుభవాలను ఆవేదనలను పంచుకోలేని, పరిష్కరించుకోలేని ఆత్మన్యూనతా జీవులు గొప్ప కవిత్వాన్ని సృజియించిన సంఘటనలు తెలుగు కవితా వేదికపైన మిక్కుటంగానే ఉన్నాయి. నిరాశమయ జీవితం నుంచి నిప్పులు కురిపించిన కవివరేణ్యులున్నారు. వచన కవితా ఉద్యమం ఆరంభం నుంచి కూడా అనగా శిష్ట్లా నుంచి ఈ ఒరవడి ఓ నిరంతర స్రవంతిలో ప్రవహిస్తున్నది. అలిసెట్టి, కాళోజీ వంటి వారు జీవితంను నిర్వచనాలకు లొంగని అద్భుతమైన అవకాశాల గనిగా చెబుతూనే దోపిడీ లేని సమాజ సృష్టి సాధ్యం చేయాలనే భావజాలాన్ని ప్రకటించారు. అన్నపు రాశులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట (నా గొడవ - కాళోజీ) వంటి రచనలు చేసిన ఒరవడిలో ఓ పడిలేచిన కెరటం జీవితపు మాధుర్యాల పట్ల నిరాసక్తత కలిగిన విరాగి ఆలూరి బైరాగి.
హిందీ చందమామ సంపాదకులు
బైరాగి గా సాహిత్య ప్రపంచం గుర్తించిన అతను అసలు పేరు ఆలూరి బైరాగి చౌదరి. 1925 నవంబర్ 5 వ తేదీన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించారు. 1978 సెప్టెంబర్ 9 న మరణించారు. తల్లి సరస్వతి, తండ్రి వెంకట్రాయుడు. బైరాగికి ముందు ఇద్దరు బిడ్డలు చనిపోవడంతో విచిత్రమైన పేర్లు పెట్టడం ఆచారమైన నాటి రోజుల్లో మూడవ బిడ్డగా జన్మించడం చేత పేరు ముందు “బైరాగి చేరిపోయింది. తరువాత ఆ పేరు స్థిరపడిపోయింది. బైరాగికి ముగ్గురు తమ్ముళ్లు భాస్కరరావు, గురవయ్య, సత్యం (ఇతడు లబ్ధప్రతిష్ఠుడైన వ్యంగ్య చిత్రకారుడు) ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. పెద్దగా చదువుకోలేదు. అతని పాండిత్యమంతా స్వాధ్యాయనమే. తండ్రి దేశభక్తుడు. జాతీయభిమాని కావటంతో బైరాగికి చిన్నతనం నుంచి హిందీ నేర్పించడం ప్రారంభించారు. హిందీ పరీక్షలన్నీ ఉత్తీర్ణుడైన బైరాగి చందమామ హిందీ ఎడిషన్‌కు సంపాదకులుగా వ్యవహరించారు. ఇందుకు కారణం ఆయన పినతండ్రి చక్రపాణి గారు. లౌకికం తెలియని మనిషి. మాట కటువు. మనసు వెన్న. తన పదిహేనవ ఏటనే హిందీలో కవిత్వం రాశాడు. అతని కవిత్వాన్ని హిందీ పత్రికలు ప్రచురించాయి. తండ్రి మరణంతో అతని మనసు వికలితం అయిపోయింది. ఒక లక్ష్యం లేకుండా తిరిగే ఆ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమం ఆకర్షించింది. రహస్య సమావేశాలు ఏర్పాటు, కరపత్రాల పంపకం వంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.
బైరాగిది నిరాడంబర జీవితం. తనకోసం ఏమైనా చేయగల తమ్ముళ్లు ఉన్నా వారినేమాత్రం ఇబ్బంది పెట్టలేదు. జీవితకాలంలో ఎవరికీ తలవంచని అతను చరమాంకంలో ఎవరెంత చెప్పినా వైద్యం చేయించుకోక 1978 సెప్టెంబర్ 9 వ తేదీన మరణించారు. 200 పేజీల తెలుగు, 200 పేజీల హిందీ, 200 పేజీల ఆంగ్ల కవితలు, ఒక తెలుగు నవల వంటివి ఆయన తమ్ముడు సత్యం “ఆగమగీతి పేరుతో ప్రచురించారు. హిందీ కవితలు కొన్నింటిని హిందీ అకాడమీ వారు “పూటా దర్పణ్ పేరుతో ప్రచురించారు. బైరాగి రచనల్లో ప్రసిద్ధి పొందిన రచన 'నూతిలో గొంతుకలు'. నూతనత్వం కోసం ఆయన చేసిన అన్వేషణ ఈ గ్రంథంలో కనిపిస్తుందంటారు కవి కుందుర్తి. 'నాక్కొంచెం నమ్మకమివ్వు' అనే ఆయన గేయం, తరువాత వచ్చిన దిగంబర కవిత్వానికి దారి చూపిందని చెప్పవచ్చు. “శబ్ద ప్రయోగంలో పొదుపు, వ్యర్ధ పదాలను ప్రయోగించకపోవడం, శైలి మీద, చెప్పదలచుకొన్న విషయం మీద సాధికారం బైరాగి సొత్తు అని అంటారు ఎ.ఎస్. రామన్. బైరాగి అరాచకవాది, నిరాశావాది అని అన్న వారు కూడా ఉన్నారు. ఒక్కసారి ఆయన జీవితాన్ని పరిశీలిస్తే “బైరాగిలో సామాజిక సంస్కర్త, ఉగ్రరూపం ధరించిన ఉద్యమస్ఫూర్తి, దీప్తి కనిపిస్తాయి.
సాహితీ 'ఉగ్రవాది' ఆలూరి
'చీకటి నీడలులో యుగయుగాలుగా మ్రొక్కిన శిరసుల, వణికే చీకట్ల చల్లని మెత్తని స్పర్శల రాపిడి చెందిన బండరాయి ఇది, వదలని మెదలని మొండిరాయి ఇది' అంటారు. “అస్తిత్వవాదం” “ఆధునిక తాత్విక సిద్ధాంతాలు ఆయన మీద పనిచేసాయి. హిందీలో ఆయన రాసిన ఓ కవితలో “మానవత్వం లేదు ఇది మూగపశువుల గుంపుజీవచ్చవాల పెండ్లి ఊరేగింపు'' అని అంటారు. సమాజంలో ఆకలి, అసమానతలు ఎంతగా కష్టించినా కడుపు నిండకుండా ఒంటినిండా గుడ్డా గూడు లేని లక్షలాది అన్నార్తుల ఆక్రందనలు బైరాగిలో “ఉగ్రవాది”ని ప్రేరేపించాయి. అతనికి తాజ్ మహల్ ఒక ద్రోహి, కుళ్ళిన విలాస చిహ్నం, అతీత శవ దుర్గంధం. మాకెందుకు షాజహాన్ ప్రణయం మానవ శ్రమ మింగిన ప్రళయం ఈ కుళ్ళిన విలాస చిహ్నం, నిర్ధయ మోహపాశ చిహ్నం తాజమహల్ పడగొట్టండోయ్ రాయి రాయి విడగొట్టండోయ్ అన్నారాయన. తాను చూసిన సమాజంలో ఆకలి, దరిద్రం విచ్చల విడిగా విలయ తాండవం చేస్తుంటే ఇటు మానవ శ్రమ దోపిడితో నిర్మితమైన కట్టడాలు అనవసరమనేది ఆయన వేదన. మానవజాతి భవితవ్యం పట్ల బైరాగి వేదన 'నూతిలో గొంతుకలు' ఓ ప్రతీకార చిత్రంగా శీర్షికను నిర్ణయించటమే కాకుండా కవితల్లో కూడా ప్రతీకాత్మకత దృశ్యాలు చిత్రించిన విధం అబ్బురపరుస్తుంది.
ప్రతి మనిషీ ఒక చెరలో ఉరికంబం
నేటి మానవుని మానసిక సంఘర్షణను, మానవ వికాస దశలలో చీలిన బాటలు వెంటపడి మనిషి ఆవేదన పూరిత జీవిత పథాలను హమ్లెట్, అర్జునుడు, రాస్కల్నికోవ్ ద్వారా వ్యక్తీకరిస్తాడు. వైవిధ్యం గల మూడు పాత్రలు వాటి ద్వారా.. వాటి మధ్యన విస్మయకర భావైక్యతను సాధించడం కవిగా తన విశ్వజనీనతకు, మౌలిక దృక్పథానికి చిహ్నం. ''ప్రతీ మనిషి ఒక గదిలో చెదపురుగులు ప్రతి మదిలో ప్రతి మనిషీ ఒక నదిలో సుడిగుండం ప్రతి ఎదలో ప్రతి మనిషీ ఒక చెరలో ఉరికంబం ప్రతి హృదిలో'. ఇలా ఈ కవితను ముగ్గురు మూడు రకాల దృక్పథాలకు ప్రతీకలు. హమ్లెట్ కర్మకు పూర్వం, అర్జునుడు కర్మక్షేత్రం, రాస్కల్నికోవ్ సందేశం కర్మానంతరం. వీటి మధ్య సంక్లిష్టతల వివరణ బైరాగి సామర్ధ్యానికి ప్రతీక. బైరాగి సన్మానాలను, సోత్కర్షలను, కృత్రిమ సానుభూతి సందేశాలను నిరసించి అవకాశవాదపు ఆర్భాటాలు అభినందనలు కాదన్నారు. అయినా పొగడని కవిని సమాజం సన్మానించదు కదా... కృత్రిమ దారులు పరిచిన సమాజపు బాటలో కాగిత పువ్వుల మెరుపులను, ప్లాస్టిక్ పూల సువాసనలనూ ఆఘ్రాణించి ఆనందించే సమసమాజ నాగరికత వైఖరికి స్వచ్ఛపు స్వేచ్ఛా విహంగాల వంటి సాహిత్యపు జీవులు దూరంగానే ఉంటారు. ఒక అలిశెట్టి.. ఒక ఆలూరి అటువంటి వారే.
కవిత్వం జీవన మధనసారం
“ఏదో రాస్తున్నానని కీర్తి కనక సౌధపు తలవాకిట పడిగాపులు కాస్తున్నానని ఎంచకు బ్రహ్మాండపు గోదాలో, మిత్రుల నెత్తుట తడిసిన జేగురు మంటిలోన కాలునిపై కలబడి కుస్తీ పడుతున్నాను కాళీయుని ఫణాల పైన స్వేచ్ఛా నృత్యం చేస్తున్నాను'' అనటంలో కవిత్వం నాకు హాబీ కాదు జీవన మధన సారమంటారు. ఆయన దృష్టిలో కవిత “చల్లని మలాము కాదు కవిత నాగుబాము, నాగుబాము కాటేస్తుంది జాగ్రత్త దీని కాటుకు విరుగుడు లేదు జాగ్రత్త.'' రాజకీయ రంగంపై “రైతులకు కూలీలకు టోపీ వేస్తారు తేనె పూసిన కత్తులు, తడిగుడ్డలు అక్కర్లేదు శుద్ధఖద్దరుతో గొంతులు కోయవచ్చు గొర్రెలాంటి ప్రజాస్వామ్యం, జేబుదొంగల సోషలిజం నేటి సమాజానికి ఓ సజీవ చిత్రంలా కనిపిస్తుంది ఈ కవిత “గోబెల్స్ చెప్పిందే నిజం నిజం....గాంధీజీ శిష్యుల రాజ్యంలో రెండే రెండుట జాతీయ పరిశ్రమలు… వ్యభిచారాలు, దొంగ సారాబట్టీలు”. సాహో బైరాగి.... సాహో.... నీ ధైర్యసాహసాలకు...... నీ కలం పదునుకు...
మరణాన్ని ఆహ్వానించిన అపరకవి
బైరాగి మరణానికి భయపడని విరాగి... మృత్యువంటే ఓ సరదా....మృత్యువు ఆయనకు చిరపరిచిత మిత్రుడు.. మృత్యువు ఏదో ఒకటి చూచిపోయే అతిథి వెంటవడిన అప్పు పుట్టుకలో పుట్టిన చావు చావులో చస్తుంది. “మనిషిలో అన్నీ ఉన్నాయి కానీ నమ్మకమొకటి లేదు” అని ధైర్యంగా మరణాన్ని ఆహ్వానించిన అపర కవితా భీష్ముడు... ఆలూరి బైరాగి చౌదరి. ఆంగ్ల సాహిత్యంలో ఫ్రాన్సిస్ థాంప్సన్‌కు ఎంత ప్రాముఖ్యం ఉందో బైరాగికి మన సాహిత్యంలో అంత ప్రాముఖ్యం ఉంది. స్వర్గ భైరవం (HOND OF HEAVEN) చాలా గొప్ప గీతమంటారు. ఆ స్వర్గ భైరవాన్ని నేను బైరాగిలో చూశాను.. అని గో. రా. శాస్త్రి గారి వ్యాఖ్యానం....తెలుగు కవితాప్రియులందరికీ ఈ వ్యాఖ్యానం వర్తిస్తుంది.
(నేడు ఆలూరి బైరాగి జయంతి )
-భమిడిపాటిగౌరీ శంకర్
94928 58395
- Tags
- Aluri Bairagi